సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం, హార్న్ ఆఫ్రికా దేశాలతోపాటు భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలు నేడు అనూహ్య సంఖ్యలో మిడతల దాడులను ఎదుర్కొంటున్నాయి. భారత్‌కన్నా ముందుగా మిడత దాడులను ఎదుర్కొన్న పాకిస్థాన్ వాటిని నిర్వీర్యం చేయడం కోసం మూడు లక్షల లీటర్ల క్రిమిసంహారక మందులను వాడడమే కాకుండా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో వాలిన మిడతలను కూలీల ద్వారా సేకరించి వాటిని కోడి దాణాగా మార్చి కోళ్ల ఫారమ్‌లకు పంపించింది. 45 శాతం ప్రొటీన్లు ఉండే సోయాబీన్ కిలో పాకిస్థాన్‌లో 90 రూపాయలు పలకుతుండగా, 70 శాతం ప్రొటీన్లు ఉండే మిడతలను కిలోకు 20 రూపాయలు చెల్లించి కూలీల ద్వారా సేకరించింది.
మిడతలను కోడి దాణాకా మార్చేందుకు కిలోకు 30 రూపాయలు ఖర్చు అవుతుందని, సేకరణ ఖర్చుతో కలిపితో కోళ్ల ఫారాలకు కిలోకు 50 లేదా 55 రూపాయల చొప్పున సరఫరా చేయవచ్చని పాక్‌లోని ఓక్రా జిల్లోలో ఈ ప్రయోగం నిర్వహించిన ‘పాకిస్థాన్ అగ్రికల్చరల్ రిసర్చ్ కౌన్సిల్‌కు చెందిన బయోటెక్నాలజిస్ట్ జోహర్ అలీ తెలిపారు. మిడతలను చంపేందుకు క్రిమి సంహారక మందులను వాడినట్లయితే వాతావరణ కాలుష్యం పెరగుతుందని, వాటిని తిన్నట్లయితే మనుషులకూ ప్రమాదమని, వాటిని సేకరించి కోడి దాణాగా ఉపయోగించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన మాటలతో ఏకీభవించిన పలువురు పర్యావరణ వేత్తలు భారత్ కూడా పాక్ అనుసరించిన కొత్త విధానాన్నే అనుసరించాలంటూ సూచనలు కూడా చేశారు.
వాస్తవానికి ఇది కొత్తగా కనిపిస్తోన్న పాత విధానం. గతంలో రైతులు వ్యవసాయ బావుల వద్ద కోళ్లను, బాతులను పెంచేవారు. అవి మిడతలను ఎక్కువగా తిని బలంగా తయారయ్యేవి. ప్రకృతిసిద్ధంగా పిచ్చుకలు, కాకులు కూడా మిడతలను ఎక్కువగా తింటాయి. పిచ్చుకలు కనిపించడమే కష్టంకాగా కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో పలు దేశాల ఆదిమ జాతులు కూడా మిడతలను తినేవి. ఇక్కడ క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో తాము ప్రయోగం చేసినట్లు జోహర్ అలీ తెలిపారు. క్రిమిసంహారక మందులు వాడుతున్న పొలాల సంగతి ఏమిటి? వాటిపై మిడతల దాడిని ఎలా ఆపాలి? భారత్‌లో 80 శాతాకిపైగా క్రిమిసంహారక మందులతో వ్యవసాయం జరుగుతోంది. పంటలపై చల్లే క్రిమి సంహారక మందుల ప్రభావం మిడతలపై ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మందులు వాడని పొలాలపై మాత్రమే తాము ప్రయోగం చేసినట్లు అలీ చెప్పారు. (ఇవి అత్యంత వినాశకారి 'మిడతలు')
మిడతల కోసం భారత వ్యవసాయదారులు క్రిమిసంహారక మందుల వాడకాన్ని వదిలేయాలా? సేంద్రీయ వ్యవసాయం వైపు మల్లండంటూ పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా పెద్దగా ఫలితాలు రాలేదు. మిడతలను నిర్మూలించేందుకు సాధారణంగా ‘ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్, పైర్‌థ్రాయిడ్’ క్రిమిసంహారక మందులను వినియోగిస్తున్నారు. ఇవి అత్యంత విష పూరితమైనవి. వీటి ప్రభావం మిడతలపై చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని రుజువైంది. కనుక ఈ మందుల వల్ల చనిపోయిన మిడతలను మనుషులుగానీ పక్షులుగానీ తినకూడదు. తిన్నట్లయితే మనుషుల్లో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె చెడిపోయే అవకాశం, ఎముకలు పెలసవుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మనుషులెవరూ మిడతలను తినరాదంటూ అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మనుషులు లేదా జంతువులకు ఆహారంగా మిడతలు పనికి రావని దక్షిణ కొరియాలోని యాన్‌డాంగ్ నేషనల్ యూనివర్శిటీ, పోస్ట్ డాక్టోరల్ రిసర్చర్ జూస్ట్ వాన్ ఇట్టర్ బీక్ హెచ్చరిస్తున్నారు. (మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’)
Comments
Please login to add a commentAdd a comment