అంగన్‌‘వేడి’ | Half day for Anganwadi schools from April 1: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అంగన్‌‘వేడి’

Published Tue, Mar 18 2025 5:53 AM | Last Updated on Tue, Mar 18 2025 5:53 AM

Half day for Anganwadi schools from April 1: Andhra pradesh

ఎండలు మండిపోతుండటంతో చిన్నారుల అవస్థలు

ఏప్రిల్‌ 1 నుంచి అంగన్‌వాడీలను ఒంటిపూట నిర్వహించేలా సర్కారు కసరత్తు!

ఇప్పటికే ఒంటిపూట అమలు చేస్తున్న తెలంగాణ

సాక్షి, అమరావతి: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు ఉష్ణోగ్రతలను తాళలేక అల్లాడుతున్నారు. తక్షణమే అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ఈ నెల 15 నుంచి మే 31వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ బడులను ఒంటిపూట నిర్వహిస్తున్నారు.

మన రాష్ట్రంలో మాత్రం ఈ విషయమై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి వాటిని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట నిర్వహించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

తక్షణ నిర్ణయానికి పేరెంట్స్‌ డిమాండ్‌
అంగన్‌వాడీ కేంద్రాలకు వెళుతున్న చిన్నారులు మండే ఎండల్లో సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉండాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం ఈ అవకాశం కల్పించలేదు. ప్రభుత్వ బడుల మాదిరిగానే అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ఒంటిపూట నిర్వహించే విషయంలో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కాగా.. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు సైతం ఇవ్వకుండా పిల్లలకు సేవలు కొనసాగించేలా ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు ఒంటిపూట నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడకుండా వర్కర్లకు, హెల్పర్లకు 15 రోజుల చొప్పున వేసవి సెలవులు ఇవ్వాలని భావిస్తోంది. మే 1 నుంచి 15 వరకు వర్కర్లకు, మే 16 నుంచి 31 వరకు హెల్పర్లకు సెలవులు ఇచ్చే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement