వర్షాలు, వరదలతో విజృంభిస్తున్న వైరస్‌లు.. భారంగా మారిన మేత ఖర్చులు
గణనీయంగా తగ్గిన ఉత్పత్తి.. సిండికేట్‌గా మారిన ఉత్తరాది వ్యాపారులు
పౌల్ట్రీ రంగంలో నాలుగు దశాబ్దాల అపార అనుభవం ఉన్న రెడ్డిబత్తుల సత్యనారాయణరెడ్డి 2 వేల కోళ్లతో మొదలు పెట్టి 2.32 లక్షల కోళ్ల ఫారం నిర్వహించే స్థాయికి ఎదిగారు. పదేళ్ల పాటు కృష్ణా జిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. అలాంటి రైతు కూడా చివరకు నష్టాలు భరించలేక నూజివీడు మండలం అన్నవరం వద్ద తనకున్న కోళ్ల ఫారాలను అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తమ ప్రాంతంలో ఇటీవల ఐదు కోళ్ల ఫారాలను విక్రయించారని, మిట్టగూడెం వద్ద ఓ కోళ్లఫారాన్ని కూలగొట్టి భూమి విక్రయానికి పెట్టారని, ప్రభుత్వం ఆదుకోకుంటే పౌల్ట్రీ రంగం కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు తోడు ఫామ్ గేటు వద్ద గుడ్డుకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో అక్కడ పౌల్ట్రీ పరిశ్రమ బలంగా వేళ్లూనుకోవడం లాంటిæ కారణాల వల్ల రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. పలు జిల్లాల్లో ఫామ్స్‌ను విక్రయిస్తుండగా మరికొన్ని చోట్ల కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తున్నారు. – సాక్షి, అమరావతి
గతేడాది రికార్డు స్థాయిలో గుడ్డు ధర..
రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఏపీలో 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వినియోగమవుతుండగా 2 కోట్లకు పైగా గుడ్లు పశి్చమ బెంగాల్, ఒడిశా, బిహార్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
మొన్నటి వరకు శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున గుడ్లు ఎగుమతి అయ్యేవి. పౌల్ట్రీ రంగ చరిత్రలో 2023లో ఫామ్ గేటు వద్ద గుడ్డుకు రికార్డు స్థాయిలో రూ.5.75కుపైగా ధర లభించడం, అదే సమయంలో పౌల్ట్రీరంగ అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ తెచ్చే దిశగా అడుగులు వేయడంతో తమ వెతలు తీరుతాయని రైతులు భావించారు.
మేత ఖర్చులు తడిసి మోపెడు...
ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాత పడగా ఆ ప్రభావంతో కోళ్లు పెద్దఎత్తున జబ్బుల పాలవుతున్నాయి. పౌల్ట్రీ రంగంలో విరివిగా వినియోగించే మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ తదితరాలు ఇథనాల్ ఫ్యాక్టరీలకు మళ్లించడంతో బహిరంగ మార్కెట్‌లో వాటి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
సోయా మినహా మిగిలిన మేతæ ఖర్చులు రైతులకు భారంగా మారిపోయాయి. సాధారణంగా జూన్ తర్వాత ఫామ్ గేటు వద్ద గుడ్డు రేటు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద రూ.4.50 నుంచి రూ.4.75కి మించి రావడం లేదు. ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద లేయర్ లైవ్ ధర కిలో రూ.78, బాయిలర్ రూ.102 చొప్పున ధర లభిస్తోంది.
40–50 శాతానికి పడిపోయిన ఉత్పత్తి
సాధారణంగా ఫామ్‌లో 70–80 వారాల పాటు కోడి సగటున రూ.1,300 విలువైన మేత తింటుంది. సగటున 330 వరకు గుడ్లు పెడుతుంది. అత్యధికంగా 20–40 వారాల మధ్య గరిష్టంగా 96 గుడ్లు వరకు పెడుతుంటాయి. వర్షాలు, వరదల వల్ల దాదాపు 8–10 శాతం కోళ్లు వైరస్‌ల బారిన పడడంతో 40–50 శాతానికి ఉత్పత్తి తగ్గిపోయింది.
పెట్టుబడి ఖర్చులు తట్టుకోలేక కొత్త బ్యాచ్‌లు పెట్టేందుకు రైతులు సాహసించడం లేదు. ప్రస్తుతం 75 శాతం కెపాసిటీతోనే ఫామ్స్ నడిచే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయంలో 4.75 కోట్ల నుంచి 5 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవగా ప్రస్తుతం 3.75 కోట్లకు మించి ఉత్పత్తి కావడం లేదు.
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్లకు ధర లేకుండా చేయడం, తమిళనాడు నుంచి కూడా ఏపీకి సరఫరా పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలు గణనీయంగా పెరుగుతుండడంకూడా ఏపీ పౌల్ట్రీ రంగానికి అశనిపాతంగా మారింది.
సిండికేట్‌తో ధరలు పతనం
గతేడాది రికార్డు స్థాయిలో ధర లభించడంతో పౌల్ట్రీ రంగం కాస్త కుదుటపడుతుందని రైతులు ఆశించారు. వైరస్‌ల ప్రభావంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు సిండికేట్‌గా మారి ఫామ్ గేటు వద్ద మన రైతుకు ధర లేకుండా చేస్తున్నారు. – తుమ్మల కుటుంబరావు, నెక్ మాజీ చైర్మన్
మేత ఖర్చులు భారం..
ఇథనాల్ ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి. మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ ఈ ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌లో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కోళ్ల ఫారమ్‌ల నిర్వహణ చాలా భారంగా మారింది. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment