రైతుకు నష్టం.. వినియోగదార్లకు భారం
వ్యాపారుల ఇష్టారాజ్యం
మార్కెట్లో చికెన్, గుడ్ల పరిస్థితి
పట్టించుకోని యంత్రాంగం
విశాఖపట్నం:ఎక్కడైనా డిమాండ్ తగ్గినా, ఉత్పత్తి పెరిగినా సరకు ధర తగ్గుతుంది.దీంతో వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుతుంది. కానీ పౌల్ట్రీ పరిశ్రమలో మాత్రం ఈ సూత్రం వర్తించడం లేదు. ధర ఎగబాకితే వ్యాపారులు వినియోగదారుడిపై వెనువెంటనే పెంచేస్తున్నారు. రేటు పడిపోతే నామమాత్రంగా తగ్గిస్తున్నారు. ఫలితంగా వ్యాపారికే తప్ప అటు రైతుకు, ఇటు వినియోగదారుడికి మేలు జరగడం లేదు. కొన్నాళ్లుగా జిల్లాలో ఇదే జరుగుతోంది. వేసవి సీజన్ జూన్, జులై నెలల్లో కోళ్ల పరిశ్రమ ఒకింత లాభదాయకంగా నడిచింది. ఆగస్టు నుంచి సంక్షోభంలో పడింది. రైతులు, ఇంటిగ్రేటెడ్ కంపెనీలు కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ కంపెనీల రాకతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా వాటి ధర కూడా తగ్గుముఖం పట్టింది.
అయితే ధరలు తగ్గినప్పుడు రైతులు, ఇంటిగ్రేటెడ్ కంపెనీల నుంచి తక్కువ ధర కే కొనుగోళ్లు జరిపే వ్యాపారులు ఆ మేరకు వినియోగదార్లకు తగ్గించి అమ్మడం లేదు. ఏదో నామమాత్రపు తగ్గింపుతో అమ్మకాలు సాగిస్తున్నారు. వాస్తవానికి నెల రోజుల నుంచి ఫారం రేటు (రైతు ధర) కిలో రూ.45-52లు, స్కిన్‌తో రూ.100 నుంచి 110లు, స్కిన్‌లెస్ 118-128ల వరకు ఉంది. కానీ చాలాచోట్ల చికెన్ వ్యాపారులు స్కిన్, స్కిన్‌లెస్ ధరలపై రూ.20లకు పైగా పెంచి విక్రయిస్తున్నారు. దీనివల్ల వినియోగదారునికి అదనపు భారమవుతోంది. ఇప్పటికే కోళ్ల రైతులు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఫారం ధర కనీసం రూ.65లకు పైగా ఉంటేనే వారు నష్టాల నుంచి బయటపడతారు. కానీ కిలోకు సరాసరి రూ.15ల వరకు నష్టాన్ని భరించాల్సి వస్తోంది. ఇందులో సగం మొత్తాన్ని పెంచినా రైతు కోలుకునే అవకాశం ఉంటుంది. లేదా యాజమాన్యాలు నిర్ణయించిన ధరకే విక్రయిస్తే వినియోగదారునికి ఊరట లభిస్తుంది. ఇప్పుడు ఆ రెండూ అమలు చేసేవారు లేరు. చికెన్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి నిర్ధిష్ట ధరలకే చికెన్ విక్రయాలు జరిగేలా ప్రయత్నిస్తున్నామని బ్రాయిలర్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ విశాఖ (బ్యాగ్) అధ్యక్షుడు ఆదినారాయణ ‘సాక్షి’కి చెప్పారు.
కోడిగుడ్లదీ అదే దారి..
మరోవైపు కోడిగుడ్లదీ అదే పరిస్థితి. కోళ్ల దాణా ధర విపరీతంగా పెరగడంతో కొన్నాళ్లుగా కోడిగుడ్ల పరిశ్రమ కూడా పల్టీలు కొడుతోంది. ఒక్కో గుడ్డుకు సగటున రూ.3.30ల నుంచి 3.50ల వరకు ఉత్పత్తి వ్యయం అవుతోంది. కానీ రైతు ధర మాత్రం రూ.3లకు మించడం లేదు. గతంలో రూ.16-17లున్న కిలో దాణా ధర ఏడాదిగా రూ.22లు ఉంది. కోడికి ఒక గుడ్డు పెట్టడానికి 150 గ్రాముల దాణా అవసరం. ఈ లెక్కన రూ.3లు దాణాకు, మిగిలింది ఇతరత్రా ఖర్చవుతోందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) జాతీయ కార్యవర్గ సభ్యుడు భరణికాన రామారావు ‘సాక్షి’కి తెలిపారు. కాగా రైతు నుంచి వ్యాపారులు రూ.3ల లోపే కొనుగోలు చేసి రిటైల్ మార్కెట్లో రూ.4ల వరకు అమ్మకాలు చేస్తున్నారు. అంటే రైతుకు గుడ్డు దగ్గర 50 పైసలు నష్టం వస్తుంటే, వ్యాపారికి రూపాయి లాభం చేకూరుతోంది. కానీ గుడ్డు ధర పతనమైనా వినియోగదారునికి మాత్రం ప్రయోజనం ఏమీ ఉండడం లేదు. ఇలా ఇటు చికెన్, అటు కోడిగుడ్ల ధరలు పతనమవుతున్నప్పుడు అటు రైతు నష్టపోతుండగా, ఇటు వినియోగదారునికి ఏమంత ఊరట దక్కడం లేదు.
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి!
Published Wed, Oct 21 2015 3:30 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement