సామాన్యులకు షాక్ కొడుతున్న గుడ్డు
రాష్ట్రంలో రిటైల్ మార్కెట్‌లో రూ.8కి చేరిన ధర
ఫాం గేట్ వద్దే రైతు ధర రూ.6.20.. మరింత పెరిగే అవకాశం.. చలి కాలం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన వినియోగం
క్రిస్మస్, నూతన సంవత్సరం వస్తుండటంతో పెరగనున్న స్థానిక వినియోగం
పెరిగిపోయిన కోళ్ల మేత, రవాణా చార్జీల భారం
ధర మరింత పెరుగుతుందంటున్న మార్కెట్ వర్గాలు
కొనలేమంటున్న వినియోగదారులు
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, భీమవరం/ నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, పప్పులు, నూనెలు ఏవీ కొనేటట్టు లేవు. కూరగాయలు కూడా కిలో 60కి తక్కువ ఏదీ లేదు. కాస్తో కూస్తో కోడి గుడ్డే చవగ్గా ఉందనుకుంటే ఇప్పుడు అదీ కొండెక్కి కూర్చుంటోంది. రిటైల్‌గా ఒక్కో గుడ్డు రూ.7కి తక్కువ లేదు. కొన్ని జిల్లాల్లో రూ.8.00కి ఎగబాకేసింది. ఈ సీజన్‌లోనూ గుడ్డు ధర ఫాం గేటు వద్దే పరుగులు పెడుతోంది. ప్రస్తుతం రూ.6.20తో పాత ధరను చేరుకొంది.
ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. హోల్‌సేల్‌లో ధరే వంద గుడ్లు ధర రూ.700కు చేరింది. రిటైల్ మార్కెట్లోకి వచ్చే సరికి మరో రూపాయి పెరిగి రూ.8కి చేరడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. ఫాం గేటు వద్ద ధర పెరిగితే రిటైల్ ధర కూడా ఇంకా పెరుగుతుందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. ఇంత ధర పెట్టి కొనలేమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో రోజుకు 4.4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 శాతం గుడ్లు పశి్చమ బెంగాల్, బీహార్, అసోం, ఒడిశా, యూపీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటే మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్పత్తయ్యే గుడ్లలో అధిక శాతం స్థానికంగానే వినియోగమవుతున్నాయి.
శీతాకాలం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువై, ఎగుమతులు పెరిగి ఫాం గేటు ధర పెరుగుతోంది. గత డిసెంబరు 27న ఫాం గేట్ వద్ద రూ.6.20తో అత్యధిక ధర నమోదయింది. ఆ తర్వాత తగ్గినా.. మళ్లీ క్రమేపీ పెరిగి గురువారం రూ.6.20కి చేరింది. మరోపక్క రైతులకు కూడా మేత ధరలు, రవాణా ఖర్చులూ పెరిగిపోయాయి. ధరలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. రైతులకు ఎటువంటి సహాయం చేయడంలేదు. దీని ప్రభావం ధరలపై పడుతోంది.
రైతుకేమీ లాభం లేదంటున్న పౌల్ట్రీ వర్గాలు
ప్రస్తుతం గుడ్డు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీ, పెరిగిన మేత ధరలతో రైతుకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కొద్దికాలంగా పౌల్ట్రీలు విస్తరించి, రోజుకు 2.5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో కోస్తా గుడ్లకు డిమాండ్ తగ్గింది. పైగా, ఇక్కడి నుంచి వెళ్లే ఒక్కో గుడ్డుపై రూపాయి వరకు రవాణాకు ఖర్చవుతుండగా అక్కడి గుడ్లపై 25 పైసల లోపే ఉంటోంది. దీంతో అక్కడి మార్కెట్ ధరకు తగ్గించి అమ్మడం వల్ల నష్టపోతున్నామని కోళ్ల రైతులు అంటున్నారు.
మరోపక్క కోళ్ల మేతలో ఎక్కువగా వాడే మొక్కజొన్న ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువ సాగవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రవాణా చార్జీల భారం పెరిగిపోతోంది. దీనికితోడు ఇథనాల్, ఆల్కహాల్ పరిశ్రమలు మొక్కజొన్నతో పాటు కోళ్ల మేతలో వాడే పాడైన బియ్యం నూకలను కూడా భారీగా కొనేస్తుండటంతో ఇవి రైతాంగానికి దొరకడంలేదు.
గతంలో పంట వచ్చిన సమయంలో కిలో రూ.18 ఉండే మొక్కజొన్న ఇప్పుడు రూ.27 ఉంది. దీంతో నిర్వహణ భారంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఏడాది సగటు రైతు ధర రూ.5.75 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని, ఈ ఏడాది రూ.5 లోపే ఉండటంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది సీజన్..
చలి ఎక్కువగా ఉండే నవంబరు నుంచి ఫిబ్రవరి నెల వరకు పౌల్ట్రీకి సీజన్‌గా భావిస్తారు. ఏటా ఈ కాలంలో రైతు ధర పెరుగుతూ ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో చేపల లభ్యత తగ్గుతుంది. దీంతో అక్కడ గుడ్ల వినియోగం పెరుగుతుంది. రాష్ట్రంలోనూ చలి కాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది.
కార్తీక మాసమూ ముగిసింది. పైపెచ్చు క్రిస్మస్, నూతన సంవత్సరం వస్తుండడంతో కేక్‌లకు డిమాండ్ ఉంటుంది. కేకులలో కోడిగుడ్లు తప్పనిసరిగా వాడతారు. సంక్రాంతికి కూడా గుడ్లకు డిమాండ్ ఎక్కువే. అందువల్ల ఇప్పటి నుంచే గుడ్లు ధర పెంచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం ఆదుకుంటేనే పౌల్ట్రీలకు మనుగడ
మేత ధరలు, నిర్వహణ భారం విపరీతంగా పెరిగిపోయి గుడ్డు ధర గిట్టుబాటు అవ్వక కొన్నేళ్లుగా కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. మొక్కజొన్న, నూకలను ఇథనాయిల్, ఆల్కహాల్ కంపెనీలు ముందుగానే టోకుగా కొనేస్తుండటంతో కోళ్లకు మేత దొరకడం కష్టమవుతోంది. మొక్కజొన్న, ఎఫ్‌సీఐలో పాడైన బియ్యం, నూకలను సబ్సిడీపై అందించి ప్రభుత్వం ఆదుకోవాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి,అర్తమూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
రేట్లు ఎక్కువగా ఉన్నాయి
కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పెరగడమే తప్ప తగ్గడం అనేది లేదు. గుడ్డు తిందామన్నా రేట్లు చూసి మానుకోవాల్సి వస్తోంది. – వినయ్, స్టౌన్‌హౌస్‌పేట, నెల్లూరు జిల్లా
అన్ని రేట్లు పెరిగాయి
ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కనీసం గుడ్డు తిందామన్నా రేట్లు చూస్తే భయమేస్తోంది. కొందరు వ్యాపారులు కావాలనే రేట్లు పెంచుతున్నారనే ఆనుమానాలు కలుగుతున్నాయి.
– బ్రహ్మరెడ్డి, డీసీ పల్లి, నెల్లూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment