భవనాలు ధ్వంసం, భారీగా మంటలు
భూతల దాడులూ చేస్తున్న ఇజ్రాయెల్
హెజ్‌బొల్లా కమ్యూనికేషన్స్ హెడ్ మృతి
ప్రతి దాడుల్లో ఇజ్రాయెల్‌కూ నష్టం
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి తర్వాత భారీగా వైమానిక దాడులు నిర్వహించింది. క్షిపణుల దాడిలో పెద్ద సంఖ్యలో భవనాలు కంపించిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ దాడుల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. జనం కకావికలమై సురక్షిత ప్రాంతాలకేసి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణ లెబనాన్‌లో క్రైస్తవులు అధికంగా ఉండే మార్జయూన్ నగరంపైనా తొలిసారిగా దాడులకు దిగింది. బాంబు దాడుల్లో నలుగురు వైద్య సిబ్బంది మరణించినట్టు సమాచారం. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. హెజ్‌బొల్లా నిఘా ప్రధాన కార్యాలయంపై భారీగా దాడి చేసినట్టు పేర్కొంది.
గత 24 గంటల్లో 100 మందికి పైగా మిలిటెంట్లను హతమార్చినట్టు తెలిపింది. శుక్రవారం నాటి దాడుల్లో హెజ్‌బొల్లా కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ రషీద్ స్కఫీ మరణించినట్టు ప్రకటించింది. భూతల దాడులు కూడా కొనసాగుతున్నట్టు వివరించింది. స్కఫీ 2000 నుంచీ ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నాడు. గత 20 రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 1,400 మందికి పైగా లెబనాన్‌వాసులు మరణించారు. 12 లక్షల మందికి పైగా నిర్వాసితులై శరణార్థులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా బీరుట్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని లెబనాన్–సిరియా మాస్నా బోర్డర్ క్రాసింగ్‌ను మూసివేశారు. హెజ్‌బొల్లాకు ఇరాన్ నుంచి సిరియా గుండా ఆయుధాలు సరఫరా కాకుండా ఈ ప్రాంతంలో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
హెజ్‌బొల్లా కూడా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నుంచి పెద్ద ఎత్తున ప్రతి దాడులకు దిగింది. ఉత్తర ఇజ్రాయెల్‌పైకి భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. దాంతో లోయర్ గలిలీ తదితర ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించినట్టు సమాచారం. పలుచోట్ల భారీగా మంటలు చెలరేగాయి. భూతల దాడుల్లో మరో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్టు సైన్యం ధ్రువీకరించింది. మరోవైపు గాజాపైనా ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను పెంచింది. ఓ స్కూలు భవనంపై జరిగిన దాడికి పలువురు చిన్నారులు బలైనట్టు తెలుస్తోంది.
హౌతీ లక్ష్యాలపై...అమెరికా, బ్రిటన్ దాడులు
వాషింగ్టన్: యెమన్‌లోని హౌతీ ఉగ్ర సంస్థపై అమెరికా, బ్రిటన్ భారీగా దాడులకు దిగాయి. ఆయుధ వ్యవస్థలు, స్థావరాలు తదితర 12 లక్ష్యాలపై యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు బాంబుల వర్షం కురిపించాయి. వీటిఇలో హొడైడా విమానాశ్రయం బాగా దెబ్బ తిన్నట్టు హౌతీ మీడియా ధ్రువీకరించింది. మరికొన్ని బాంబులు రాజధాని సనాలో తీవ్ర నష్టం కలిగించాయి. హౌతీ రెబెల్స్ గత వారం బాబ్ ఎల్ మందెబ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు అమెరికా నౌకలపై బాలిస్టిక్ మిసైళ్లు, యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగించడం తెలిసిందే. వాటన్నింటినీ మధ్యలోనే అడ్డుకుని కూల్చేసినట్టు అమెరికా పేర్కొంది. తాజా దాడులు వాటికి ప్రతీకారమేనని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment