సాక్షి, అమరావతి/భీమవరం/అమలాపురం: భోగి రోజైన ఆదివారం పందెం కోళ్లు జూలు విదిల్చాయి. బరిలోకి దూకి కత్తులు దూశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోడి పందేలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లో భారీఎత్తున పందేలు జరిగాయి. పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, నిడమర్రు, దెందులూరు మండలాలు, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందేలు సందడిగా సాగాయి. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల కోడిపందేలు జోరుగా సాగాయి.
కొన్నిచోట్ల బరులకు ప్రత్యేకంగా ఫెన్సింగ్ కూడా వేశారు. పెద్దాపురం, కరప తదితర మండలాల్లో కోడిపందేలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, కడియం, మండపేట తదితర ప్రాంతాలతోపాటు నల్లజర్ల, నిడదవోలు, పెరవలి, తాళ్లపూడి తదితర మండలాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహించారు. వరి చేలు, కొబ్బరి తోటలు, మైదాన ప్రాంతాల్లో భారీ బరులు ఏర్పాటు చేశారు. బెట్టింగ్ స్థాయిని బట్టి బరులు ఏర్పాటు చేశారు. పందేలకు వచ్చే వారికి వీవీఐపీ, వీఐపీ, సామాన్యుల కోసం ప్రత్యేక గ్యాలరీలు నెలకొల్పారు.
బరులను ఆనుకుని ప్రత్యేకంగా సిట్టింగ్ (బెంచీలు, కుర్చిలు) ఏర్పాటు చేశారు. బరుల చుట్టూ ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్లు పెట్టారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు మోస్తరుగా కొనసాగాయి. అన్నిచోట్లా పందేల బరులకు ఆనుకుని గుండాట, పేకాట, కోసు ఆటలు నిర్వహించారు. పందేలకు వచి్చన వారి కోసం బిర్యానీ, మాంసం పకోడి, కూల్‌డ్రింక్స్, సిగరెట్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో జాతరను తలపించింది. గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడి పందేలను తిలకించేందుకు, పందేలు వేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు పయనమవడంతో హైదరాబాద్, విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ కని్పంచింది. పందేలకు వచి్చన వారితో గోదావరి జిల్లాల్లోని లాడ్జిలు, అతిథి గృహాలు సైతం నిండిపోయాయి.
ట్యాగ్‌లు ఉంటేనే అనుమతి
పశి్చమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని పెదఅమిరం, సీసలి గ్రామాల్లో కోడి పందేలు వీక్షించడానికి ఎల్‌ఈడీ డిస్‌ప్లేను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించడానికి వచ్చే వారి చేతులకు ట్యాగ్‌లు వేశారు. బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేసి ట్యాగ్‌లు ఉన్నవారిని మాత్రమే బరుల్లోకి ప్రవేశించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం కలగంపూడి, కాపవరం, పూలపల్లి, పాలకొల్లు మండలం, నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం, ఆచంట నియోజకవర్గంలోని కవిటం, తణుకు నియోజకవర్గం అత్తిలి, వేల్పూరు, తేతలి గ్రామాల్లోనూ భారీ స్థాయిలో పందేలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోనూ భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నికల ఏడాది కావడంతో వివిధ పారీ్టల నేతలు బరులకు వెళ్లి నిర్వాహకులను, పందేల రాయుళ్లను పలకరించారు. అక్కడే కొంత సమయం గడిపి స్థానికులతో మమేకమై ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి హైదరాబాద్ నుంచి రాజకీయ నేతల రాక పెద్దగా కనిపించలేదు.
బుసకొట్టిన ‘కట్టల’ పాములు
కోడి పందేలతో పాటు పేకాట, గుండాట వంటి జూద క్రీడల శిబిరాలు కూడా భారీగానే వెలిశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 200 బరుల్లో పందేలు నిర్వహించగా సుమారు రూ.150 కోట్ల వరకు చేతులు మారినట్టు అంచనా. కోనసీమ జిల్లాలోనూ నోట్ల కట్టలు బుసలు కొట్టినట్టుగా చేతులు మారాయి. కోడి పందేలు నిర్వహించే పెద్ద బరుల వద్ద సొమ్ములు లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేయడం విశేషం. కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి మండలం మిలట్రీపేట, మండవల్లి మండలం భైరవపట్నం శిబిరాల వద్ద ఎక్కువ పందేలు గెలిచిన వారికి బుల్లెట్లను బహుమతిగా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జూదాలు విపరీతంగా పెరిగాయి. అక్కడ కూడా రూ.కోట్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment