aeroplanes
-
విమానాల పైనుంచి దూసుకెళ్లిన మిసైల్స్..ఏం జరిగిందంటే..
వాషింగ్టన్:ఇజ్రాయెల్‌పై ఈ ఏడాది అక్టోబర్‌లో ఇరాన్ జరిపిన మిసైళ్ల దాడికి సంబంధించి సంచలన విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ప్యాసింజర్ విమానాలకు ముప్పుగా మారిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇరాన్ ప్రయోగించిన దాదాపు 200 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయాణికులతో నిండిన విమానాలపై నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగురుతూ వెళ్లినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ దిశగా దూసుకు వెళ్లిన మార్గంలో అదే సమయంలో సుమారు డజను ప్యాసింజర్ విమానాలు ఎగురుతున్నట్లు కథనంలో పేర్కొన్నారు. విమానాల్లోని ప్రయాణికులు, పైలట్లు తమపై నుంచి నిప్పులు చిమ్ముతూ వెళుతున్న ఇరాన్ మిసైల్స్‌ను చూసినట్లు కథనంలో రాసుకొచ్చారు. సాధారణంగా బాలిస్టిక్ మిసైల్స్ ప్యాసింజర్ విమానాల కంటే ఎత్తులో ఎగురుతాయి.అయితే ప్యాసింజర్ విమానాలు తమ అవసరాల మేరకు పైకి కిందికి వెళ్లేటపుడు మిసైల్స్ ప్రమాదకరంగా మారతాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసే సమయంలో పౌర విమానాలకు ఇరాన్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోవడం గమనార్హం. అక్టోబర్ మొదటి వారంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది.ఈ దాడులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా పూర్తిగా అడ్డుకోలేకపోయింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు కొంతమేర దెబ్బతిన్నాయి. -
విమానాలతో విజయవంతంగా ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని మరింత వేగవంతం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను వినియోగిస్తోంది. ఈ విధానంలోనూ విజయవంతంగా ముందుకెళ్తోంది. రీసర్వేలో 1.30 లక్షల చదరపు కిలోమీటర్లు కొలవాల్సివుంది. అందులో 32,252 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా, మిగిలిన ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా కొలవాలని నిర్ణయించారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 32,252 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా కొలవడం మొదలుపెట్టి ఇప్పటికే 30 వేల చదరపు కిలోమీటర్లకుపైగా పూర్తి చేశారు. మరో 15 రోజుల్లో మిగిలిన 2 వేలకుపైగా చదరపు కిలోమీటర్లలోనూ సర్వే పూర్తి చేస్తామని సర్వే సెటిల్మెంట్ అధికారులు తెలిపారు. త్వరగా సర్వే పూర్తి చేయడం కోసమే.. రీ సర్వేను ఇంకా వేగంగా నిర్వహించాలంటే డ్రోన్లకంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరే విమానాలు, హెలీకాప్టర్లను వినియోగించాలని ప్రభుత్వంనిర్ణయించింది. వాటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ భాగాన్ని కొలవొచ్చు. కానీ భూముల సర్వే కోసం ఇప్పటివరకు దేశంలో ఎక్కడా విమానాలను ఉపయోగించలేదు. జాతీయ రహదారులు, కొన్ని పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి విమానాలతో ఆ ప్రాంతాలను కొలిచిన అనుభవం మాత్రమే ఉంది. దీంతో అందులో అనుభవం ఉన్న సంస్థలతో చర్చించి తొలిసారి విమానాల ద్వారా భూముల కొలతను నంద్యాలలో ప్రారంభించారు. ఎక్కువ ప్రాంతాన్ని కొలిచేందుకు ఎక్కువ పిక్సెల్స్ ఉండే అత్యాధునిక కెమేరాలు ఉపయోగించారు. వాటి చిత్రాలను హైదరాబాద్‌లోని సర్వే ఆఫ్ ఇండియా లేబొరేటరీలో తనిఖీ చేయించారు. డ్రోన్ల కంటేæ కచ్చితత్వంతో చిత్రాలు వచ్చాయని నిర్థారణ అయింది. అనంతరం 32 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రెండు ఏజెన్సీల ద్వారా 3 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో, ఒక ఏజెన్సీకి చెందిన హెలీకాప్టర్‌ను వినియోగించి సర్వే చేయించారు. డ్రోన్ల ద్వారా 120 మీటర్ల ఎత్తు నుంచి చిత్రాలు తీస్తున్నారు. విమానాల ద్వారా 1,500 మీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు తీశారు. ఒక్క రోజులో 200 నుంచి 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విమానాల ద్వారా కొలిచారు. ఎక్కువ పరిధిలోని భూమి ఒకే చిత్రంలో అత్యంత నాణ్యతతో రావడంతో రీసర్వే సులభమైందని సర్వేశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆకాశాన్ని ఖాళీ చేయిస్తున్న రష్యా.. విమానాలన్నీ వెనక్కి.. ఏం జరుగుతోంది?
మాస్కో: రష్యా ఆకాశమార్గాన్ని ఖాళీ చేయిస్తోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కోవో విమానాశ్రాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇక్కడకు చేరుకోవాల్సిన విమానాలన్నింటినీ తిరిగి వెనక్కి పంపింది. ఫ్లైట్ రాడార్ వెబ్సైట్ దీన్ని వెల్లడించింది. దీంతో రష్యా ఏం చేయబోతుందని సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే సెయింట్‌పీటర్స్‌బర్గ్ గగనతలంలో గుర్తు తెలియని వస్తువు (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్- UFO)ను గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం అప్రమత్తమై ఆకాశమార్గాన్ని ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విమానాశ్రాయానికి చేరుకోవాల్సిన విమానాలనకు వెనక్కి పంపించి.. యుద్ధ విమానాలకు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వస్తువు గురించి తెలుసుకునేందుకు రెండు యుద్ధ విమానాలను రష్యా గగనతలంలోకి పంపినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. ఆ వస్తువు ఏంటో కనిపెట్టేందుకు దాదాపు 100 యుద్ధవిమానాలను సెయింట్‌పీటర్స్‌బర్గ్ విమానాశ్రయంలో మోహరించినట్ల సమాచారం. అయితే ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వస్తువులు గగనతలంలో కన్పించడం కలకలం రేపడం తెలిసిందే. చైనాకు చెందిన భారీ బెలూన్లు అమెరికా ఆకాశంలో నిఘా వహించడం చర్చనీయాంశమైంది. వీటిని అగ్రరాజ్యం కూల్చివేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ఆకాశంలో ఇప్పుడు యూఎఫ్ఓ కన్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఏలియన్ల పనా? లేక ఇతర దేశాల పనా? అనే చర్చ కూడా మొదలైంది. పుతిన్ సొంత నగరం.. అయితే రష్యా గగనతలంలో కన్పించింది ఓ భారీ డ్రోన్ అని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది నాటో దేశాల పని అయ్యి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సొంతనగరం అయిన సెయింట్ పీటర్స్బర్గ్కు ఈ డ్రోన్ దగ్గరగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా యుద్ధ విమానాలను మోహరించారు. ఈ ఎయిర్‌పోర్టుకు 180 కిలోమీటర్ల దూరంలోనే భారీ డ్రోన్ కన్పించింది. చదవండి: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! -
Climes: కర్బన తటస్థత, కర్బనరహిత వ్యవస్థ.. కాఫీ తాగినంత సులువు!
