సామాన్యులకు చేరువలో విమానయానం: అశోక్
సాక్షి, న్యూఢిల్లీ: కేవలం ధనికుల కోసమే విమానాలు, లేదంటే మిలిటరీ ఆపరేషన్ల కోసమే విమానాలు అనే ఆలోచనను పూర్తిగా మార్చివేస్తామని, విమానయానాన్ని కూడా సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన జరగాలని, ఆ విధంగా ఆలోచన చే యాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర, తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కేంద్రం కృషి చేయాల్సి ఉందన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నారు. అదే సమయంలో మన రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మరింత హెచ్చుగా ఉంటుందన్నారు. ‘సున్నితమైన ఆపరేషన్ లాంటి రాష్ట్ర విభజనను కసాయివాడు కత్తితో కోసినట్టు చేశారని’ ఆయన తెలిపారు. అందుకే తెలంగాణలో, సీమాంధ్రంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు.