half day school
-
తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..
సాక్షి, హైదరాబాద్: ఎండలు అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే మూడో వారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు తెలిపింది. -
16 నుంచి ఒంటిపూట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు.. ఇతర అన్ని యాజమాన్యాలు, అన్ని మీడియంల పాఠశాలలు అన్నింటికీ వచ్చే సోమవారం (16వ తేదీ) నుంచి ఒంటి పూట బడులుగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా కమిషనర్ చిత్రా రామ్‌చంద్రన్ ప్రకటించారు. వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో 16 నుంచి ఒంటి పూట బడులను కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు పెట్టాలని పేర్కొన్నారు. పాఠశాలలకు వచ్చేనెల 23వ తేదీ చివరి పని దినమని, 24వ తేదీ నుంచి వేసవి సెలవులు వర్తిస్తాయని వెల్లడించారు. తిరిగి పాఠశాలలు (కొత్త విద్యా సంవత్సరం) జూన్ 12 నుంచి ప్రారంభం అవుతాయని వివరించారు. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలు ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలలకు పంపించాలని స్పష్టం చేశారు. -
ఈత సరదా ప్రాణం తీసింది..
బిక్కవోలు (అనపర్తి): స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తూ నీటి మునిగి చనిపోయాడు. మంగళవారం బిక్కవోలులో ఈ సంఘటన జరిగింది. స్థానికులు.. బంధువుల కథనం ప్రకారం.. కార్పెంటర్‌గా పనిచేసే ఉద్దండం రాజు కుమారుడు చైతన్య దుర్గాప్రశాంత్(11) స్థానిక ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఒంటిపూట సెలవులు కావడంతో సాయంత్రం స్నేహితులతో కలసి ప్రశాంత్ దగ్గరలో ఉన్న సామర్లకోట కాలువలో ఈతకు వెళ్లాడు. సరిగా ఈత రాని ప్రశాంత్ కాలుజారి లోతుకు పోవడంతో మునిగిపోయాడు. దీంతో తోటి పిల్లలు కేకలు వేయడంతో అటుగా వస్తున్న వారు మునిగిపోతున్న బాలుడిని పైకి తీశారు. అప్పటికే దుర్గాప్రశాంత్ ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విలపించారు. రాజుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎన్నో ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో రోదిస్తున్న తల్లి ధనలక్ష్మిని ఆమె కుమార్తె ఓదారుస్తున్న తీరు చూపరులకు కంటితడి పెట్టించింది. ఎంతో చలాకీగా ఉండే చైతన్య దుర్గాప్రశాంత్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు, స్నేహితులు బోరున విలపించారు. -
తల్లిదండ్రులూ..తస్మాత్ జాగ్రత్త..!
ఒంటిపూట బడులతో అర్ధరోజు సెలవు.. చిన్నారులు ఎక్కువ సమయం ఆడుకోవచ్చు... స్నేహితులతో సరదాగా గడపొచ్చు... కానీ సరదాల మాటున ప్రమాదాలు పొంచి ఉన్నాయి... బడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే బ్యాగును పక్కనపెట్టి ఆటల బాట పడుతుంటారు... తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా స్నేహితులతో బయటకు వెళ్లి హాయిగా గడపాలనుకుంటారు. తల్లిదండ్రులు వీరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి... ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా కష్టమే... అప్రమత్తతతో ప్రమాదాల నుంచి చిన్నారులను కాపాడుకుందాం.. కడప ఎడ్యుకేషన్/బద్వేలు: ఒంటిపూట బడి అనగానే పిల్లలకు ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే ఒక పూట బడికిపోతే మరోపూట ఆటలాడుకోవచ్చన్న సంతోషం. కానీ ఆ సరదా విషాదం కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. పిల్లలు బడి నుంచి రాగానే వారిపై ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఏటా ముక్కుపచ్చలారని చిన్నారులు కాలువులు, చెరువులు, వంకలు, బావుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి మృత్యువాత పడుతూ కన్నవారికి కడపుకోతను మిగుల్చుతున్నారు. జిల్లాలో చెరువులు, బావులు ఎక్కువగానే ఉన్నాయి. వీటిని చూడగానే పిల్లలు ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. తాము దిగిన చెరువు లోతెంతో తెలియక, ఈత రాక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం ఒంటిపూట బడి నేపథ్యంలో పిల్లల పరిరక్షణపై తల్లిదండ్రులు దృష్టిని సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈనెల 12 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు బడి నుంచి ఇంటికి రాగానే పుస్తకాల బ్యాగును మూల పడేసి ఎంచక్కా ఆటలబాట పడుతుంటారు. ఈత, బైక్ రైడింగ్, క్రికెట్ వంటివి మండే ఎండలో చిన్నారులను ముప్పుతిప్పలు పెట్టేవే. టీవీలతో ముప్పు ఇంట్లో తరుచూ టీవీలు, కంప్యూటర్, సెల్, లాప్టాప్ వీడియో గేమ్స్‌లకు అతుక్కుపోవడం ద్వారా దృష్టిలోపం తలెత్తే అవకాశం ఉందని నేత్య వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ వాటికి దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఇంటిపట్టునే ఉండేలా.. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తే అది వారి భవిష్య త్తు అనారోగ్యంపై ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటిపూట బడి సమయంలో పాఠశాల అయిపోగానే చిన్నారులను ఇంటికి తీసుకుని వచ్చి కాస్తంత భోజనం చేయించి కొద్దిపేపు పడుకునేలా చర్యలు తీసుకోవాలి. ఆ తర్వా త ఇంటి పరిసరాలు, చెట్లు నీడలో అడుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలతో అనర్థాలు ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు మండుతున్నాయి. పిల్లలను వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో ఉంటే శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలకు వాంతులు, విరేచనాలయ్యే ప్రమాదం ఉంది. ఎండలకు పిల్లలు అధిక నీరు తాగేలా కూడా చూసుకోవాలి. అప్పుడప్పుడు మంచినీటిలో చిటికెడు ఉప్పు, చక్కెర వేసి నీరు ఇవ్వడం కూడా మంచిదే. ఇవి పాటించాలి ♦ బడి ముగిశాక చిన్నారులు స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. పిల్లలను ఇంటి ఆవరణలో, పరిసర ప్రాంతాలలో ఆడుకునులా, చదువుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలి. పాఠశాల అనంతరం ఇంటి పట్టునే ఉండేలా చూడాలి. ♦ ఈత నేర్పాలనుకుంటే తల్లిదండ్రులే తీసుకెళ్లి నేర్పించడం ఉత్తమం. జిల్లాలో స్విమ్మింగ్ పూల్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటికే రెండు, మూడు చోట్ల చిన్నారులు చెరువుల్లో ఈతకు వెళ్లి మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటే మేలు ♦ బడి వదలగానే పిల్లలను అవసరమైతే తప్ప బయటకు పంపడం మంచిది కాదు. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ♦ తల్లిదండ్రులు పిల్లల కోసం సమయం కేటాయించాలి. వారితో సరదాగా గడపడంతోపాటు విజ్ఞాన, వినోద సంబంధమైన పుస్తకాలు చదివేలా చూడాలి. ∙పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లినా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వెళ్లేలా అవగాహన కల్పించి, జాగ్రత్తలు పాటించేలా చూడాలి. ∙పిల్లలు ఇంట్లో మారాం చేస్తే వారికి సర్దిజెప్పాలే తప్ప కోపతాపాలకు పోకూడదు. వారిని కొట్టడం, తిట్టడం, బెదిరించడం చేయకూడదు. వారిని సన్మార్గంలో నడిపించేలా నేర్పించాలి. ∙తల్లిదండ్రులకు ఇంటిç ³నిలో సాయమందించే అలవాటును నేర్పించాలి. ∙ఇంటిలోనే ఉంటూ క్యారంబోర్డు, చెస్‌లాంటి ఆటలను పిల్లలకు అలవాటు చేయాలి. వాహనాలతో భద్రం ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజు ఎక్కువ. ఇంట్లో చెప్పకుండా వాటిని నడుపుతూ, తొక్కుతూ రోడ్డెక్కి ప్రమాదాల బారిన పడే అవకాశముంది. చిన్నారులకు బైక్‌లు, సైకిళ్లను దూరంగా ఉంచాలి. బైక్‌ల తాళాలు వారికి అందుబాటులో ఉంచకూడదు. అవసరమైతే పెద్దల పర్యవేక్షణలో వాహనాలను నడిపించడం నేర్పించాలి. -
12 నుంచి ఒంటిపూట బడులు
ఒంగోలు: సోమవారం నుంచి పాఠశాలలు మధ్యాహ్నం 12.30గంటల వరకే నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు వేసవి వచ్చిందని, కనుక విద్యార్థులు ఎండకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 12నుంచి నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ఉదయం 7.45గంటలకు మొదటి బెల్, రెండో బెల్ 7.50గంటలకు , ప్రేయర్ అనంతరం మూడో బెల్ 8గంటలకు మోగించాలన్నారు. అనంతరం ఆరు పీరియడ్లు నిర్వహించి మధ్యాహ్నం 12.30గంటలకు తరగతులు ముగించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 180 పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్న దృష్ట్యా 6 నుంచి 9తరగతుల వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు. అంతేగాక పలు ప్రైవేటు పాఠశాలల పరీక్షా కేంద్రాల్లో 1 నుంచి 5 తరగతుల వరకు పాఠశాల నిర్వహించుకునేందుకు లేదా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని డీఈఓ ఆదేశించారు. -
ఒంటిపూట బడి వేళలివే!
ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు.. సాక్షి, హైదరాబాద్: ఒంటిపూట బడుల వేళలను నిర్ధారించే విషయమై పాఠశాల విద్యాశాఖ కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎండలు పెరిగిన దృష్ట్యా ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే 10 నుంచి 10.20 గంటల వరకు విరామం, మిగిలిన సమయంలో మొత్తం ఆరు పీరియడ్లు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. -
నేటి నుంచి ఒంటిపూట బడి
సాక్షి, సిటీబ్యూరో : పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఇకపై ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. షిఫ్ట్ పద్ధతిన నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల వేళ ల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదన్నారు. విద్యాశాఖ ఆదేశాలను ఉల్లంఘించినట్లైతే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని డీఈవో హెచ్చరించారు. ఏప్రిల్ 24 నుంచి అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.