‘కర్బన తటస్థత’.. ‘కర్బనరహితం’ గురించి మాట్లాడటానికి ‘కాప్26’ మాత్రమే వేదిక కానక్కర్లేదు. మన ఇల్లు కూడా అందుకు వేదిక కావచ్చు. పర్యావరణ అనుకూల జీవనశైలికి వ్యవస్థాగత ప్రయత్నాలే కాదు, వ్యక్తిగత స్థాయిలో జరిగే ప్రయత్నాలు కూడా ముఖ్యం అని నమ్ముతుంది క్లైమెస్... ‘ఇచట ఉంది...అచట లేదు’ అని కాకుండా ఎక్కడ చూసినా కర్బన ఉద్గారాలు కలవరపరుస్తూనే ఉన్నాయి. కర్బన ఉద్గారాలు అనే మాట వినబడగానే పెద్ద పెద్ద పరిశ్రమలు మాత్రమే మనకు గుర్తుకు వస్తాయి. అయితే మెయిల్, మెసేజ్‌లు పంపడం, ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవడం, ఆన్లైన్ షాపింగ్ నుంచి విమాన ప్రయాణం వరకు వివిధ రూపాల్లో కర్బన ఉద్గారాలు వెలువడడానికి మనం ఏదో రకంగా కారణం అవుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 3.7 శాతం వాటా ఇంటర్నెట్, వివిధ రకాల గ్యాడ్జెట్లదే. విమానాల నుంచి వెలుబడే ఉద్గారాలకు ఇది సమానం! ఈ నేపథ్యంలో బెంగళూరు, దిల్లీ కేంద్రంగా సిద్దార్థ జయరామ్, అనిరుథ్ గుప్తాలు క్లైమెట్ యాక్షన్ ఫైనాన్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్ క్లైమెస్ మొదలుపెట్టారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పొలిటికల్ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన అనిరుథ్ గుప్తా ఒక స్వచ్ఛందసంస్థను మొదలుపెట్టాడు. ఆ తరువాత జయరామ్‌తో కలిసి ‘క్లైమెస్’కు శ్రీకారం చుట్టాడు. జయరామ్ ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ చేశాడు. హోటల్లో కప్పు కాఫీ తాగడం నుంచి విమాన ప్రయాణం వరకు వివిధ కారణాల వల్ల వెలువడే కర్బన ఉద్గారాల గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది క్లైమెస్. ‘క్యాలిక్లెట్, ట్రాక్ అండ్ రెడ్యూస్’ అనే నినాదంతో కర్బనరహిత విధానాల ఆచరణపై అవగాహన కలిగిస్తుంది. రిలయన్స్‌తో సహా దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు నిర్దిష్టమైన కాలవ్యవధితో శూన్య ఉద్గారాల స్థాయికి చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కృషి చేస్తున్నాయి. 2070 నాటికి జీరో ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనేది మన దేశ లక్ష్యం. అది విజయవంతం కావాలంటే వ్యవస్థగతంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా కార్యాచరణ కావాలి. దీనికి క్లైమెస్ నిర్మాణాత్మక రూపాన్ని ఇస్తుంది. ‘తెల్లారి లేచింది మొదలు ఏదో ఒక సమయంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ప్రభావం గురించి ఆందోళన పడుతుంటాం. మనిషి మనుగడ, కర్బన ఉద్గారాలు అవిభాజ్యం అని కూడా అనిపిస్తుంటుంది. కాని ఇది నిజం కాదు. కర్బన తటస్థత, కర్బనరహిత వ్యవస్థ సాధ్యమే. అది జటిలమైన ప్రక్రియ కాదు. కాఫీ తాగినంత సులువు’ అంటోంది క్లైమెస్. ప్రస్తుతం ఎనిమిది బ్రాండ్లతో మాత్రమే కలిసి పనిచేస్తున్న ‘క్లైమెస్’ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. అయితే దానికి బలమైన భవిష్యత్ ప్రణాళిక ఉంది. ‘రాబోయే నెలల్లో కొన్ని బ్రాండ్ల నుంచి ఎన్నో బ్రాండ్లకు విస్తరిస్తాం’ అనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు జయరామ్. ‘క్లైమెట్–పాజిటివ్ ఫీచర్స్‌తో సులభంగా యాక్సెస్ అయ్యే సౌకర్యం, పారదర్శకత, ఆర్థిక భారం లేకుండా ఉంటే ప్రజలు మనకు మద్దతు ఇస్తారు’ అంటున్నాడు అనిరుద్. రాబోయే కాలంలో మనకు ఎదురయ్యే అతి పెద్ద సవాలు వాతావరణంలో చోటు చేసుకొనే మార్పులు. ‘మన వంతుగా ఏ ప్రయత్నం చేయకపోతే భవిష్యత్ మసక బారే ప్రమాదం ఉంది’ అని హెచ్చరిస్తున్నారు ఇద్దరు మిత్రులు. వ్యక్తిగత స్థాయిలో మనం ఏంచేయగలం అని తెలుసుకోవడానికి ‘క్లైమెస్’ సైట్లోకి వెళితే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. కొత్త దారి దొరుకుతుంది. చదవండి: Cyber Security Tips: పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? డిజిటల్ రాక్షసులుగా మారకుండా.. Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. -
విమాన టికెట్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న చార్జీలు!
విమాన టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి సమయంలో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన ప్రైస్ బ్యాండ్లను ఎత్తివేసింది. దీంతో ఇకపై దేశీయ మార్గాల్లో విమాన చార్జీలపై ఉన్న పరిమితులను తొలగించినట్లు దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇకపై ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు. గతంలో దేశీయ మార్గాల్లో ఛార్జీల పై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ద్వారా తక్కువ చార్జీల వల్ల విమాన సంస్థలు, డిమాండ్ ఉన్న సమయాల్లో భారీ రేట్లతో ప్రయాణికులు నష్టపోకుండా ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం విమాయాన రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన సంస్థలు తమ విమానాల్లో ప్యాసింజర్లతో నింపేందుకు టిక్కెట్లపై డిస్కౌంట్లను అందించే అవకాశమే ఎక్కవగా ఉందంటూ నిపుణలు చెప్తున్నారు. రానున్న రోజుల్లో దేశీయంగా విమాన రంగం వృద్ధి సాధిస్తుందని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆశాభావం వ్యక్తం చేశారు. డిమాండ్, ఇంధన ధరలను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత ఛార్జీల పరిమితులను తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. The decision to remove air fare caps has been taken after careful analysis of daily demand and prices of air turbine fuel. Stabilisation has set in & we are certain that the sector is poised for growth in domestic traffic in the near future. https://t.co/qxinNNxYyu — Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 10, 2022 చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఆగస్టు 31 వరకు మాత్రమే! -
తీవ్ర రూపం దాల్చుతున్న అసనీ తుపాను... భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, ఆ తర్వాత క్రమంగా దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపాను కారణంగా ఈ రోజు రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి జగన్నాథ కుమార్ సూచించారు. విమాన కార్యకలాపాలు రద్దు ఈ తుపాను కారణంగా మే 10న చెన్నై, విశాఖపట్నంలో పలు విమానయాన సంస్థలతో వివిధ విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఏమియేషన్ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా 23 ఇండిగో విమానాలు రాకపోకలను రద్దు చేసినట్లు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అంతేకాదు నాలుగు ఎయిర్ఏషియా విమానాలు కూడా రద్దు చేసినట్లు కూడా వెల్లడించారు. (చదవండి: బెంబేలెత్తిస్తున్న ‘అసని’ తుపాన్.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?) -
సొంత గూటికి... మహారాజా!
సరిగ్గా ఏడు దశాబ్దాల తర్వాత మహారాజా సొంత గూటికి చేరారు. 1932లో జేఆర్డీ టాటా పూనికతో ‘టాటా ఎయిర్‌లైన్స్’గా ఆరంభమై, జాతీయీకరణతో 1953లో ప్రభుత్వం చేతికొచ్చి, మహారాజా చిహ్నంతో పాపులరైన భారత విమానయాన సంస్థ ఎయిరిండియా ఇప్పుడు మళ్ళీ టాటాల చేతికే వచ్చింది. ప్రభుత్వం అధికారిక అప్పగింతలతో కొత్త శకం ఆరంభమైంది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన విక్రయంలో దాదాపు రూ. 18 వేల కోట్లకు టాటా సంస్థ తన బిడ్డను మళ్ళీ చేజిక్కించుకుంది. దాంతో పాటు సంస్థ తాలూకు రూ. 15,300 కోట్ల మేర ఋణభారాన్ని భుజానికెత్తుకుంది. రోజుకు రూ. 20 కోట్ల మేర నష్టపోతున్న ఈ సంస్థను మళ్ళీ గగనతలంలో దూసుకుపోయేలా చేయడం ఇప్పుడు టాటాల ముందున్న పెనుసవాలు. అటు ఎయిరిండియా, ఇటు దేశ విమానయాన రంగం, వివిధ రంగాలు – వ్యాపారాల్లో ప్రభుత్వ పాత్ర... అన్నిటా ఇది ఓ కీలక ఘట్టం. మోదీ గద్దెనెక్కిన తరువాత గడచిన ఎనిమిదేళ్ళలో విజయవంతంగా పూర్తయిన తొలి ప్రైవేటీకరణ ప్రయత్నం ఇదే. కానీ, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా కలిసొచ్చిందేమీ లేదు. పేరుకు రూ. 18 వేల కోట్లకు కొన్నా, అందులో రూ. 2,700 కోట్లే ప్రభుత్వానికి ఇచ్చేది. మిగతా రూ. 15,300 కోట్లు ప్రభుత్వమిచ్చిన అప్పుగా టాటా దగ్గరే ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటీకరణ సాగుతున్న తీరుపై విమర్శలూ అనేకం. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు గడించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ఇప్పటి దాకా కేవలం రూ. 9,330 కోట్లే వచ్చినట్టు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ‘పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) వారి లెక్క. అవన్నీ అటుంచితే, ఈ విక్రయం ద్వారా వెలువడ్డ సిగ్నల్స్‌ను మర్చిపోలేం. నిజానికి, ఎయిరిండియా ప్రైవేటీకరణ చాలాకాలంగా వినపడుతున్నదే. ఒకప్పుడు ఉజ్జ్వలంగా వెలిగిన సంస్థ ఇది. 1932 అక్టోబర్‌లో మొదలై, టాటాలు నడుపుతున్న సంస్థలో స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం ప్రవేశించింది. మొదట 49 శాతం వాటా తీసుకుంది. 1953లో మిగతా వాటాను కూడా కొని, జాతీయీకరణ జరిపింది. తర్వాత కొన్ని దశాబ్దాలు ఎయిరిండియాదే హవా. ఆర్థిక సరళీకరణ, ఆ పైన పెరిగిన ప్రైవేట్ సంస్థల పోటీతో గత ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఈ ప్రభుత్వరంగ సంస్థ నిర్వహణలో అనేక లోటుపాట్లూ చోటుచేసుకున్నాయి. నష్టాలను తగ్గించుకోవడం కోసం 2007లో అంతర్జాతీయ విమానాలు నడిపే ఎయిరిండియాను, దేశీయ విమానయాన ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’లో కలిపారు. అయినా సరే, అప్పటి నుంచి ఇప్పటి దాకా లాభమన్నది కళ్ళజూడలేదు. చివరకు అన్నీ కలిసి సంస్థను ప్రైవేటీకరణ బాట పట్టించాయి. వాజ్‌పేయి సారథ్యంలో 2001లోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణకు తొలి ప్రయత్నం చేసింది. 40 శాతం వాటాలు విక్రయించాలనుకొని విఫలమైంది. మోదీ సర్కార్ మొదటి విడత పాలనలో 2018లో 76 శాతం మేర వాటా అమ్మాలనుకుంది. ఒక్కరైనా ముందుకు రాలేదు. 2020 జనవరిలో పాక్షికంగా కాక వాటాలను పూర్తిగా అమ్మేస్తామంటూ, తాజా ప్రయత్నం ప్రారంభించింది. ప్రభుత్వ వాటాలుంటే దాని పెత్తనమూ ఉంటుందనీ, స్వేచ్ఛగా సంస్థ నిర్వహణ సాధ్యం కాదనీ ఇంతకాలం సంశయిస్తూ వచ్చిన ప్రైవేట్ సంస్థలకు ఇది నచ్చింది. ఎట్టకేలకు ఇప్పటికి అమ్మకం పూర్తయింది. ఇప్పటికే అనేక సంస్థలు పోటీపడుతూ, కరోనా కష్టాలతో మథనం తప్పనిసరి అయిన వేళ ఎయిరిండియాను టాటాలు చేపట్టడం గమనార్హం. తాము పురుడు పోసిన సంస్థను మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకోవడం భావోద్వేగభరిత ఘట్టమే అయినా, అందులోని సవాళ్ళు అనేకం. ఒకపక్కన పాతబడుతున్న విమానాలు, మరోపక్క వేల సంఖ్యలో ఉద్యోగులు వారసత్వంగా సంక్రమించాయి. కనీసం ఏడాది పాటు ఉద్యోగులెవరినీ తొలగించబోమని హామీ ఇచ్చిన టాటాలు నష్టాల్లో ఉన్న సంస్థను ఓ గాడిన పెట్టాలంటే అసాధారణ కృషి అవసరం. విమానయాన రంగంలో ఇప్పటికే ఒకటికి రెండు సంస్థల్లో టాటాల పెట్టుబడులున్నాయి. దేశంలో ఇప్పుడు మిగిలిన ఏకైక ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ ‘విస్తారా’లో, అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణాలకు తోడ్పడే విమానయాన సంస్థ ‘ఎయిర్ ఏషియా’ భారతీయ శాఖ (ఎయిర్ ఏషియా ఇండియా)లో టాటాలకు భాగముంది. ఇప్పుడు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో నూటికి నూరుపాళ్ళ యాజమాన్యం, క్షేత్రస్థాయి నిర్వహణ సంస్థ ‘ఎయిరిండియా – శాట్స్’లో 50 శాతం వాటా వచ్చింది. ఒకే గొడుగు కింది విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిరిండియాలు మూడూ పోటాపోటీ పడాల్సిన గమ్మల్తైన పరిస్థితి. అందుకే, ఏదో ఒక దశలో వీటన్నిటినీ ఒక్కటి చేసినా, ఆశ్చర్యం లేదు. ఏమైనా, ప్రైవేటీకరణతో గూటిలోని గువ్వ పిల్లకు కొత్త రెక్కలొస్తాయా? ఈ కరోనా కాలంలో ఎయిరిండియాకు టాటా ఎలాంటి బూస్టర్ షాట్ ఇస్తుంది? జవాబుల కోసం ఇంకొంతకాలం వేచి చూడాలి. ప్రభుత్వమేమో ప్రైవేటీకరణ లక్ష్యంలో భాగంగా ఖజానాకు మరింత సొమ్ము సమకూర్చు కోవడానికి మార్చి ఆఖరున ‘భారత జీవిత బీమా సంస్థ’ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇస్యూ గడువు పూర్తయ్యే దాకా ఆగకతప్పదు. అభ్యంతరాలు, అడ్డంకుల మధ్యనే భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ముందుకు సాగే సూచనలూ కనిపిస్తు న్నాయి. అనివార్యతలెలా ఉన్నా, ప్రజా ప్రయోజనాల్ని కాపాడాల్సిన ప్రభుత్వ సారథ్యంలోని స్వేచ్ఛా విహంగాలు ప్రైవేటు చేతిలో పతంగులుగా మారిపోవడానికి దారి తీసిన పరిస్థితులే తీరని దుఃఖం! -
విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్‌బాక్స్.. అసలు దానికథేంటి..?
విమాన ప్రమాదం జరిగిన మనకు మెదట వినిపించే పదం బ్లాక్ బాక్స్. తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో చీచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. అయితే వీరీలో బిపిన్ రావత్‌తో సహా 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కెప్టెన్ వరుణ్‌సింగ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అందులో ఏముంటుంది అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..) నిజానికి విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ జెట్ రికార్డర్. ఇందులో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఏ దిశలో ప్రయాణిస్తుంది.. ఎంత వేగంగా ప్రయాణిస్తుంది లాంటి సమాచారం రికార్డ్ అవుతుంటుంది. రెండవది కాక్ పిట్ రికార్డర్.. అంటే విమానం నడిపే పైలెట్ తన సహ పైలెట్‌తో మాట్లాడే మాటలను, గ్రౌండ్ కంట్రోల్ రూమ్‌తో మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది. చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు) ప్రయాణ సమయాల్లో రాడార్ సిగ్నల్స్ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదానికి గురైనా విమానం వెనుక భాగం తక్కువగా నష్టపోతుంది. బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. -
ఏంటీ... విమానంలో ప్రయాణించేటప్పుడు తినడానికి అది తీసుకువెళ్తావా!
మనం ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడూ తినుబండరాలను కూడా తీసుకువెళ్లాం. కాలక్షేపం కోసం లేక మనం వెళ్లిప్రాంతాల్లో తినే పదర్ధాలు ఏవైన దొరక్కపోవచ్చు అందువల్ల ఏదో ఒక తినుబండరాలను తీసుకువెళ్తారు. అయితే అవి మనకు వీలుగా ఉండేవి ఇతరు ప్రయణికులకు ఇబ్బంది కలిగించినవి తీసుకువెళ్తాం కానీ ఇక్కడ ఒక ఆమె ఏకంగా విమానంలో ఒక కాల్చిన చేపను తీసుకువెళ్తుంది. (చదవండి: వామ్మో! అంత ఎత్తులోంచి ఒకేసారి దూకేసారు... చివరికి) పైగా ఆ చేప వాసన విమానం అంతా వ్యాపించడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురువుతారు. విమాన నిబంధనల ప్రకారం ఎక్కువ మొత్తంలో ఇలాంటి ప్రిజర్వేటడ్ ఫుడ్‌ని తీసుకువెళ్లడానికి అంగీకరించవు. అయితే చాలామంది ప్రయాణికులు ఏదోరకంగా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే సదరు ప్రయాణికురాలు దీనికి సంబంధించిన ఫోటోతో పాటు " నేను మాత్రమేనా ఇలాంటి ఆహారం విమానంలో తీసుకువెళ్లేది" అంటూ క్యాప్షన్ జోడించి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి ఆహారం విమానంలోకి తీసుకువెళ్తారా అంటూ విమర్శిస్తూ రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. (చదవండి: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు) -
తోటలో పనిలో ఉండగా.. విమానంలోంచి, యాక్!!
మానవ వ్యర్థాలు ఈ మాట వింటేనే జనం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మరి అలాంటిది ఆకాశం నుంచి కుప్పలు, కుప్పలుగా వచ్చి మీద పడితే .. భయంకరంగా ఉంటుంది కదా. బ్రిటన్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి ఘోరమైన అనుభవం ఎదురైంది. గార్డెన్లో పనిచేసుకుంటున్న మనిషి అటుగా వెళ్తున విమానం నుంచి మానవ వ్యర్థాలు గుమ్మరించిన వ్యవహారం కలకలం రేపింది. (TV Channel : షాకింగ్ వెదర్ రిపోర్ట్‌లో.. ఆ క్లిప్పింగ్) తోటలో హాయిగా పనిచేసుకుంటున్న తరుణంలో విమానంలో నుంచి జారవిడిచిన వ్యర్థాలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. అలాగే అతని గార్డెన్లో ఉన్న పలు మొక్కలు, పైకప్పులపై కూడా పడ్డాయి. దీంతో వ్యర్థాలు పడిన వెంటనే అతడు గార్డెన్ నుంచి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. 2021 ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లోని విండ్సర్ సమీపంలో హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. కారెన్ డావిస్ జోక్యం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూట్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఆ విమానం ఎటు వెళ్లిందో బాధితుడు కనిపెట్టడం విశేషం. మరోవైపు ఆ విమానం పేరును బయటపెట్టడానికి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా బాధితుడు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. (kidney transplantation: సంచలనం) విండ్సర్ అండ్ మేడెన్ హెడ్‌కి చెందిన ది రాయల్ బోరో ఏవియేషన్ ఫోరమ్‌తో కారెన్ డావిస్ ఈ భయంకరమైన అనుభవాలను షేర్ చేశారు. విమానంలో నుంచి పడిన వ్యర్థాలు మొత్తం తోటంతా చాలా అసహ్యకరమైన రీతిలో పడ్డాయని వివరించారు. ఇలాంటి అనుభవం మరెవ్వరికీ రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే విమానంలోంచి జారవిడిచే మానవ వ్యర్థాలకు సంబంధించి ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు నమోదవుతూ ఉంటాయన్నారు. సాధారణంగా విమానాల నుంచి వదిలినపుడు ఎత్తైన ప్రదేశాల్లోని ఉష్ణోగ్రతకు తక్షణమే గట్ట కట్టి, కింత పడతాయని డావిస్ చెప్పారు. కానీ తాజా ఘటనలో మాత్రం దీనికి భిన్నంగా జరగడం అరుదైనదని చెప్పారు. కాగా సాధారణంగా విమానాల్లో టాయిలెట్స్ వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకుల్లో స్టోర్ చేసి విమానం ల్యాండ్ అయిన తర్వాత వాటిని తొలగిస్తారు. ఆధునిక విమానాలలో వాక్యూమ్ టాయిలెట్లు సాధారణంగా విమానాలతో పోలిస్తే చాలా సురక్షితమైనవి భావిస్తారు. -
మరో రెండు విమానాల్లో బయల్దేరిన అమెరికన్లు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన అమెరికన్లు మరో రెండు విమానాల్లో ఆదివారం బయల్దేరారు. తెలంగాణ ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్ సమన్వయంతో వీరిని ఆ దేశానికి పంపారు. మధ్యాహ్నం 3.15కి మొదటి విమానం ఏఐ1615లో 81 మంది పెద్దలు, ఒక శిశువు ముంబైకి బయల్దే రారు. మరో విమానం ఏఐ 1617లో 82 మంది పెద్దలు, ఒక శిశు వుతో 3.51కి ముంబైకి బయల్దేరింది. పూర్తి శానిటైజర్ చేసిన టెర్మినల్ ద్వారా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వీరిని పంపా రు. ఈ విమానాలు ముంబై మీదుగా అమెరికా వెళ్లనున్నట్లు ఆర్జీఐఏ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ విమానాల్లో ఎక్కే ప్రయాణికులను ముందుగా హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో బస చేయించారు. అమెరికన్ ఎంబసీ ఆధీనంలోకి తీసుకున్న ఈ హోటల్లోనే అందరికీ కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ విమానాల్లో వెళ్తున్న వారి ప్రయాణ చార్జీలను ఇంకా నిర్ధారించలేదు. నిర్ణయించిన చార్జీలను అమెరికా వెళ్లాక చె ల్లించాలంటూ ప్రయాణికుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. -
చార్జీల మోత వెనుక.. ‘ప్రైవేటు’ హస్తం
సాక్షి, హైదరాబాద్ : అసలే సంక్రాంతి సీజన్ ..హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లేవారికి ఇది ఎంతో ఒత్తిడికి గురిచేసే కాలం. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు రవాణా సంస్థలు ఇష్టారాజ్యం రేట్లతో ప్రయాణికుల జేబులు కొల్లగొడుతుండటం రివాజుగా మారిపోయింది. ఆర్టీసీ కూడా రద్దీ వేళల దృష్ట్యా కొంచెం ఎక్కువే వసూలు చేస్తుంటుంది. దీంతో పాటు విమాన చార్జీలు కూడా వేలకు వేలు పెరిగాయంటూ కొన్ని మాధ్యమాలు, ఓ చానల్ చేసిన ప్రచారం అందర్నీ బెంబేలెత్తించింది. అదీ బెంగళూరుకు రూ. 80 వేలు, విజయవాడకు రూ.50వేలు, రాజమండ్రికి రూ.70వేలు, విశాఖకు రూ.75 వేలు అంటూ బుధవారం మీడియాలో జరిగిన ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తాజాగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖ దినపత్రిక (సాక్షి కాదు) దాదాపుగా ఇలాంటి వార్తనే ప్రచురించడంతో గందరగోళానికి కారణమైంది. తెలంగాణలో ఆర్టీసీ 50 శాతానికి మించి అధిక చార్జీలు వసూలు చేయడం లేదు. పండుగ వేళల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి తిరు గు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి ఉన్నందుకే తాము ఆ మొత్తం వసూలు చేస్తున్నామని ఆర్టీసీ చెప్తోంది. వెబ్‌సైట్‌ను చూపి.. ఈ ప్రచారానికి ఊతమిచ్చింది విమాన టికెట్లు బుక్‌చేసే టికెట్ బుకింగ్ అగ్రిగేటర్ వెబ్సైట్ కావడం విశేషం. అందులోని లొసుగుల ఆధారంగా విమానయాన చార్జీలపై దుష్ప్రచారానికి కొన్ని వర్గాలు తెగబడ్డాయని విమానయాన సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. వీరి వెనుక ప్రైవేటు రవాణా సంస్థలు ఉన్నాయని వారి వాదన. వాస్తవానికి విమానాల్లో మిగిలి పోయిన సీట్ల మొత్తం చార్జీని ఆ వెబ్సైట్ చూపిస్తుంది. అయితే చూసేందుకు అది ఒకే సీటు చార్జీలా కనిపిస్తుంది. ఇలా టికెట్ల మోత మోగిందని ప్రచారం రాజుకుంది. లీగల్ చర్యలకు సిద్ధమవుతోన్న సంస్థలు.. ఈ ప్రచారం వల్ల చాలామంది విమాన ప్రయాణికులు ప్రైవేటు బస్సులవైపు మళ్లారు. దీనిపై సదరు టికెట్ అగ్రిగేటింగ్ సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ సంస్థను ఆధారంగా చూపి తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు త్వరలోనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెబ్సైట్ ప్రతినిధులు స్పష్టంచేశారు. తమ విమాన సంస్థలపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆ సంస్థలు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. వారు త్వరలోనే కేంద్ర విమానయానశాఖకు ఫిర్యాదు చేయబోతున్నారు. వాస్తవ చార్జీలు ఇవీ.. వాస్తవానికి మనదేశంలోని ఏ ప్రాంతానికైనా టికెట్ ధర రూ.5వేలకు మించదు. ఆకస్మికంగానో, లేదా అదనపు సౌకర్యాలున్న వాటిలో ప్రయాణించినా మరో రూ. 3– 4 వేలే అదనం కాగా... గరిష్టంగా 9 వేలు దాటదు. ఆఫర్లు ద్వారా..లేదా నెల ముందే బుక్ చేసుకుంటే ఈ ప్రయాణం రూ.రెండువేలలోపే ఉండే అవకాశాలూ ఉన్నాయి. ఇందులోనే జీఎస్టీ, సర్వీసుచార్జీలు, బీమా అన్నీ కలిపి ఉంటాయి.తాజాగా ఉన్న విమానయాన చార్జీలు గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. -
రన్‌వేపై జారిన విమానం..తప్పిన పెను ప్రమాదం
ఖాట్మండు: నేపాల్ దేశీయ విమానం ఒకటి శనివారం రాత్రి రన్‌వేపై అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నేపాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో 12 గంటల పాటు ఎయిర్‌పోర్టు సర్వీసులకు అంతరాయమేర్పడింది. ప్రమాదానికి గురైన విమానం, యేటి ఎయిర్‌లైన్స్‌కు చెందినది గుర్తించారు. రన్‌వేపై పగుళ్లు ఉండటంతో ఇటీవలే మరమ్మతులు కూడా చేశారు. ప్రమాద సమయంలో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్ గంజ్ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. గత మార్చి నెలలలో ఢాకా నుంచి ఖాట్మండు వెళ్తున్న యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ విమానం, రన్‌వే నుంచి పక్కకు జారిపోయి ప్రమాదానికి గురవడంతో 51 మంది ప్రయాణికులు చనిపోయారు. అలాగే గత ఏప్రిల్‌లో 139 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియన్ ప్యాసింజర్ విమానం అదృష్టం కొద్దీ ప్రమాదం నుంచి బయటపడింది. టేక్ఆప్ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి జారి బురదలో కూరుకుపోవడంతో ప్రమాదం తప్పింది. -
‘అణు’ విమానం
ఈ ఫొటోలో ఉన్నది ఓ విమానం. అంతరిక్షంలోకి వెళ్లే నౌకలా ఉందనుకుంటున్నారా.. అయితే సాధారణ మానవులు ప్రయాణించేందుకే దీన్ని రూపొందించారు. అసలు విశేషమేం టంటే ఇది మామూలు విమానాలు నడిచే ఇంధనంతో కాకుండా అణుశక్తితో నడుస్తుంది. అంటే విమానయాన రంగంలో ఇదొక సంచలనంగా చెప్పుకోవచ్చు. దీని వేగం ఎంతో తెలుసా? గంటకు 1,852 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట. దీని నుంచి కొంచెం కూడా కార్బన్ వెలువడదట. ఈ విమానాన్ని డిజైనర్ ఆస్కార్ వినల్స్ రూపొందించారు. దీనికి పెట్టిన పేరు ‘మాగ్నావమ్’ అంటే పెద్ద పక్షి అని అర్థం. ప్రస్తుతం సాధారణ విమానాల్లో లండన్ నుంచి న్యూయార్క్‌కు 3 గంటల్లోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించొచ్చట. రియాక్టర్ దీనికి కావాల్సిన ఇంధనాన్ని సమకూరుస్తుందట. ఇందులో దాదాపు 500 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చని చెబుతున్నారు. అయితే ఇది మన ముందుకు రావాలంటే ఇంకో పదేళ్లు పడుతుందట. -
