గాజాలో పంటలు నాశనం... పశువుల మృత్యువాత! | Livestock Impacted by Israel Hamas War | Sakshi
Sakshi News home page

గాజాలో పంటలు నాశనం... పశువుల మృత్యువాత!

Published Wed, Oct 30 2024 12:52 AM | Last Updated on Wed, Oct 30 2024 12:52 AM

Livestock Impacted by Israel Hamas War

మూడింట రొండొంతుల విస్తీర్ణంలో పంటలు, గ్రీన్‌హౌస్‌లు నాశనం

మేత, నీరు లేక 95% పశువులు, 99% కోళ్ల మృత్యువాత

ఎఫ్‌.ఎ.ఓ. తదితర సంస్థల మానవతా సాయంతోనే బతుకులీడుస్తున్న గాజా వాసులు

గాజా–ఇజ్రాయెల్‌ మధ్య ఎడతెగని యుధ్ధం గాజాలోని అనేక పదుల సంఖ్యలో మనుషులను బలిగొంది. అంతేకాదు, అక్కడి రైతులు, పశుపోషకుల జీవితాలను యుద్ధం ఛిద్రం చేసింది. కొనసాగుతున్న యుద్ధం స్థానిక ఆహారోత్పత్తి అడుగంటడంతో గాజాలో ఆహార భద్రత వేగంగా క్షీణించింది. గాజాలో దాదాపు 86 శాతం జనాభా (18.4 లక్షల) మంది ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. యావత్‌ గాజా స్ట్రిప్‌లో తిండి దొరకని తీవ్ర క్షామ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.

ఎఫ్‌.ఎ.ఓ. ఉపగ్రహ కేంద్రం ఇటీవల సేకరించిన ఒక అధ్యయనంలో ఉపగ్రహ డేటా ప్రకారం.. గాజాలోని పంట భూమిలో మూడింట రెండొంతుల భూమి నాశనమైంది. గాజా వాసులకు చెందిన దాదాపు 15 వేల (95 శాతం) పశువులు చనిపోయాయి. దాదాపు దూడలన్నీ వధించబడ్డాయి. సుమారు 25 వేల గొర్రెలు (సుమారు 43 శాతం), కేవలం 3 వేల మేకలు (సుమారు 37 శాతం) మాత్రమే సజీవంగా మిగిలాయి. పౌల్ట్రీ రంగానికి కూడా అపార నష్టం జరిగింది. 99% కోళ్లు చనిపోయాయి. కేవలం 34 (1 శాతం) వేలు  మాత్రమే మిగిలాయి.

సగానికి సగం జీవాలు మృతి
భయానక యుద్ధం వల్ల గాజాకు చెందిన పశుపోషకురాలు హక్మా ఎల్‌–హమీది తన కుటుంబ జీవనాధారమైన గొర్రెలు, మేకలు సహా దక్షిణ భాగాంలోకి వలస పోయింది. ఈ కుటుంబం కనీసం సగం జీవాలను కోల్పోయింది. పశువుల పనులు ఆమెకు చిన్నప్పటి నుండి అలవాటే. రోజుకు మూడు పూటలా వాటి బాగోగులు చూసుకుంటుంది. 

‘యుద్ధ కాలంలో ఆహారం లేదు, బార్లీ లేదు, మేత లేదు, నీరు కూడా లేదు. మాకు నలభైకి పైగా పశువులు ఉండేవి. ఇప్పుడు ఇరవై కంటే తక్కువే మిగిలాయి’అని సెంట్రల్‌ గాజా స్ట్రిప్‌లోని అల్‌–జువైదా నివాసి హక్మా చెప్పారు.

ఈ నష్టాలు ఆమె కుటుంబ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించాయి. ‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) మాకు పశువుల మేతను అందించి చాలా సహాయం చేసింది. దేవునికి ధన్యవాదాలు. ఈ జీవాలైనా చనిపోకుండా మిగిలాయి. ఆరోగ్యంగా ఉన్నాయి..’ అన్నారామె. ఎఫ్‌.ఎ.ఓ. అందించిన వెటర్నరీ కిట్‌ కూడా ‘నాకు చాలా సహాయపడింది. విటమిన్లతో కూడిన దాణాతో పాటు దోమలు/ ఈగల బాధ లేకుండా చేసే స్ప్రే ఆ కిట్‌లో ఉన్నాయి. జీవాలను ఈగలు కుట్టకుండా దీన్ని పిచికారీ చేస్తున్నాను. ఇది నిజంగా బాగుంది’ అన్నారామె.

పశుగ్రాసం, వెటర్నరీ కిట్ల పంపిణీ
భద్రత, ప్రయాణ సంబంధ సవాళ్లను అధిగమించి గాజా ప్రజలకు అనేక సంస్థలు మానవతా సహాయాన్ని అందించాయి. గాజాలోని డెయిర్‌ అల్‌–బలా, ఖాన్‌ యూనిస్, రఫా గవర్నరేట్‌లలోని 4,400కు పైగా పశు పోషణే జీవనాధారంగా గల కుటుంబాలకు ఎఫ్‌.ఎ.ఓ. పశుగ్రాసాన్ని పంపిణీ చేసింది. జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గాజా అంతటా జీవనోపాధులను కాపాడేందుకు దాదాపు 2,400 కుటుంబాలకు వెటర్నరీ కిట్‌లు అదనంగా అందించారు. మల్టీవిటమిన్లు, క్రిమిసంహారకాలు, సాల్ట్‌ బ్లాక్‌లు, అయోడిన్‌ గాయం స్ప్రేలు వంటి జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా అవసరమైన వస్తువులను అందించటం విశేషం. వాస్తవానికి, హక్మా వంటి పశుపోషకులకు ఈ మహా సంక్షోభ కాలంలో ఈ సహాయం సరిపోదు. తన జంతువులను రక్షించుకోవడానికి ఇంకా ఎక్కువ మేత, మరిన్ని మందులు, మరిన్ని గుడారాలు అవసరమని ఆమె చెప్పారు.

ఈ సాయం చాలదు
బాధాకరమైన గత సంవత్సర కాలంలో అపారమైన నష్టాన్ని చవిచూసిన మరొక పశు పోషకుడు వార్డ్‌ సయీద్‌. వాస్తవానికి గాజాలోని పాత నగరంలో ఎల్‌–జెటూన్స్ కు చెందిన మహిళా పశుపోషకురాలు. యుద్ధం నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి డెయిర్‌ అల్‌–బలాహ్‌కు వలస వెళ్లి ఆశ్రయం పొందారు. 

‘యుద్ధం కారణంగా మేం దక్షిణాదికి తరలివచ్చాం. మా పశువులను కూడా తోలుకొచ్చాం. సగానికి సగాన్ని కోల్పోయాం. వాటిలో చాలా వరకు దారిలోనే చనిపోయాయి. ఈ మిగిలిన జీవాలే మాకు ఏకైక జీవనాధారం’ అన్నారామె. క్షిపణులు తరచూ పడే యుద్ధ ప్రాంతంలో ఆమె తన కుటుంబానికి ఆహారం, పశువులకు మేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ శ్రమిస్తున్నారు. ‘ఎఫ్‌.ఎ.ఓ. పశువుల మేత, వెటర్నరీ కిట్‌ ఇచ్చింది. ఈ సాయం సరిపోదు. పశువుల మేత, భద్రత కలిగిన గూడు, ఆహారం ఇంకా కావాలి’ అన్నారామె. 

యుద్ధం అక్టోబర్‌ 7న ప్రారంభం కాక ముందు దాదాపు 650 ట్రక్కుల మేత ప్రతి నెలా గాజా స్ట్రిప్‌లోకి తెప్పించుకునేవారు. ఎఫ్‌.ఎ.ఓ., బెల్జియం, ఇటలీ, మాల్టా, నార్వే ప్రభుత్వాల మద్దతుతో పాలస్తీనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి గాజా పశువుల సంరక్షకులకు మేత, వెటర్నరీ కిట్‌లను పంపిణీ చేస్తుంది. అయినా, అది అరకొరగానే మిగిలింది. యుద్ధం వల్ల ఆహారం, దాణా తదితరాలను రవాణా చేయటంలో సహాయక సంస్థలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు మెరుగుపడితే ఫీడ్‌ కాన్స్ సెంట్రేట్, గ్రీన్స్ హౌస్‌ ప్లాస్టిక్‌ షీట్‌లు, ప్లాస్టిక్‌ వాటర్‌ ట్యాంకులు, వ్యాక్సిన్స్ లు, ఎనర్జీ బ్లాక్‌లు, ప్లాస్టిక్‌ షెడ్‌లు, జంతు షెల్టర్‌లు, మరిన్ని వెటర్నరీ కిట్‌లను అందించడానికి సిద్ధమని ఎఫ్‌.ఎ.ఓ. చెబుతోంది. గాజా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని వలస పోయిన హక్మా, వార్డ్‌ వంటి పశు పోషక కుటుంబాలకు మరింత మెరుగైన సహాయం అందే రోజు కోసం వారు ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.

గ్రీన్‌హౌస్‌లు ద్వంసం
గాజా స్ట్రిప్‌ ప్రాంతంలో గల పంట పొలాల్లో ఈ ఏడాది సెప్టెంబర్‌ 1 నాటికి 68 శాతం, అంటే 10,183 హెక్టార్లలో పంట పొలాలు యుద్ధం వల్ల నాశనమయ్యాయని ఎఫ్‌.ఎ.ఓ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 43% పొలాలు నాశనం కాగా, మే నాటికి అది 57%కి పెరిగింది.  71% తోటలు, చెట్లు, 67% స్వల్పకాలిక పంటలు, 59% వరకు కూరగాయ పంటలు నాశనమయ్యాయి. యుద్ధం వల్ల గాజాలోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు సర్వనాశనం అయ్యాయి. 1,188 (52%) వ్యవసాయ బావులు దెబ్బతిన్నాయి. 578 హెక్టార్ల (44%)లోని గ్రీన్‌ హౌస్‌లు నేలమట్టం అయినట్లు అంచనా.

∙గాజా స్ట్రిప్‌ నుంచి దక్షిణాదికి వలస వచ్చి జీవనోపాధి కోల్పోయిన హక్మా, వార్డ్‌ వంటి పశుపోషకులకు పశుగ్రాసం, వెటర్నరీ కిట్లు ఎఫ్‌.ఎ.ఓ. పంపిణీ చేసింది. మరిన్ని జంతువులు చనిపోకుండా కాపాడుకోవడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి సహాయపడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement