ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. దేశ రాజధానిలో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పౌల్ట్రీ షాపులు, మాంసం దుకాణాలు, ప్రాసెసింగ్ యూనిట్లు అమ్మకాలు జరుపకూడదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఎన్‌డీఎంసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది.
ఇక ఎస్‌డీఎంసీ సైతం.. ‘‘బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ హోల్‌సేల్ మార్కెట్లు మూసివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాం. చికెన్, కోడిగుడ్లతో కూడిన వంటకాలు వడ్డించకూడదని రెస్టారెంట్ల యజమానులకు స్పష్టం చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించిన వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం’’ అని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కాగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో ఉడికిన మాంసం, గుడ్లు తినవచ్చని ఆరోగ్య శాఖ నేడు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. (చదవండి: బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?)
ఈ క్రమంలో తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇక ఢిల్లీలో ఎనిమిది బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూసినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. మయూర్ విహార్ ఫేజ్ 3, సంజయ్ లేక్, ద్వారక నుంచి సేకరించిన నమూనాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు ప్రకటించింది.(చదవండి: 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ పంజా)
Comments
Please login to add a commentAdd a comment