రన్ వేపై విమానాలు ఢీ
టొరంటో: ఒకే రన్ వే మీదకు వచ్చిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలి పూర్తిగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరూ ప్రమాదంలో గాయపడలేదు. టొరంటో విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనపై టొరంటో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. పోలాండ్‌కు చెందిన బోయింగ్ 787 విమానం రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. అదే సమయంలో కెనడాకు చెందిన ఎయిర్ కెనడా విమానం రన్ వేపై దిగింది. ఈ సమయంలో రెండు విమానాల రెక్కలు ఢీ కొన్నాయి. ఇరు విమానాలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఒక్కో విమానంలో 200కుపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. -
డ్రోన్లకు రిమోట్ గన్
చూసేందుకు తుపాకీలా ఉందిగానీ.. బుల్లెట్లు బయటకు వచ్చేందుకు కన్నాలు లేవేమిటని ఆశ్చర్యపోవద్దు. ఈ తుపాకీ మనుషుల కోసం కాదు లెండి. మానవ రహిత విమానాలు... అవేనండీ డ్రోన్లు అంటామే వాటి కోసం. అలాగని ఇది వాటిని కాల్చి పడేయదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఎగురుతున్న డ్రోన్లను కూడా ఇది స్వాధీనంలోకి తెచ్చుకొని కావల్సిన చోట ల్యాండ్ అయ్యేలా చేస్తుంది. రేడియో తరంగాల సాయంతో దాని కమ్యూనికేషన్ ఛానెల్స్ మొత్తాన్నీ గందరగోళానికి గురిచేస్తుందీ తుపాకీ. అమెరికా కంపెనీ డ్రోన్షీల్డ్ వీటిని తయారు చేస్తోంది. -
ఆకాశంలో పెట్రోల్ బంకులు
భారత్ టు అమెరికా.. స్విట్జర్లాండ్ టు ఆస్ట్రేలియా.. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నాన్‌స్టాప్ ప్రయాణం! మధ్య మధ్యలో విమానాలు మారాల్సిన పని లేదు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాయాల్సిన అవసరం అసలే ఉండదు. మనం విమానం ఎక్కి కూర్చుంటే చాలు.. ఏ దేశానికైనా నేరుగా ఎగిరిపోవచ్చు! గాలిలో ప్రయాణిస్తుండగానే విమానాలకు ఇంధనం నింపగలిగితే సరి.. ఈ నాన్‌స్టాప్ ప్రయాణం సాకారం కానుంది! లోహవిహంగాలకు ఆకాశంలోనే ఇంధనం నింపడం కొత్త సంగతేమీ కాదు. కానీ ఈ సౌకర్యం ఇప్పటిదాకా యుద్ధవిమానాలకు మాత్రమే అందుబాటులో ఉంది. అదీ అమెరికాతో పాటు కొన్ని దేశాల ఫైటర్జెట్లకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. అయితే, ఈ టెక్నాలజీని ప్యాసెంజర్ విమానాలకూ అన్వయిస్తే ఇక విమానయానం రూపురేఖలే మారిపోతాయి. అందుకే యూరప్‌లోని 9 యూనివర్సిటీలు, సంస్థల పరిశోధకులు సాధారణ విమానాలకూ గాలిలోనే ఇంధనం నింపే పద్ధతుల రూపకల్పనకు నడుం బిగించారు. ‘రీక్రియేట్(రీసెర్చ్ ఫర్ ఏ క్రూయిజర్ ఎనేబుల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎన్విరాన్మెంట్)’ అనే ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టును అమలు చేస్తే ప్యాసెం జర్ విమానాలకూ గాలిలోనే ఇంధనం నింపడం సాధ్యమేనని వీరు చెబుతున్నారు. లోహవిహంగాలకు నింగిలోనే ఇంధనం నింపేందుకు మరో పద్ధతినీ వీరు ప్రతిపాదించారు. లాభమేనా..? విమానాలకు ఆకాశంలోనే ఇంధనం నింపడం వల్ల ఇంధన ఖర్చులు సుమారు 25 శాతం వరకూ తగ్గుతాయని చెబుతున్నారు. ఉదాహరణకు.. 250 మంది ప్రయాణికులతో ఓ విమానం 6 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే.. అందులో ఇంధన ఖర్చు 23 శాతం ఆదా అవుతుంది. అలాగే, విమానాశ్రయాల వద్ద ధ్వని, వాయు కాలుష్యాలు తగ్గుతాయి. ప్రయాణికులకు పలు ప్రయాసలు తప్పుతాయి. పని లేకున్నా వివిధ దేశాల్లో దిగాల్సిన అవసరం ఉండదు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అయితే, ఇంధన విమానాలు కూడా అదనంగా ఆకాశంలో తిరుగుతాయి కాబట్టి వాటి వల్ల వచ్చే కాలుష్యం సంగతేంటి? ఇంధన ఖర్చుల మాటేమిటి? అంటే.. ఆ దిశగా మరింత పరిశోధించాల్సి ఉందన్నదే పరిశోధకుల సమాధానం. ఎలా నింపుతారు? ప్రయాణికులతో కూడిన విమానం గమ్యస్థానానికి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో ఇంధనం అయిపోయే దశకు చేరుకోగానే అక్కడికి ఇంధనాన్ని మోసుకుని ఓ రీఫ్యూయెలింగ్ విమానం వస్తుంది. ప్రయాణికుల విమానం పైన, ఇంధన విమానం కింద ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. ఇంకేం.. ఇంధన విమానం నుంచి ప్రత్యేక గొట్టాలు, పరికరాల ద్వారా ప్రయాణికుల విమానం ట్యాంకులోకి ఇంధనం సరఫరా అవుతుంది. ట్యాంకు ఫుల్ కాగానే.. రెండూ విడిపోతాయి. ఇంధన విమానం తిరిగి తన స్థావరానికి వెళ్లిపోతుంది. దీనికే వీరు క్రూయిజర్-ఫీడర్ కాన్సెప్ట్ అని పేరుపెట్టారు. అయితే, ఒక మార్గంలో వరుసగా ఐదు విమానాలకు కూడా ఈ రీఫ్యూయెలింగ్ విమానం నుంచి ఇంధనాన్ని నింపొచ్చు. భారీ ఇంధన విమానాన్ని ప్రపంచమంతా విమాన మార్గాల్లో తిప్పుతూ.. ఎక్కడ అవసరమైతే అక్కడ విమానాలకు ఇంధనం నింపే ‘ఎయిర్మెట్రో’ అనే మరో పద్ధతినీ వీరు ప్రతిపాదించారు. -
విమానమే కదా.. ఎవరు చూస్తారులే!
