చికెన్ అండ్ ఎగ్ మేళాలో ఎంపీ రంజిత్‌రెడ్డి, మంత్రులు తలసాని, కేటీఆర్, ఈటల, శ్రీనివాస్‌గౌడ్
ఖైరతాబాద్: రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిలో ఏ ఒక్కరికీ చికెన్, గుడ్డుతో ఆరోగ్యపరమైన సమస్యలు రాలేదని.. దుష్ప్రచారాలు, అపోహలు, అనుమానాలతో జరుగుతున్న వైరల్ క్యాంపెయిన్ తప్పని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. చికెన్, ఎగ్‌తో కరోనా వైరస్ రాదని, ఆరోగ్యానికి మంచి పౌష్టిక విలువలు లభిస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ అండ్ ఎగ్ మేళాను ఆయన ప్రారంభించారు. మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలసి ఆయన చికెన్ తిని చూపించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుడ్డు, చికెన్‌లో ఉన్న పోషక విలువలు ఏ ఆహార పదార్థంలో లేవన్నారు. మనదేశంలో అధిక మంటపై ఉడికించి తినే వంటలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు లేవన్నారు. చికెన్, గుడ్డు తినడంతో కోవిడ్ వ్యాపిస్తుందన్న వదంతులు నమ్మవద్దని, ఆరోగ్య శాఖ మంత్రే వచ్చి చికెన్, గుడ్డు తినడంతో ఎలాంటి హాని జరగదని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇంకా అపోహలు పెట్టుకోవదన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లాల్లో కూడా చేయాలని.. దీనికోసం నటులు, డాక్టర్లు ముందుకు రావాలన్నారు. తమ కుటుంబంలో ముఖ్యమంత్రితో సహా అంతా రోజూ చికెన్ తింటామని కేటీఆర్ తెలిపారు. త్వరలో తెలంగాణ పౌల్ట్రీ పాలసీ కూడా రాబోతుందని వివరించారు.
అనారోగ్య సమస్యలు రావు...
మన ఆహారపు అలవాట్లకు కోవిడ్ వైరస్ వచ్చే అవకాశం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేరళలో 3 కేసులు నమోదయ్యాయి తప్ప, మన రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదన్నారు. మన వద్ద సగం ఉడికించి తినే ఆహారపు అలవాటు లేదన్నారు. వైరల్ వార్తల కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైందన్నారు. 2 నెలల కాలంలో రూ.500 కోట్ల పైచిలుకు నష్టపోయిందన్నారు. వదంతులు నమ్మవద్దని, కరోనా వైరస్‌కు చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదని తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
చికెన్ అండ్ ఎగ్ మేళాలో 6,200 కిలోల వివిధ రకాల చికెన్ వంటకాలు, 22వేల గుడ్లు నగరవాసులకు ఉచితంగా అందజేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్‌రావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సురేందర్, ఫౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు, రైతులు, నగరవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుదీప్, లిప్సిక, లిటిల్ సింగర్ సాయివేద పాటలతో అలరించగా, బిత్తిరి సత్తి మాటలతో ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment