అమ్మో ! అమెరికా ‘కోళ్ల కాళ్లు’ నడిచొస్తున్నాయ్‌ | ChickenLegs From America to walk into India | Sakshi
Sakshi News home page

అమ్మో ! అమెరికా ‘కోళ్ల కాళ్లు’ నడిచొస్తున్నాయ్‌

Published Wed, Mar 21 2018 3:29 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ChickenLegs From America to walk into India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘అమెరికన్‌ చికెన్‌ లెగ్స్‌ సూన్‌ బీ వాకింగ్‌ ఇన్‌ టూ ఇండియన్‌ స్టోర్స్‌ (అమెరికా కోళ్ల కాళ్లు త్వరలో భారతీయ షాపుల్లోకి నడిచి వస్తాయి)’ సరదాగానో, ఆందోళనతోనో చేసిన ఈ వ్యాఖ్య త్వరలో నిజం కాబోతోన్నది. శీతలీకరించిన కోళ్ల కాళ్ల కంటేనర్‌ను భారత్‌కు షిప్పింగ్‌ చేస్తున్నట్లు భారత ప్రభుత్వం నుంచి తొలి పర్మిట్‌ను దక్కించుకున్న ‘యూఎస్‌ఏ పౌల్ట్రీ అండ్‌ ఎగ్‌ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌’లో సభ్యత్వం కలిగిన అమెరికాలోని ‘గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌’ కంపెనీ ప్రకటించింది. కోళ్ల కాళ్ల (చికెన్‌ లెగ్స్‌)ను అమ్మేందుకు గత దశాబ్దకాలంగా అమెరికా కంపెనీలు చేస్తున్న పోరాటాన్ని మన భారతీయ కోళ్ల పరిశ్రమలు అడ్డుకుంటు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో గతేడాది జూలై నెలలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లూటీఓ) ముందు భారత్‌ ఓడిపోయింది.

ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలు దాటిన భారతీయ కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు అమెరికా నుంచి కోళ్లు, ముఖ్యంగా కాళ్లు దిగుమతిని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. అందుకు భారత్‌ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థరహితమంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ గతేడాది నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. దిగుమతులను అనుమతించేందుకు సరైన మార్గదర్శకాలతో ముందుకు రావాల్సిందిగా ఆదేశిస్తూ 18 నెలల గడువును ప్రసాదించింది. ఈ గడువు మరో తొమ్మిది నెలలు ఉండగానే ప్రభుత్వం మొదటి పర్మిట్‌ను ఎందుకు జారీ చేసిందో తెలియదు. అమెరికా నుంచి కోళ్ల కాళ్లను అనుమతించాలనుకుంటే కఠినమైన నిబంధనలను అమలు చేయాలంటూ ‘పౌల్ట్రీ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అధ్యక్షుడు రమేశ్‌ ఖత్రి ఇటీవలనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

శీతలీకరించిన కోడి కాళ్లు మూడు నెలల ముందు సంహరించిన కోడిది కాకూడదని, జన్యు మార్పిడి విత్తనాలతో పండించిన మొక్కజొన్న, సోయాను కోళ్లకు ఆహారంగా పెట్టరాదని, జంతువుల కొవ్వు, ముఖ్యంగా పంది కొవ్వును కోళ్లకు దాణాగా వేయరాదని ఆ లేఖలో ఖత్రి సూచించారు. అమెరికాలో కోళ్ల ఎదుగుదల కోసం మొక్కజొన్న, సోయా, పంది కొవ్వునే దాణాగా ఉపయోగిస్తారు. వీటిని వద్దంటే అమెరికా నుంచి దిగుమతులను వద్దనడమే. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం వారం క్రితమే స్పందించి తొలి పర్మిట్‌ను మంజూరు చేసింది.

కోళ్ల కాళ్లే ఎందుకు దిగుమతి?
అమెరికా నుంచి ఏ కోళ్ల పరిశ్రమైనా కోడి కాళ్లనే దిగుమతి చేయాలని కోరుకుంటుంది. ఎందుకంటే అమెరికన్లు ఎక్కువగా కోడి బ్రెస్ట్‌నే తింటారు. కోడి కాళ్లను తినడానికి అసలు ఇష్టపడరు. భారతీయులు కోడి కాళ్లను అమిత ఇష్టంగా తింటారు. ఇందుకు పలు కారణాలు చెబుతారు. తెల్ల అమెరికన్లు కోడిలో తెల్లటి భాగం, అంటే బ్రెస్ట్‌ను తినడం మొదటి నుంచి అలవాటు చేసుకున్నారట. ఆఫ్రికన్‌ అమెరికన్లు కాళ్లను తినడం అలవాటు చేసుకున్నారట. అమెరికన్లు ఎవరైనా నైఫ్, ఫోర్క్‌ ఉపయోగించి తింటారు. వీటి ద్వారా కోడి కాళ్ల నుంచి మాంసాన్ని వేరు చేసి తినడం కొంత ఇబ్బంది. అందుకని వారు వాటిని అంతగా ఇష్టపడరట. కోళ్లలో కొవ్వు ఎక్కువగా కాళ్లలో పేరుకుంటుందని, ప్రొటీన్లు బ్రెస్ట్‌లో ఉంటాయని ఇప్పుడు కొత్త వాదన మొదలైంది. ఈ వాదన భారత్‌లో కూడా ప్రచారంలోకి రావడంతో జిమ్ములకెళ్లే జిమ్మీలు కోడి బ్రెస్ట్‌నే కోరుకుంటున్నారు.

అందుకనే అవకాశం ఉంటే అమెరికన్‌ రైతులు ‘రెండు బ్రెస్ట్‌లు ఒక కాలు మాత్రమే ఉండే’ కోళ్లను పెంచుతారన్న మాట పలుకుబడిలో ఉంది. ఇక భారతీయులు ఎక్కువ వరకు చేతులతోనే భోజనం చేస్తారు కనుక కోడి కాళ్లను చేతులతో నోట్లో పెట్టుకొని కరకర నమిలేస్తారు. ‘తంగ్డీ కబాబ్‌’ పట్టుకుంటే నోట్లో నీళ్లూరడం ఖాయం. అమెరికాలో ఎలాగూ ఎక్కువగా కోళ్ల కోళ్లను తినరు కనుక అక్కడి కోళ్ల పరిశ్రమలు అతి తక్కువ ధరకు భారత్‌కు దిగుమతి చేస్తాయని, తద్వారా తాము తీవ్రంగా నష్టపోతామని భారతీయ కోళ్ల పరిశ్రమదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోడి వేళ్లు చైనాకు....
కోడి కాళ్లను  (అంటే పిక్క నుంచి మోకాలి వరకు) మనకు విక్రయించాలనుకుంటున్న అమెరికా కోళ్ల పరిశ్రమలు, కాలి వేళ్లను (మోకాలు నుంచి వేళ్ల వరకు) చైనాకు ఇప్పటికే జోరుగా విక్రయిస్తోంది. కోడి వేళ్లలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయన్నది చైనా ప్రజల వాదన. అందుకనే వాటిని వారు ఎక్కువగా తింటారు.  

మాంసం, కోడి ఒకటే రేటు
ఒకప్పుడు భారత్‌లో మేక మాంసం, కోడి కూర ఒకటే ధరకు లభించేవి. కోళ్ల పరిశ్రమ బాగా పుంజుకోవడంతో కోడి కూర ధరలు తగ్గుతూ వచ్చాయి.  కోళ్లలాగా మేకలను కూడా ఓ పెద్ద పరిశ్రమలాగా (పాశ్యాత్య దేశాల్లోలాగా) భారత్‌లో పెంచడం లేదు. కారణం మేకల పెంపకానికి పెద్ద స్థలం కావాలి. ఫలితం కోసం చాలాకాలం నిరీక్షించాలి. 1975లో మన దేశంలో ఏటా 26. 90 కోట్ల మేక మాంసం ఉత్పత్తికాగా, పది కోట్ల కిలోల కోడి కూర ఉత్పత్తి అయ్యేది. 1990 నాటికి మాంసం ఉత్పత్తి 45.80 కోట్ల కిలోలలకు, కోడి కూర 52.70 కోట్ల కిలోలకు చేరుకుంది. అంటే మొదటిసారి మేక మాంసాన్ని కోడి కూర దాటి పోయింది. ప్రస్తుతం దేశంలో 95 కోట్ల కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంటే, 180 కోట్ల కిలోల కోడి కూర ఉత్పత్తి అవుతుంది. అంటే దేశంలో మేక మాంసం మూడున్నర రెట్లు పెరగ్గా, కోటి మాంసం 18 రెట్లు పెరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి కోడి కాళ్లు దిగుమతి అయితే తమ గతేమికానని కోళ్ల పరిశ్రమదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కిలో కోడి కాళ్ల ధర 200 రూపాయలని, స్థానికంగా కిలో కోడి కాళ్లు 130 రూపాయలని, అంతేకాకుండా శీతలీకరించిన మాంసం కన్నా తాజా మాంసం తినడమే భారతీయులకు ఎక్కువ అలవాటు కనుక కోడికాళ్ల దిగుమతిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. ఈ అడ్డుంకులను దాటుకొని ‘కోడి కాళ్లు మన వంటిట్లోకి నడిచి వస్తాయా’ వేచి చూడాలి.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement