ప్రస్తుతం మనం పెంచుతున్న వివిధ రకాల కోళ్లన్నీ ఎర్ర అడవి కోడి జాతి నుంచి వచ్చినవేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ, పర్యావరణ మార్పులతోపాటు సంక్రమణతో ఎర్ర అడవి కోడి పలు ప్రాంతాల్లో రకరకాలుగా మార్పు చెందినట్టు తేల్చారు. వేల సంవత్సరాల క్రితమే ఈ జాతులన్నీ వేరుపడినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
సాక్షి, అమరావతి: మాంసాహారంలో ప్రధాన భాగంగా మారిన కోడికి 10 వేల సంవత్సరాల చరిత్ర ఉందనే విషయం తెలిసిందే. అయితే, ప్రపంచంలో కోళ్ల పెంపకం ఎక్కడ మొదలైందనే దానిపై కొన్ని వందల సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. తాజాగా వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన ఈ విషయమై ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. ప్రస్తుతం మనం పెంచుతున్న వివిధ రకాల కోళ్లన్నీ ఎర్ర అడవి కోడి జాతి నుంచి వచ్చినవేనని తాజా పరిశోధన స్పష్టం చేసింది. ఆగ్నేయ ఆసియా, దక్షిణాసియాలో ఉండే ఎర్ర అడవి కోళ్లు, వాటి ఉప జాతులు ఒక దానితో ఒకటి సంకరం చెంది ఇప్పుడున్న దశకు వచ్చాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న కోళ్లలో 80 శాతం వీటి నుంచే సంక్రమణ చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ ‘సెల్ రీసెర్చ్’ నేతృత్వంలో వివిధ దేశాల సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. మన దేశం నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ)కి చెందిన సైంటిస్టు ముఖేష్ ఠాకూర్ భాగం పంచుకున్నారు. 8 వేల నుంచి 10 వేల ఏళ్ల క్రితం చైనా,ఉత్తర థాయ్‌లాండ్, మయన్మార్‌లో కోళ్ల పెంపకం మొదలైనట్టు ఈ పరిశోధన వెల్లడించింది.
ప్రాంతాన్ని బట్టి జాతులు మారాయి
కోళ్ల పెంపకం మన ప్రాంతమైన సింధు లోయలో ప్రారంభమైనట్టు గతంలో జరిగిన అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. నిరంతరంగా జరిగే పరిశోధనల్లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు జరిగిన సెల్ రీసెర్చ్ సర్వే కూడా ఆసక్తికరమైంది. కానీ.. దీనిపై భిన్న వాదనలున్నాయి. కోళ్ల జాతులు ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల్ని బట్టి చాలా రకాలుగా మారిపోయాయి. కోళ్ల చరిత్ర చాలా సుదీర్ఘమైనది.
– డాక్టర్ కె.నాగరాజకుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పౌల్ట్రీ, ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల, గన్నవరం
864 రకాల జన్యువుల్ని విశ్లేషించి..
► పరిశోధనలో భాగంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెంపకంలో ఉన్న కోడి జాతుల్లోని 864 రకాల జన్యువులను విశ్లేషించారు.
► సాంకేతిక పరిభాషలో ‘గినస్ గల్లస్’గా పిలిచే ఎర్ర అడవి కోడి, దానికి చెందిన ఐదు ఉప జాతులు, వివిధ దేశాల్లో పెంచుతున్న మరికొన్ని కోళ్ల జాతుల మైటోకాండ్రియల్ డీఎన్‌ఏలను విశ్లేషించారు.
► గతంలో ఇదే అంశంపై పరిశోధనకు వినియోగించిన 79 కోళ్ల జాతుల డీఎన్‌ఏలు కూడా ఇందులో ఉన్నాయి.
గత పరిశోధనలకు భిన్నంగా..
► తాజా పరిశోధన గత పరిశోధనలకు భిన్నంగా ఉండటంతో దానిపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది.
► మొదట ఉత్తర చైనా, సింధు లోయ (ఇండస్ వ్యాలీ) ప్రాంతంలో కోళ్ల పెంపకం మొదలైనట్టు గత పరిశోధనలు తేల్చాయి.
► చార్లెస్ డార్విన్ సైతం కోళ్ల పెంపకం ఇండస్ వ్యాలీలో ఎర్ర అడవి కోళ్లతో మొదలైందని ప్రతిపాదించారు.
► కానీ సెల్ రీసెర్చ్ పరిశోధన దీనికి వ్యతిరేకంగా ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
► కోళ్ల పెంపకంపై శాస్త్రవేత్తల్లో చాలా శతాబ్దాల నుంచి ఆసక్తి ఉందని జెడ్‌ఎస్‌ఐ సైంటిస్ట్ ముఖేష్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు.
► తాజా పరిశోధన కోళ్ల పెంపకం చరిత్రకు సంబంధించిన కీలక అంశాలను కనుగొందని, ఈ సమాచారం భవిష్యత్ పరిశోధనలకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎర్ర అడవి కోడి జాతి నుంచి..
భౌగోళిక పరిస్థితులు, వాతావరణ, పర్యావరణ మార్పులతోపాటు సంక్రమణతో ఎర్ర అడవి కోడి వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా మార్పు చెందినట్టు తేల్చారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ జాతులన్నీ వేరుపడినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆగ్నేయ ఆసియా అడవుల్లో ఈ కోళ్లు పైకి ఎగిరి పోట్లాడుకోవడాన్ని చూసిన మానవులు వాటిని మచ్చిక చేసుకున్నారని భావిస్తున్నారు. ఆ తర్వాత వాటిని పెంచుకోవడం, వాటి మాంసం, గుడ్లను ఆహారంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు అదే ప్రధాన ఆహారంలో ఒకటైంది.
Comments
Please login to add a commentAdd a comment