న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జహంగీర్‌పురిలో కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. జహంగీర్‌పురి కూల్చివేతలపై 'స్టేటస్ కో' (యధాతథ స్థితి) అమలు చేయాలని ధర్మాసనం వెల్లడించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌డీఎమ్) మేయర్ కూల్చివేతలు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.
కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల అనంతరానికి వాయిదా వేసింది.అయితే దేశవ్యాప్తంగా కూల్చివేతలపై స్టే విధించాలన్న సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
సంబంధిత వార్త: జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కాగా గత శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన ఢిల్లీలోని జహంగీర్‌పురి పరిసరాల్లో కూల్చివేతలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎల్‌ఎన్ రావు, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌డీఎంసీ) అధికారులు బుధవారం ఉదయం భారీ బందోబస్తు కూల్చివేతకు దిగారు. కొన్ని తాత్కాలిక, శాశ్వత కట్టడాలను నేలమట్టం చేశారు. నోటీసులివ్వకుండానే కూల్చివేయడం ఏమిటని స్థానికులు ఆగ్రహించారు. బుల్‌డోజర్లను అడ్డుకున్నారు. కూల్చివేతలను తక్షణం అడ్డుకోవాలంటూ జమైత్ ఉలెమా–ఇ–హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సంబంధిత వార్త: Jahangirpuri Bulldozers: రెండు గంటల హైడ్రామా తర్వాతే..
Comments
Please login to add a commentAdd a comment