
కోళ్ల పరిశ్రమ రుణాల రీషెడ్యూల్!
బ్యాంకర్లతో సర్కారు సమాలోచనలు
బర్డ్‌ఫ్లూతో చితికిపోయిన పౌల్ట్రీ రైతులు
రూ.2,000 కోట్ల రుణభారం.. రీషెడ్యూలుకు విజ్ఞప్తి
హైదరాబాద్: బర్డ్‌ఫ్లూతో కుదేలైన కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యాసాధ్యాలపై బ్యాంకర్లతో సంప్రదింపులు ప్రారంభించింది. తెలంగాణలో ఉన్న కోళ్ల పరిశ్రమలపై దాదాపు రూ. 2,000 కోట్ల బ్యాంకు రుణాలున్నాయి. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో వీటిని తిరిగి చెల్లించ డం గుదిబండగా మారిందని పౌల్ట్రీ రైతులు తల్లడిల్లుతున్నారు. నష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమాలోచనలు జరిపారు. పౌల్ట్రీ రంగ ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు, గుడ్లు, చికెన్ ధర పడిపోయిందని.. ఒక్కసారిగా అమ్మకాలు పడిపోవటంతో అపార నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడేళ్లుగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలోనే ఉంది. రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది రైతులు పౌల్ట్రీని నమ్ముకున్నారు. వీరిలో ఎనభై శాతం మంది రైతులు వరుస నష్టాలతో చితికిపోయారు.
ఇటీవలి బర్డ్ ఫ్లూ దెబ్బకు చిన్న రైతులు మరింత విలవిలలాడిపోయారు.. కొత్త రుణాలు అందించి కుదేలైన పరిశ్రమకు చేయూతను అందించాలి’అని పౌల్ట్రీ ప్రతినిధులు బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తీసుకున్న బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేనందున.. పాత రుణాలను రీషెడ్యూలు చేయటంతో పాటు కొత్త రుణాలు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఆర్థిక మంత్రి సాధ్యాసాధ్యాలపై బ్యాంకర్లతో చర్చించారు. 2008లో పశ్చి మ బెంగాల్‌లో బర్డ్ ఫ్లూ సోకినప్పుడు అక్కడి పౌల్ట్రీ రుణాలను రీషెడ్యూలు చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఒక ఏడాది పాటు మారటోరియం విధించటంతో పాటు తదుపరి మూడేళ్లు రుణాలను చెల్లించేం దుకు వెసులుబాటు కల్పించిం ది. కొత్త రుణాల మంజూరీకి అనుమతించింది. రాష్ట్రంలోనూ కోళ్ల పరిశ్రమ విపత్కర పరిస్థితుల్లో ఉన్నందున అదే తీరుగా రుణ భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు.