సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మామిడి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. మొన్నటి దాకా ‘ఫలం’చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానతో కాయలు రాలిపోగా, ఉన్న కొద్దిపాటి మామిడిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అకాల వర్షాలకు తోడు గడ్డిఅన్నారం నుంచి మార్కెట్ తరలింపు, కొత్తగా ఏర్పాటుచేసిన కోహెడ మార్కెట్ కూలడం మామిడి రైతుకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అమ్మకాలకు డిమాండ్ ఉండే ఈ సీజన్‌లో లాక్‌డౌన్ ఉండటం, అమ్మకాలు తగ్గడం వారి కష్టాలను రెట్టింపు చేస్తోంది.
‘తీపి’కరువైన మామిడి
రాష్ట్రవ్యాప్తంగా 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. జగిత్యాల, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాలు ఈ తోటలకు ప్రసిద్ధి. సగటున ఏటా మామిడి దిగుబడి 5 లక్షల టన్నుల నుంచి 6 లక్షల టన్నుల వరకు ఉంటుంది. ఈ ఏడాది వడగండ్ల వానలు, అకాల వర్షాలతో పంట దిగుబడి 4 లక్షల టన్నులకు తగ్గిందని అంచనా. జగిత్యాల మామిడికి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మామిడికి మంచి ఆదరణ ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, దషేరి, రసాలు వంటి రకాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ రకాలన్నీ బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో పాటు అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతవుతుంటాయి. లాక్‌డౌన్ కారణంగా ఈసారి దారులన్నీ మూసుకుపోయాయి. హోల్‌సేల్ వ్యాపారులు కూడా ముందుకు రాకపోవడంతో ఎగుమతుల్లేక స్థానిక మార్కెట్లపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది.
ఉన్న ఒక్క మార్కెట్‌లో అష్టకష్టాలు..
మామిడి అమ్మకాలకు గడ్డిఅన్నారం మార్కెట్ ప్రధానమైనది. అయితే, ఈ మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలతో భౌతికదూరం పాటించే అవకాశాలు లేకపోవడం, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ద్రాక్ష, బత్తాయి, మామిడి వాహనాల నుంచి పండ్లు దించేందుకు హమాలీలు వెనకాడటం, దీన్ని మూసివేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంలో దీన్ని గత నెల 22 నుంచి తాత్కాలికంగా మూసివేశారు.
మార్కెట్‌ను వికేంద్రీకరణ చేసి మామిడి మార్కెట్‌ను కోహెడకు తరలించారు. అక్కడ ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పెరుగుతున్న సమయంలో సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులకు షెడ్డు కూలిపోవడం కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. మార్కెట్‌కు రోజూ 1,500 టన్నులకుపైగా మామిడి వస్తుండటంతో మళ్లీ మార్కెట్‌ను గడ్డిఅన్నారం తరలించారు. మూడ్రోజుల పాటు ఇక్కడే మామిడి అమ్మకాలు కొనసాగనున్నాయి. మళ్లీ మూడ్రోజుల్లో కోహెడ మార్కెట్‌ను పునరుద్ధరించి అక్కడికే తరలిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు సరుకు ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎవరికి, ఎంతకు అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.
కలిసిరాని సీజన్
ఏటా సీజన్ ప్రారంభంలోనే మామిడిపండ్లకు మంచి ధర పలుకుతుంది. ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. గతేడాది క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ధరరాగా ఈసారి రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్యనే పలుకుతోందని రైతులు వాపోతున్నారు. ఏటా మార్చిలో మొదలయ్యే మామిడి సీజన్ జూన్ వరకు కొనసాగుతుంది. ఏప్రి ల్, మే నెలల్లో మామిడి మార్కెట్ కళకళలాడుతుండేది. ఈసారి సీజన్ ఆరంభంలోనే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో పరిస్థితి తారుమారైంది. పచ్చళ్లకు వాడే మామిడిని కొనేవారే లేరు. బేకరీలు, స్వీట్ దుకాణాలు లేక జామ్‌ల తయారీ నిలిచిపోయింది. మామిడి తాండ్ర పరిశ్రమలు మూతపడి మామిడి కొనుగోళ్లు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment