కోళ్ల పరిశ్రమకు రాయితీ కావాలి: ఎన్‌ఈసీసీ
హైదరాబాద్: కోళ్ల పరిశ్రమ తీవ్ర గడ్డు స్థితిలో ఉందని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (నెక్) ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రుణాలు, వడ్డీ పునః చెల్లింపులపై ఏడాది పాటు మారటోరియం విధించాలని ప్రభుత్వానికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. కనీసం 6 శాతం వడ్డీ సబ్‌వెర్షన్ మూడేళ్ల పాటు అమలు చేయాలని కోరింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో అదనపు వర్కింగ్ కేపిటల్ రుణాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఎగుమతులు, స్పెక్యులేషన్, కనీస మద్దతు ధరల పెంపు వంటి పలు కారణాల వల్ల గడచిన నాలుగేళ్లుగా మొక్కజొన్న, సొయా వంటి కోళ్ల దాణా వ్యయం భారీగా పెరిగిందని పేర్కొంది. ఆయా కారణాల వల్ల గత ఏడాది రూ.2.60 ఉన్న గుడ్డురేటు ప్రస్తుతం రూ.3.50 స్థాయికి పెరిగిందని వివరించింది. అయితే సగటున ఫామ్‌గేట్ రేటు గుడ్డుకు రూ.3.00 నుంచి రూ.3.25 వరకూ పడుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో గుడ్డుకు రైతుకు 50 పైసల నష్టం వస్తోందని తెలిపింది. అలాగే బ్రాయిలర్స్ (లైవ్ వెయిట్) విషయంలోనూ నికరంగా రూ.10 నష్టం వస్తున్నట్లు పేర్కొంది.