ఆకాశంలో పెట్రోల్ బంకులు
భారత్ టు అమెరికా.. స్విట్జర్లాండ్ టు ఆస్ట్రేలియా.. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నాన్‌స్టాప్ ప్రయాణం! మధ్య మధ్యలో విమానాలు మారాల్సిన పని లేదు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాయాల్సిన అవసరం అసలే ఉండదు. మనం విమానం ఎక్కి కూర్చుంటే చాలు.. ఏ దేశానికైనా నేరుగా ఎగిరిపోవచ్చు! గాలిలో ప్రయాణిస్తుండగానే విమానాలకు ఇంధనం నింపగలిగితే సరి.. ఈ నాన్‌స్టాప్ ప్రయాణం సాకారం కానుంది!
లోహవిహంగాలకు ఆకాశంలోనే ఇంధనం నింపడం కొత్త సంగతేమీ కాదు. కానీ ఈ సౌకర్యం ఇప్పటిదాకా యుద్ధవిమానాలకు మాత్రమే అందుబాటులో ఉంది. అదీ అమెరికాతో పాటు కొన్ని దేశాల ఫైటర్‌జెట్‌లకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. అయితే, ఈ టెక్నాలజీని ప్యాసెంజర్ విమానాలకూ అన్వయిస్తే ఇక విమానయానం రూపురేఖలే మారిపోతాయి. అందుకే యూరప్‌లోని 9 యూనివర్సిటీలు, సంస్థల పరిశోధకులు సాధారణ విమానాలకూ గాలిలోనే ఇంధనం నింపే పద్ధతుల రూపకల్పనకు నడుం బిగించారు. ‘రీక్రియేట్(రీసెర్చ్ ఫర్ ఏ క్రూయిజర్ ఎనేబుల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఎన్విరాన్‌మెంట్)’ అనే ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టును అమలు చేస్తే ప్యాసెం జర్ విమానాలకూ గాలిలోనే ఇంధనం నింపడం సాధ్యమేనని వీరు చెబుతున్నారు. లోహవిహంగాలకు నింగిలోనే ఇంధనం నింపేందుకు మరో పద్ధతినీ వీరు ప్రతిపాదించారు.
లాభమేనా..?
విమానాలకు ఆకాశంలోనే ఇంధనం నింపడం వల్ల ఇంధన ఖర్చులు సుమారు 25 శాతం వరకూ తగ్గుతాయని చెబుతున్నారు. ఉదాహరణకు.. 250 మంది ప్రయాణికులతో ఓ విమానం 6 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే.. అందులో ఇంధన ఖర్చు 23 శాతం ఆదా అవుతుంది. అలాగే, విమానాశ్రయాల వద్ద ధ్వని, వాయు కాలుష్యాలు తగ్గుతాయి. ప్రయాణికులకు పలు ప్రయాసలు తప్పుతాయి. పని లేకున్నా వివిధ దేశాల్లో దిగాల్సిన అవసరం ఉండదు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అయితే, ఇంధన విమానాలు కూడా అదనంగా ఆకాశంలో తిరుగుతాయి కాబట్టి వాటి వల్ల వచ్చే కాలుష్యం సంగతేంటి? ఇంధన ఖర్చుల మాటేమిటి? అంటే.. ఆ దిశగా మరింత పరిశోధించాల్సి ఉందన్నదే పరిశోధకుల సమాధానం.
ఎలా నింపుతారు?
ప్రయాణికులతో కూడిన విమానం గమ్యస్థానానికి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో ఇంధనం అయిపోయే దశకు చేరుకోగానే అక్కడికి ఇంధనాన్ని మోసుకుని ఓ రీఫ్యూయెలింగ్ విమానం వస్తుంది. ప్రయాణికుల విమానం పైన, ఇంధన విమానం కింద ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. ఇంకేం.. ఇంధన విమానం నుంచి ప్రత్యేక గొట్టాలు, పరికరాల ద్వారా ప్రయాణికుల విమానం ట్యాంకులోకి ఇంధనం సరఫరా అవుతుంది. ట్యాంకు ఫుల్ కాగానే.. రెండూ విడిపోతాయి. ఇంధన విమానం తిరిగి తన స్థావరానికి వెళ్లిపోతుంది. దీనికే వీరు క్రూయిజర్-ఫీడర్ కాన్సెప్ట్ అని పేరుపెట్టారు. అయితే, ఒక మార్గంలో వరుసగా ఐదు విమానాలకు కూడా ఈ రీఫ్యూయెలింగ్ విమానం నుంచి ఇంధనాన్ని నింపొచ్చు. భారీ ఇంధన విమానాన్ని ప్రపంచమంతా విమాన మార్గాల్లో తిప్పుతూ.. ఎక్కడ అవసరమైతే అక్కడ విమానాలకు ఇంధనం నింపే ‘ఎయిర్‌మెట్రో’ అనే మరో పద్ధతినీ వీరు ప్రతిపాదించారు.