
గిరిరాజ కోళ్లు పెంచుతున్న గ్రామస్తుడు
ఉత్తర కర్ణాటకలోని ఒక గ్రామం ఇప్పుడు పల్లె విజయాలకు ప్రతీకగా నిలుస్తోంది. వ్యవసాయంలో నష్టాలు మూటగట్టుకుని దిగాలుగా ఉన్న పల్లెలో ఒక కోడి కొత్త వెలుగులు నింపింది. గిరిరాజ కోళ్ల పెంపకంతో వందల కుటుంబాలు ఉపాధి పొందడం విశేషం. ఒకరితో ఆరంభమైన ఈ విజయం గ్రామం తలరాతను మార్చేసింది.
దొడ్డబళ్లాపురం: ధార్వాడ జిల్లాలోని ఆ గ్రామంలో గ్రామస్తులు చాలా ఏళ్ల నుండి బాయిలర్ కోళ్ల పెంపకంతోనే జీవితం నెట్టుకొస్తున్నారు. చాలామంది తమ పొలాల వద్ద వ్యవసాయంతో పాటు కోళ్లఫారాలు నిర్మించుకుని బాయిలర్ కోళ్లు పెంచుతూ ఆదాయం గడిస్తున్నారు. వారికి వ్యవసాయం కన్నా కోళ్ల పెంపకంతోనే ఆదాయం ఎక్కువట.
అబ్దుల్ ఆరంభించాడు
ధార్వాడ జిల్లా మిశ్రికోటి అనే గ్రామంలో ఇప్పుడు గిరిరాజ కోళ్లు, రాజశ్రీ కోళ్లు పెంపకందారుల పాలిట బంగారు గుడ్లు అంతటి లాభాలనిస్తున్నాయి. గ్రామవాసులు కోళ్ల పెంపకంతో లబ్ధి పొందడం వెనుక అబ్దుల్ అనే పౌల్ట్రీ రైతు కృషి ఉంది. అబ్దుల్ సంవత్సరం క్రితం పశుపాలన శాఖ నిర్వహించిన సదస్సులో గిరిరాజ కోళ్ల పెంపకంపై శిక్షణ తీసుకున్నాడు. మొదట అనుమానంతోనే అబ్దుల్ 20 గిరిరాజ కోళ్లను కొని పెంచడం ప్రారంభించాడు. పెద్దగా జాగ్రత్తలు తీసుకోకుండానే అవి సులభంగా పెరిగి ఊహించినదాని కంటే ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టసాగాయి. దీంతో ఆయన మరో 50 కోడి పిల్లలను ఖరీదుచేసి పెంచసాగాడు. అప్పటి వరకూ కేవలం బాయ్లర్ కోళ్లను మాత్రమే చూసిన గ్రామస్తులు గిరిరాజ కోళ్ల ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు. వారు కూడా ఆ కోళ్లను లబ్దుల్ వద్దే ఖరీదు చేయడం ప్రారంభించారు. అబ్దుల్ ఇప్పుడు పెద్ద ప్రమాణంలో గిరిరాజ కోళ్లు పెంచేందుకుగాను పెద్ద ఫారం కూడా నిర్మించాడు. అతి తక్కువ కాలంలోనే గిరిరాజ కోళ్లు 10 – 15 కేజీల వరకూ బరువు పెరుగుతాయి.
ఎక్కువ మాంసం, గుడ్లు...ఎక్కువ లాభాలు
మాంసం, గుడ్లు రెండూ ధర ఎక్కువయినా జనం వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా వీటి పోషణ చాలా సులభం. పెద్దగా జాగ్రత్తలు పాటించకపోయినా నాటు కోళ్లకు మల్లే ఆహారాన్ని బయటే సేకరించి తింటాయి. 5 నెలల తరువాత ఇవి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి.ఒక విడతకు 100 నుండి 150 గుడ్లు పెడతాయి.అబ్దుల్ సమాచారం ప్రకారం 7 కేజీలు ఉండే పుంజు రూ.800లు పలుకుతుందట. గిరిరాజ జాతి పెట్ట కోడి 40 వారాలలో 3 నుండి 4 కేజీలు, పుంజు 4 నుండి 5 కేజీలు పెరుగుతుందట. వీటి గుడ్డు కూడా ఒక్కోటి 55 గ్రాముల బరువు ఉండి రూ.10 ధర పలుకుతుందట. అబ్దుల్ ప్రస్తుతం హైదరాబాద్ నుండి రాజశ్రీ అనే జాతి కోళ్ల నుకూడా వీటితో పాటు పెంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment