
రంగుల కోళ్లు
‘‘నవ్వు నలభై విధాల రైటు...మీ నవ్వుల కోసమీ ఫీటు’’ అంటున్నాడు అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో నివసించే బ్రూస్ విట్‌మాన్. నలుగురినీ నవ్వించాలని కోరుకునే విట్‌మ్యాన్ ఒక రోజున కాయగూరల రంగులను కలిపి తన రెండు పెంపుడు కోళ్లకు పూసేసి, పొద్దున్నే తీసుకెళ్లి ఓ పార్క్‌లో వదిలేశాడు. ఈ రంగుల కోళ్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వాటిని చూడడం, ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. ‘‘వింత మీకు వార్త మాకు’’ అన్నట్టు రెడీగా ఉండే మీడియాలో ఏవో వింత పక్షులు సిటీకి విహారానికి వచ్చినట్లు వార్తలు కూడా వచ్చేశాయి. కాసేపట్లోనే సదరు కోళ్లు సెలబ్రిటీలైపోవడం వరకూ ఓకెగాని, స్థానిక ముల్తానోమా కౌంటీ యానిమల్ సర్వీసెస్ వాళ్లు వచ్చేసి ఆ కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
దీంతో వాళ్లని సంప్రదించిన వైట్‌మాన్... అవి తన కోళ్లేనని లబోదిబోమన్నాడట. వాటికి రంగులు పూయడం వెనుక ఉన్న నవ్వించే ఆలోచన మంచిదే అయినా... అలా పెంపుడు కోళ్లను గాలికొదిలేయడం సరైంది కాదని మందలించిన యానిమల్ సర్వీసెస్ వాళ్లు... వాటిని కాసేపు సంరక్షించినందుకు కోడికి 16 డాలర్ల చొప్పున వసూలు చేసి మరీ వాటిని తిరిగి ఇచ్చారట!