
కోళ్ల పరిశ్రమకు విద్యుత్ రాయితీ
* యూనిట్‌కు రూ. 2.20 ఇవ్వాలని టీ సర్కారు నిర్ణయం
* మార్గదర్శకాల తయారీలో పశుసంవర్థక శాఖ అధికారులు
* బడ్జెట్ సమావేశాల అనంతరం జీవో జారీ
* 8,250 పరిశ్రమలకు ప్రయోజనం
* ప్రభుత్వంపై నెలకు 4 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: కోళ్ల పరిశ్రమకు యూనిట్‌కు రూ.2.20 విద్యుత్ రాయితీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై శాసనసభ సమావేశాల అనంతరం జీవో వెలువడుతుందని ఉన్నతాధికార వర్గాలు చెప్పాయి. కోళ్ల పరిశ్రమకు విద్యుత్ రాయితీ ఇచ్చేందుకు పశుసంవర్థక శాఖ అధికారులు మార్గదర్శకాలు తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కోళ్ల పరిశ్రమ వ్యాపారులు విద్యుత్ చార్జీల కింద యూనిట్‌కు రూ.6.08 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.20 రాయితీ ఇస్తే వ్యాపారులు రూ.3.88 చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ప్రభుత్వంపై నెలకు రూ.4 కోట్ల భారం పడనుందని అధికారులు తెలిపారు.
జీవో జారీ అనంతరం నవంబర్ బిల్లు నుంచే ఈ రాయితీ వర్తింపజేస్తామని పశుసంవర్థకశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే రాయితీ సొమ్మును ఎలా ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. సబ్సిడీని ఆర్థికశాఖ నేరుగా సంబంధిత విద్యుత్ శాఖకు పంపిస్తుందా? లేక పశుసంవర్థక శాఖ పంపుతుందా అనేది స్పష్టత రాలేదని అంటున్నారు. బడ్జెట్లో మాత్రం కోళ్ల పరిశ్రమకు కేటాయించిన రూ.20 కోట్లను పశుసంవర్థక శాఖ పద్దులోనే చూపించారు.
6 వేల బాయిలర్, 2 వేల లేయర్ కోళ్ల పరిశ్రమలు
తెలంగాణలో 2 వేల లేయర్ కోళ్ల పరిశ్రమలున్నాయి. వాటిల్లో నాలుగున్నర కోట్ల గుడ్లు పెట్టే కోళ్లుంటాయి. అలాగే 6 వేల బాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. వీటిల్లో వెయ్యి నుంచి మొదలు 2 లక్షల కోళ్ల వరకు ఉండే ఫారాలున్నాయి. ఇంకా 250 బ్రీడర్ ఫారాలున్నాయి. మొత్తం 8,250 కోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. వీటి టర్నోవర్ రూ.12 వేల కోట్లు. రాష్ట్రంలో పండించే మొక్కజొన్న ఉత్పత్తిలో 70 శాతం (21 లక్షల టన్నులు) ఈ పరిశ్రమకే సరఫరా చేస్తారు. 6 లక్షల టన్నుల సోయా చెక్కను ఈ పరిశ్రమే వినియోగిస్తుంటుంది.
ఇంత భారీ పరిశ్రమ కావడంతో ప్రభుత్వం వ్యవసాయ హోదా ఇస్తానని ప్రకటించింది. విద్యుత్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం పట్ల ఆ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం కోళ్ల పరిశ్రమకు రాయితీపై నోరు మెదపలేదు. తాము ఆ రాష్ట్రాన్ని కూడా విద్యుత్ రాయితీ కోరినట్లు జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావార్ చెప్పారు.