విమానాల్లో ప్రయాణించేటప్పుడు కాస్త సభ్యత పాటించడం సంస్కారం. అయితే కొంతమంది మాత్రం వీటన్నింటినీ గాలికి వదిలేసి తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటుంటారు. సాధారణంగా విమానాల్లో కూర్చోడానికే తప్ప పడుకోడానికి అవకాశం ఉండదు. దూరప్రయాణాలు చేసేవాళ్లు అలా కూర్చునే నిద్రపోతారు. మామూలుగా అయితే మన సీట్లో కూర్చుని, కాస్త వెనక్కి వాలి.. పక్కవాళ్లకు ఇబ్బంది కలిగించని రీతిలో నిద్రించాలి. కానీ, ఇంతకుముందు చెప్పుకొన్న రకం వాళ్లు మాత్రం.. విమానం ఏదో తమ సొంత ఇల్లన్నట్లుగా భావించి ఎదుటి సీట్ల మీద కాళ్లు పెట్టడం, చొక్కాలు విప్పేసి పడుకోవడం.. ఇలా ప్రవర్తిస్తున్నారు. లోపల తామేం చేసినా బయటి ప్రపంచానికి తెలియదన్న ధైర్యం వాళ్లతో ఇలా చేయిస్తోంది. అయితే.. ఇలాంటివాళ్లను పట్టించడానికి ఇప్పుడు సోషల్ మీడియా ముందుకొచ్చింది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 'ప్యాసింజర్ షేమింగ్' అనే గ్రూపు ఇప్పుడు బాగా ట్రెండవుతోంది. విమానాల్లో ప్రయాణిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాళ్లు, అమర్యాదగా ఉండేవాళ్లు, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేవాళ్లను అప్పటికప్పుడు తమ స్మార్ట్ఫోన్లతో ఫొటో తీసి.. వాటిని ఈ గ్రూపులలో షేర్ చేస్తున్నారు. తద్వారా వాళ్లు చేసే పనులను ప్రపంచం మొత్తానికి చాటుతున్నారు. -
సామాన్యులకు చేరువలో విమానయానం: అశోక్
సాక్షి, న్యూఢిల్లీ: కేవలం ధనికుల కోసమే విమానాలు, లేదంటే మిలిటరీ ఆపరేషన్ల కోసమే విమానాలు అనే ఆలోచనను పూర్తిగా మార్చివేస్తామని, విమానయానాన్ని కూడా సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన జరగాలని, ఆ విధంగా ఆలోచన చే యాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర, తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కేంద్రం కృషి చేయాల్సి ఉందన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నారు. అదే సమయంలో మన రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మరింత హెచ్చుగా ఉంటుందన్నారు. ‘సున్నితమైన ఆపరేషన్ లాంటి రాష్ట్ర విభజనను కసాయివాడు కత్తితో కోసినట్టు చేశారని’ ఆయన తెలిపారు. అందుకే తెలంగాణలో, సీమాంధ్రంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. -
ఎలక్షన్ వేళ లోహవిహంగాలకు కలెక్షన్లే కలెక్షన్లు
ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు ... పాద యాత్రలు కొద్ది మంది నేతలే చేస్తారు. మిగిలిన నేతలు ఆకాశమార్గం పడతారు. విమానాలపై ప్రయాణాలు చేస్తారు. అందుకే ఈ ఎన్నికల సీజన్ లో దేశంలోని 130 చార్టర్డ్ విమాన సంస్థలు భారీగా బిజినెస్ చేసుకుంటున్నాయి. ఎన్నిక ఎన్నికకీ ఎన్నికల వ్యయం పెరుగుతోంది. దీనితో విమాన ప్రయాణాల ఖర్చులు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని గత రెండేళ్లుగా నష్టాల్లో ఉన్న చార్టర్డ్ విమాన సేవల రంగం ఒక్కసారిగా పుంజుకుని లాభాల బాటలో పయనిస్తోంది. ఒక అంచనా ప్రకారం బిజినెస్ లో దాదాపు 40 శాతం వరకూ పెరుగుదల ఉంది. వ్యాపార వర్గాల కథనం మేరకు ఒక్కో ప్రధాన రాజకీయ పార్టీ దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయల మేరకు ఎన్నికల వేళ విమాన లేదా హెలికాప్టర్ యానానికి ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటివరకూ లోహవిహంగాల్లో అత్యధిక సమయం ప్రయాణించిన ఘనత నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలకే దక్కుతుంది. ఇద్దరూ రోజూ మూడు నాలుగు సభల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి వారికి దేశమంతా చుట్టి వచ్చేందుకు విమానాలు తప్పనిసరవుతున్నాయి. ఇంతగా విమానాలను వాడుతున్నా వారు 200 నియోజకవర్గాలకు మించి వెళ్లడం కష్టం. విమానాలు లేకపోతే నలభై యాభై నియోజకవర్గాలను మాత్రమే టచ్ చేయగలుగుతారు. చార్టర్డ్ విమానయాన రంగం నిఫుణుల కథనాల మేరకు దాదాపు 520 హెలికాప్టర్లు, విమానాలు అద్దెకు దొరుకుతున్నాయి. మామూలు సింగిల్ ఇంజన్ విమానాలు గంటకు 75000 నుంచి లక్ష రూపాయల వరకూ చార్జి చేస్తున్నాయి. అయితే ముఖ్య నేతలు డబుల్ ఇంజన్ ఉన్న నాలుగు సీటర్లను కోరుకుంటున్నారు. ఇవి గంటకు 2.5 నుంచి 3 లక్షల వరకూ అద్దెని వసూలు చేస్తాయి. ఒక్క విమాన సంస్థలే కాదు ఎయిర్ పోర్టులు లాండింగ్, టేకాఫ్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. విమానాల మరమ్మత్తులు, మెయింటెనెన్సు కూడా భారీ ఆదాయాన్నిస్తోంది. కాబట్టి ఒక్క విమాన కంపెనీలే కాక వివిధ అనుబంధ పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా ఎన్నికల సీజన్ నుంచి భారీ లాభాలు పొందుతున్నాయి. ఎన్నికల వేళ ఇనుప రెక్కల పక్షులు మరింత లాభాలను పొందుతాయన్నదే పరిశ్రమ వర్గాల అంచనా. దీని వల్ల నష్టాల్లో ఉన్న పరిశ్రమలు లాభాల మేఘాల మీద పరుగులు తీస్తాయని వారంటున్నారు.