వాషింగ్టన్:ఇజ్రాయెల్‌పై ఈ ఏడాది అక్టోబర్‌లో ఇరాన్ జరిపిన మిసైళ్ల దాడికి సంబంధించి సంచలన విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ప్యాసింజర్ విమానాలకు ముప్పుగా మారిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇరాన్ ప్రయోగించిన దాదాపు 200 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయాణికులతో నిండిన విమానాలపై నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగురుతూ వెళ్లినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.
ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ దిశగా దూసుకు వెళ్లిన మార్గంలో అదే సమయంలో సుమారు డజను ప్యాసింజర్ విమానాలు ఎగురుతున్నట్లు కథనంలో పేర్కొన్నారు. విమానాల్లోని ప్రయాణికులు, పైలట్లు తమపై నుంచి నిప్పులు చిమ్ముతూ వెళుతున్న ఇరాన్ మిసైల్స్‌ను చూసినట్లు కథనంలో రాసుకొచ్చారు. సాధారణంగా బాలిస్టిక్ మిసైల్స్ ప్యాసింజర్ విమానాల కంటే ఎత్తులో ఎగురుతాయి.
అయితే ప్యాసింజర్ విమానాలు తమ అవసరాల మేరకు పైకి కిందికి వెళ్లేటపుడు మిసైల్స్ ప్రమాదకరంగా మారతాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసే సమయంలో పౌర విమానాలకు ఇరాన్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోవడం గమనార్హం. అక్టోబర్ మొదటి వారంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది.ఈ దాడులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా పూర్తిగా అడ్డుకోలేకపోయింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు కొంతమేర దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment