ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): చికెన్ ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. పెరుగుతున్న ధరలతో కిలో చికెన్ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేసే పరిస్థితి నెలకొంది. రికార్డు స్థాయిలో ప్రస్తుతం చికెన్ ధరలు పెరుగుతుండటం నాన్‌వెజ్ ప్రియులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం నగర మార్కెట్‌లో మటన్ కిలో రూ.600 పలుకుతున్నా ధర నిలకడగా ఉంటోంది. కానీ చికెన్ ధరలో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది. బాయిలన్ చికెన్ కిలో రూ.250 నుంచి రూ.260 వరకు ఉండగా.. లైవ్ ధర రూ.150 నమోదు చేసింది. ఫారం కోడి ధర కిలో రూ.170, శొంఠ్యాం కోడి కిలో ధర రూ.250 పలుకుతోంది. దీంతో ఈ ధరలకు సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
4 రెట్ల పెంపు
ఏప్రిల్‌లో లాక్‌డౌన్ ప్రారంభంలో చికెన్ ధర బాగా దిగజారింది. బాయిలర్ ధర కేవలం కిలో రూ.60 ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వినియోగదారులు చికెన్ వైపు మొగ్గు చూపకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. లాక్‌డౌన్ ప్రారంభమైన రెండు వారాల వరకు చికెన్ ధర సాధారణ స్థాయిలోనే కొనసాగింది. రూ.60 నుంచి రూ.80, రూ.120 , రూ.160 గా ధరల్లో క్రమంగా పెరుగుదల చోటు చేసుకుంది. ఆ సమయంలో మటన్ ధర అమాంతం కిలో రూ.800కు పెరిగినా చికెన్ మాత్రం నిలకడగానే పెరుగుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో పౌల్ట్రీలు సైతం ఉత్పతిన్తి భారీగా తగ్గించాయి. దీంతో కిలో రూ.160, రూ.180 మధ్య కుదురుకుంటుందని వినియోగదారులు భావించారు. అయితే మే నెల 15 నుంచి పరిస్థితిలో భారీ మార్పులు వచ్చాయి. 15 తరువాత రోజుకో విధంగా ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా చికెన్ ధర రూ.200 మార్కును దాటింది. రోజు రోజుకూ ధరలో పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కిలో రూ.250 చేరుకొని ఆల్‌టైం రికార్డును నెలకొలి్పంది. దీంతో ధరలపై సామాన్య వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్పత్తి తగ్గడం వల్లే..
కరోనా కారణంగా మాంసాహారంపై వినియోగదారులు దృష్టి సారించకపోవడంతో చికెన్ ధర రూ.60కి పడిపోయింది. ఆ సమయంలో పౌల్ట్రీలు తీవ్రంగా నష్టపోయి, ఉత్పత్తిని పెద్ద ఎత్తున తగ్గించుకున్నాయి. అన్ని పౌల్ట్రీలు నష్టనివారణ చర్యలు చేపట్టాయి. వినియోగం తగ్గడం, ఎండలు ముదరడంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించాయి. దీంతో ఉత్పత్తి భారీగా తగ్గి ధరలు రోజు రోజుకు పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితి ఉంది. పౌల్ట్రీల్లో ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకునే వరకు ధరలు తగ్గకపోవచ్చు.
– సుబ్బారావు, పౌల్ట్రీ, చికెన్ వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment