సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దాన్ని మరింత వేగవంతం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను వినియోగిస్తోంది. ఈ విధానంలోనూ విజయవంతంగా ముందుకెళ్తోంది. రీసర్వేలో 1.30 లక్షల చదరపు కిలోమీటర్లు కొలవాల్సివుంది. అందులో 32,252 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా, మిగిలిన ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా కొలవాలని నిర్ణయించారు.
కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 32,252 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా కొలవడం మొదలుపెట్టి ఇప్పటికే 30 వేల చదరపు కిలోమీటర్లకుపైగా పూర్తి చేశారు. మరో 15 రోజుల్లో మిగిలిన 2 వేలకుపైగా చదరపు కిలోమీటర్లలోనూ సర్వే పూర్తి చేస్తామని సర్వే సెటిల్మెంట్ అధికారులు తెలిపారు.
త్వరగా సర్వే పూర్తి చేయడం కోసమే..
రీ సర్వేను ఇంకా వేగంగా నిర్వహించాలంటే డ్రోన్లకంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరే విమానాలు, హెలీకాప్టర్లను వినియోగించాలని ప్రభుత్వంనిర్ణయించింది. వాటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ భాగాన్ని కొలవొచ్చు. కానీ భూముల సర్వే కోసం ఇప్పటివరకు దేశంలో ఎక్కడా విమానాలను ఉపయోగించలేదు. జాతీయ రహదారులు, కొన్ని పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి విమానాలతో ఆ ప్రాంతాలను కొలిచిన అనుభవం మాత్రమే ఉంది. దీంతో అందులో అనుభవం ఉన్న సంస్థలతో చర్చించి తొలిసారి విమానాల ద్వారా భూముల కొలతను నంద్యాలలో ప్రారంభించారు.
ఎక్కువ ప్రాంతాన్ని కొలిచేందుకు ఎక్కువ పిక్సెల్స్ ఉండే అత్యాధునిక కెమేరాలు ఉపయోగించారు. వాటి చిత్రాలను హైదరాబాద్‌లోని సర్వే ఆఫ్ ఇండియా లేబొరేటరీలో తనిఖీ చేయించారు. డ్రోన్ల కంటేæ కచ్చితత్వంతో చిత్రాలు వచ్చాయని నిర్థారణ అయింది. అనంతరం 32 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రెండు ఏజెన్సీల ద్వారా 3 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో, ఒక ఏజెన్సీకి చెందిన హెలీకాప్టర్‌ను వినియోగించి సర్వే చేయించారు. డ్రోన్ల ద్వారా 120 మీటర్ల ఎత్తు నుంచి చిత్రాలు తీస్తున్నారు. విమానాల ద్వారా 1,500 మీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు తీశారు. ఒక్క రోజులో 200 నుంచి 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విమానాల ద్వారా కొలిచారు. ఎక్కువ పరిధిలోని భూమి ఒకే చిత్రంలో అత్యంత నాణ్యతతో రావడంతో రీసర్వే సులభమైందని సర్వేశాఖ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment