న్యూఢిల్లీ: సాధారణంగా చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయాలంటే కట్టెలు వినియోగిస్తారు. కానీ ఇకపై ఢిల్లీలో కట్టెల బదులు ఆవు పేడతో చేసిన పిడకలు వినియోగించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమలు చేయనున్నట్లు మేయర్ అనామిక ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు వాడే కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను వినియోగించాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శ్మశానవాటికల్లో దహన సంస్కారాలకు ఆవుపేడతో చేసిన పిడకలను వాడాలని నిర్ణయించినట్లు మేయర్ తెలిపారు. ఆవుపేడతో చేసిన పిడకలతో మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. ఇప్పటికే ఆవుపేడతో చేసిన పిడకలను శ్మశానవాటికల వద్ద సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. దీనికి పలు సామాజిక సంస్థల నుంచి మద్దతు లభిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
పిడకలతో దహన సంస్కారాలు సంప్రదాయమని.. దీంతోపాటు ఖర్చు తక్కువ ఉండడంతో పేదలకు ప్రయోజనకరమని మేయర్ అనామిక వివరించారు. బీజేపీ పాలిత కార్పొరేషన్ కావడంతో ఇలాంటి నిర్ణయం తీసకోవడంతో ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం అమలుచేసింది. గంగానది కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేలా 2018లో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను వినియోగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పిడకలతో దహనం చేస్తే దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. నాగపూర్, జైపూర్, రోహతక్, జలగావ్, ఇండోర్, రాయ్‌పూర్, రూర్కెలాల్లో కూడా ఆవుపేడతో తయారుచేసిన పిడకలతోనే దహన సంస్కారాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment