
అమెరికా టారిఫ్ పెంపుతో రాష్ట్ర ఎగుమతులపై ప్రభావం
దాణా దిగుమతి చేసుకుంటే 40% తగ్గనున్న పౌల్ట్రీ ఉత్పత్తి వ్యయం
తద్వారా మలేషియా, దుబాయ్, థాయ్‌లాండ్ పౌల్ట్రీ మార్కెట్లపై దృష్టి
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలంటున్న పౌల్ట్రీ సంస్థలు
ఎల్రక్టానిక్స్ వస్తువుల తయారీ రంగంలో తైవాన్, చైనా కంటే మనకే ఎక్కువ అవకాశాలు
టారిఫ్‌ల నుంచి ఫార్మా రంగం మినహాయింపుపై హర్షం
ఆక్వా, టెక్స్‌టైల్ రంగాలపై ప్రతికూలత
సాక్షి, అమరావతి: మన దేశం నుంచి జరిగే ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం కొన్ని రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంటే మరికొన్ని రంగాలకు చేటు చేస్తుందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలను 27 శాతం పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయడంతో దీని ప్రభావం మన రాష్ట్రంపై ఎలా ఉంటుందన్న దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.
రాష్ట్రం నుంచి అత్యధికంగా అమెరికాకు ఎగుమతయ్యే ఆక్వా వంటి సముద్ర ఉత్పత్తులు, టెక్స్‌టైల్ రంగాలపై ఈ టారిఫ్ పెంపు భారీ ప్రభావం చూపుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో టారిఫ్‌ల పెంపుతో ఎల్రక్టానిక్స్, ఆభరణాలు, ఫార్మా, పౌల్ట్రీ వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. 2023–24 సంవత్సరంలో రాష్ట్రం నుంచి మొత్తం రూ.1.67 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా, అందులో సుమారు రూ.35,000 కోట్లు అమెరికాకే జరిగాయి.
రాష్ట్ర ఎగుమతిదారులకు అమెరికా అతిపెద్ద మార్కెట్ కావడంతో ట్రంప్ నిర్ణయ ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న దానిపై విస్తృత అధ్యయనం మొదలైంది. టారిఫ్‌ల పెంపుపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని, ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల తర్వాత ఈ టారిఫ్‌లు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల తర్వాత సుమారు రూ.15,000 కోట్ల ఎగుమతులు జరిగే ఫార్మా రంగాన్ని టారిఫ్ పెంపు నుంచి మినహాయించడంపై ఆ రంగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా టారిఫ్‌ల పెంపుపై వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

ఎల్రక్టానిక్స్ తయారీ రంగానికి ఊపు
పీఎల్‌ఐ స్కీంతో ఎల్రక్టానిక్స్ తయారీ రంగం రాష్ట్రంలో ఊపందుకుంది. తైవాన్, చైనాలపై అమెరికా అత్యధికంగా టారిఫ్‌లు పెంచడం మనకు కలిసి వచ్చే అంశం. ఇండియాపై 27 శాతం టారిఫ్ విధిస్తే చైనాపై 54 శాతం విధించడంతో ఎల్రక్టానిక్స్ తయారీకి ఇండియా బెస్ట్‌గా మారే అవకాశముంది.– రవీంద్ర సన్నారెడ్డి, ఎండీ, శ్రీసిటీ.
ఇదో చక్కటి అవకాశం
రాష్ట్రం నుంచి అమెరికాకు పౌల్ట్రీ ఎగుమతులు చాలా తక్కువ. దీంతో టారిఫ్ పెంపు ప్రభావం ఈ రంగంపై అంతగా కనిపించదు. కానీ మన దేశంతో పోలిస్తే పౌల్ట్రీ ఫీడ్‌లో ప్రధానమైన మొక్కజొన్న చాలా చౌక. దీన్ని ఉపయోగించుకుంటూ కేవలం పౌల్ట్రీ ఎగుమతుల కోసం పౌల్ట్రీ ఫీడ్ తెచ్చుకుంటే ఉత్పత్తి వ్యయం 30–40 శాతం తగ్గిపోతుంది. అప్పుడు ఇతర దేశాల పౌల్ట్రీ పరిశ్రమతో మనం పోటీ పడగలం. – సురేష్ చిట్టూరి, వీసీఎండీ, శ్రీనివాస్ ఫామ్స్.
ఇంకా అధ్యయనం జరగాలి
స్టీల్, మెటల్స్ రంగాలపై టారిఫ్ ప్రభావం ఎంత అన్నది ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. మన రాష్ట్రం నుంచి అమెరికాకు లోహాల ఎగుమతులు నామమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వివిధ దేశాలపై చెబుతున్న టారిఫ్ శాతాలపై కొంత గందరగోళం ఉంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. – నీరజ్ శర్దా, డిప్యూటీ ఎండీ, శర్ద మెటల్స్ అండ్ అల్లాయిస్
దెబ్బ మీద దెబ్బ
పలు దేశాల మధ్య యుద్ధాలు, రాజకీయ అనిశ్చితులతో టెక్స్‌టైల్ రంగం దెబ్బతింది. అమెరికా టారిఫ్‌ల పెంపుతో ఎగుమతులు పడిపోతాయి. భారత్‌తో పోలిస్తే ఇతర దేశాల్లో పత్తి ధర చాలా తక్కువ. ఇక్కడ పత్తిని కొని ఎగుమతులు చేయలేకపోతున్నాం. పోనీ.. దిగుమతి చేసుకుందామా అంటే భారత్ పత్తి దిగుమతులపై భారీగా సుంకాలను విధిస్తోంది. దీంతో టెక్స్‌టైల్ పరిశ్రమలు మూతపడే స్థితికి వస్తుంది. – లంకా రఘురామి రెడ్డి, గౌరవాధ్యక్షుడు, ఏపీ టెక్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్