ఇజ్రాయెల్, ఇరాన్ అస్త్రశ్రస్తాలు
ప్రాచీన మత సంబంధ కట్టడాల్లోకి పాలస్తీనియన్లను అనుమతించకపోవడంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధం లెబనాన్ మీదుగా ఇప్పుడు ఇరాన్‌ను తాకింది. హమాస్, లెబనాన్ కంటే ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు ప్రధాన యుద్ధక్షేత్ర పోటీదారుగా నిలిచింది.
ఫతాహ్–2 హైపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించి ఇరాన్.. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల సమర్థతను ప్రశ్నార్థకం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల సైనికసత్తాపై మరోమారు చర్చ మొదలైంది. అనూహ్యంగా దూసుకొచ్చే శత్రు క్షిపణులను గాల్లోనే తుత్తునియలు చేసే గగనతల రక్షణ వ్యవస్థలకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు.
అలాంటి వ్యవస్థలనూ ఇరాన్‌కు చెందిన ఫతాహ్ క్షిపణులు చేధించుకుని రావడం రక్షణ రంగ నిపుణులనూ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ మొహరించిన భిన్న శ్రేణుల గగనతల రక్షణ వ్యవస్థలుసహా ఇరుదేశాల సైనికపాటవంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సైనిక బలగాల్లో ఇరాన్ పైచేయి
ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ సైనికబలం పెద్దది. ఇరాన్‌లో 3,50,000 మంది ఆర్మీ, 1,90,000 ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, 18వేల మంది నేవీ, 37 వేల మంది వాయుసేన, 15వేల మంది ఎయిర్‌డిఫెన్స్ సైనికులున్నారు. మరో 3,50,000 మంది రిజర్వ్ బలగాలున్నారు. ఇజ్రాయెల్‌లో కేవలం 1,26,000 మంది ఆర్మీ, 9,500 మంది నేవీ, 34,000 మంది ఎయిర్‌ఫోర్స్, 4,65,000 మంది రిజర్వ్‌బలగాలున్నాయి.
రక్షణ బడ్జెట్‌లో ఇజ్రాయెల్ ముందంజ
ఇరాన్ 2023 ఏడాదిలో రక్షణ కోసం 10.3 బిలియన్ డాలర్లు ఖర్చుచేస్తే ఇజ్రాయెల్ గత ఏడాది ఏకంగా 27.5 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. 2022తో పోలిస్తే ఈ బడ్జెట్ 24% అధికం కావడం విశేషం.
పదాతిదళంలో ఇరాన్ మేటి
10,513 యుద్ధట్యాంకులు, 6798 శతఘ్నులు, 640 ఆయుధాల రవాణా వాహనాలు, 55 సైనిక హెలికాప్టర్లు ఇరాన్ సొంతం. ఇజ్రాయెల్ వద్ద 400 యుద్ధట్యాంకులు, 530 శతఘ్నులు, 1,190 ఆయుధాల రవాణా వాహనాలున్నాయి.
ఎయిర్‌ఫోర్స్‌లో ఇజ్రాయెల్ హవా
ఇజ్రాయెల్ వద్ద అమెరికా తయారీ అత్యాధునిక ఎఫ్‌రకం జెట్ యుద్ధవిమానాలున్నాయి. మొత్తంగా 345 యుద్ధవిమానాలున్నాయి. 43 ఆర్మీ హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద 312 యుద్ధవిమానాలు, 23 ఆర్మీ విమానాలు, 57 హెలికాప్టర్లున్నాయి.
ఇరాన్ వద్ద అధిక జలాంతర్గాములు
ఇరాన్ వద్ద 17 జలాంతర్గాములు, 69 గస్తీ, నిఘా నౌకలు, 7 యుద్ధనౌకలు, 23 విమానవాహక నౌకలున్నాయి. ఇజ్రాయెల్ వద్ద కేవలం ఐదు జలాంతర్గాములు, 49 గస్తీ/యుద్ధ నౌకలున్నాయి.
విభిన్న గగనతల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్‌లో మొత్తంగా 10 ఐరన్‌డోమ్ వ్యవస్థలున్నాయి. ఇవిగాక డేవిడ్స్ స్లింగ్, ఆరో సిస్టమ్స్ మొహరించాయి. ఇరాన్ వద్ద ‘పరారుణ’గుర్తింపు వ్యవస్థ ఉంది. వీటి సాయంతో ఎస్–200, ఎస్–300, దేశీయ 373 క్షిపణి వ్యవస్థలను ప్రయోగించి శత్రు క్షిపణులను నేలకూలుస్తుంది. ఇదిగాక ఎంఐఎం–23 హాక్, హెచ్‌క్యూ–2జే, కోర్డాడ్–15, చైనా తయారీ సీహెచ్–ఎస్‌ఏ–4, 9కే331 టోర్ ఎం1 క్షిపణులున్నాయి.
అణ్వాయుధాలు
ఇజ్రాయెల్ వద్ద దాదాపు 90 దాకా అణ్వా్రస్తాలున్నాయి. అయితే ఇరాన్ వద్ద అణ్వయుధాలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలీదు. కానీ అణ్వాయుధాల్లోని వార్‌హెడ్‌లో వాడే యురేనియంను మిలటరీ గ్రేడ్‌కు తెచ్చేందుకు ఆ మూలకం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వేగవంతంచేసింది.
బాలిస్టిక్ క్షిపణులు
ఇరాన్ వద్ద తాండార్ 69, ఖొరమ్‌షహర్, సెఝిల్ బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇజ్రాయెల్ వద్ద లోరా, జెరికో పేర్లతో 150 కి.మీ.ల నుంచి 6,500 కి.మీ.లు దూసుకుపోయే విభిన్న బాలిస్టిక్ క్షిపణులున్నాయి.
ఐరన్ డోమ్ (స్వల్పశ్రేణి)
పరిధి
4 నుంచి 70 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన క్షిపణులను ఈ వ్యవస్థ కూల్చేస్తుంది. స్వల్పదూర రాకెట్లు, బాంబులను తమిర్ క్షిపణులుఅడ్డుకుంటాయి.
ఏమేం ఉంటాయి?
ఐరన్‌డోమ్ వ్యవస్థలో తమిర్ క్షిపణులు, లాంఛర్, రాడార్, కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి
డేవిడ్స్ స్లింగ్ (మధ్య శ్రేణి)
పరిధి
40 నుంచి 300 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, పెద్ద రాకెట్లు, క్రూయిజ్ మిస్సైళ్లను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది.
ఏమేం ఉంటాయి?
స్టన్నర్ ఇంటర్‌సెప్టార్ క్షిపణులు, నిట్టనిలువుగా ప్రయోగించే వేదిక, రాడార్, నియంత్రణ వ్యవస్థ ఇందులో
ఉంటాయి
ఆరో సిస్టమ్ (దీర్ఘ శ్రేణి)
పరిధి
ఇజ్రాయెల్ నుంచి 2,400 కి.మీ.ల దూరంలో ఉండగానే శత్రువులకు చెందిన మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది.
ఏమేం ఉంటాయి?
తక్కువ ఎత్తులో సమాంతరంగా వస్తే ఆరో–2 మిస్సైళ్లు, ఎక్కువ ఎత్తులో వస్తే ఆరో–3 మిస్సైళ్లు అడ్డుకుంటాయి. లాంఛర్, కంట్రోల్ సెంటర్ ఉంటాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment