Environmentalists worry
-
A23a: అతి పెద్ద ఐస్‌బర్గ్... 40 ఏళ్ల తర్వాత కదిలింది
అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌బర్గ్. పేరు ఏ23ఏ. విస్తీర్ణం ఏకంగా 4,000 చదరపు కిలోమీటర్లు. మరోలా చెప్పాలంటే పరిమాణంలో గ్రేటర్ లండన్‌తో పోలిస్తే రెండింతలకు పై చిలుకే. అంతటి విస్తీర్ణంతో, ఏకంగా 400 మీటర్ల మందంతో భారీ సైజుతో అలరారుతూ చూసేందుకది ఓ మంచు ద్వీపకల్పంలా కని్పంచేది. అలాంటి ఐస్‌బర్గ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కదలడం మొదలు పెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆందోళన పరుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలకు దీన్ని తాజా సంకేతంగా వారు భావిస్తున్నారు... 1986 నుంచీ... ఏ23ఏ ఐస్‌బర్గ్ అప్పుడెప్పుడో 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. అంటార్కటికా తాలూకు అతి పెద్దదైన ఫిల్‡్షనర్ మంచు ఫలకం నుంచి విడిపోయిన భారీ ఐస్బర్గ్ల్లోకెల్లా పెద్దదిగా ఇది రికార్డులకెక్కింది. అప్పటికే ఏ23ఏపై సోవియట్ యూనియన్ ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంది! అందులోని సామగ్రినంతటినీ అది హుటాహుటిన తరలించడం మొదలు పెట్టింది. కానీ కొద్దిపాటి ప్రయాణం అనంతరం 1986కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్ సముద్రంలో ఐస్‌బర్గ్ నిశ్చలంగా నిలిచిపోయింది. ఒకరకంగా సముద్రం తాలూకు అడుగు భాగంతో కలిసిపోయి అలా నిలబడిపోయింది. కరిగిపోతోంది... ఇంతకాలం నిశ్చలంగా ఉన్నది కాస్తా ఏ23ఏ ఇప్పుడు మరోసారి కదులుతోంది. దీనికి కారణాలపై సైంటిస్టులంతా దృష్టి సారించగా, ఇది అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న ఫలితమేనని తేలింది! ‘‘దాదాపు 40 ఏళ్ల కాలగమనంలో ఐస్‌బర్గ్ పరిమాణంలో కుంచించుకుపోయింది. దానికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది’’ బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే రిమోట్ సెన్సింగ్ నిపుణుడు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. వాస్తవానికి ఏ23ఏలో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సముద్ర పవనాల హోరు, ప్రవాహాల జోరుకు అదిప్పుడు వేగం పుంజుకుందన్నారు. ఇప్పుడది క్రమంగా అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తరాగ్రంకేసి కదులుతోంది. చివరికది ఐస్‌బర్గ్‌ల క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరేలా కని్పస్తోంది. ప్రమాద ఘంటికే...! ఎంత పెద్ద ఐస్‌బర్గ్‌లైనా కాలక్రమంలో చిక్కిపోవడం, క్రమంగా కనుమరుగవడం పరిపాటే. కానీ అందుకు వందలు, కొన్నిసార్లు వేలాది ఏళ్లు కూడా పడుతుంటుంది. అలాంటి ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఏ23ఏ ఐస్‌బర్గ్ ఇలా శరవేగంగా కరుగుతుండటం, కదిలిపోతుండటం ప్రమాద సూచికేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది దక్షిణ జార్జియాకేసి సాగితే అక్కడి జీవావరణానికి పెద్ద సమస్యగా కూడా మారవచ్చని చెబుతున్నారు. దాని నుంచి కరిగే నీటితో పెరిగిపోయే సముద్ర మట్టం ఆ ద్వీపకల్ప తీరంలో లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షుల పునరుత్పత్తి ప్రాంతాలను ముంచెత్తవచ్చన్నది వారి ఆందోళన. అయితే ఈ పరిణామంతో కొన్ని లాభాలూ లేకపోలేదట! ‘‘ఐస్‌బర్గ్‌లు జీవనప్రదాలు కూడా. కరిగే క్రమంలో వాటినుంచి విడుదలయ్యే ఖనిజ ధూళి సమీప సముద్ర జీవజాలానికి ప్రాణాధారంగా మారుతుంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లాస్టిక్ ప్రళయం
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్లాస్టిక్ మింగేస్తోంది. సముద్ర జీవులు, అడవి జంతువులను హరించడంతో పాటు మానవుల ఆహారంలోకి చొరబడుతోంది. గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం 1950లో రెండు మిలియన్ టన్నులు ఉండగా.. తాజా వినియోగం 391 మిలియన్ టన్నులను దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి చిన్న పనిలోనూ ప్లాస్టిక్‌పై ఆధారపడటంతో వీటి వినియోగం క్రమేపీ ఎక్కువైంది. ఇది 2040 నాటికి రెట్టింపు అవుతుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. పండ్లలోనూ ప్లాస్టిక్ భూతమే మానవులు తరచూ తినే పండ్లు, కూరగాయలను కూడా ప్లాస్టిక్ వదలడం లేదు. తాజాగా ఇటలీలోని కాటానియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్యారెట్, పాలకూర, యాపిల్స్, బేరి పండ్లలో చిన్నచిన్న ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు. యాపిల్స్‌లో అత్యధికంగా సగటున గ్రాముకు 1.95 లక్షలు, బేరిలో 1.89 లక్షలు, క్యారెట్, బ్రొకోలీలో లక్ష వరకు అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. ప్లాస్టిక్ కలుషిత నీరు, భూమి ద్వారా ఆహార ఉత్పత్తుల్లోకి చేరుతున్నట్టు పేర్కొన్నారు. తాబేలు పొట్టలోనూ చేరుతోంది గతంలో సముద్ర తీరాల్లో అకారణంగా తాబేళ్లు మృత్యువాత పడుతుండటంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అరచేతిలో ఒదిగిపోయే చిన్న తాబేలు పొట్టలో దాదాపు 140 మైక్రో ప్లాస్టిక్ ముక్కలను కనుగొన్నారు. ప్రస్తుతం ఏటా 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతుండగా.. ఇది వచ్చే 20 ఏళ్లల్లోపే మూడు రెట్లు పెరగనుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 800కి పైగా సముద్ర, తీర ప్రాంత జాతులను ఆహారంగా తీసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు, వారి రక్తంలో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. ముఖ్యంగా ప్రపంచంలో 1,557 సముద్ర జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం జీవులు ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకుంటున్నాయని తేలింది. గజరాజుల పాలిట ప్లాస్టిక్ పాశం గతేడాది భారత దేశంలోని పెరియార్ అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల అడవి ఏనుగు మృతి చెందింది. ప్రతి శీతాకాలంలో శబరిమలకు అడవుల ద్వారా కాలినడకన వెళ్లే లక్షలాది మంది భక్తులు విచ్చలవిడగా పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో పేగుల్లో అంతర్గత రక్తస్రావం, అవయవాలు విఫలమై అది చనిపోయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్క ఏనుగులే కాదు అతి శక్తివంతమైన వేటాడే జీవులైన హైనాలు, పులులతో పాటు జీబ్రాలు, ఒంటెలు, పశువులతో సహా భూ ఆధారిత క్షీరదాలు ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృత్యువాత పడుతున్నాయి. భూసారానికి పెనుముప్పు ప్లాస్టిక్‌లోని మైక్రో ప్లాస్టిక్స్ భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమికి మేలు చేసే మిత్ర పురుగులు, లార్వాలు, అనేక కీటకాల క్షీణతలకు దారి తీస్తోంది. ప్లాస్టిక్ ఫుడ్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ గొట్టాలు, బయోవ్యర్థాలు హానికరమైన రసాయనాలను మట్టిలోకి విడుదల చేస్తాయి. అవి భూగర్భ జలాల్లోకి ప్రవేశించి నీటిని సైతం కలుషితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం, ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌పై అనేక స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా 77 దేశాలు పాస్టిక్‌పై శాశ్వత, పాక్షిక నిషేధాన్ని విధించాయి. -
2023 హాటెస్ట్ వేసవి
2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... 2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్ వారి్మంగ్‌కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులి మీద పుట్రలా... ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి... ► ఇటు అమెరికా నుంచి అటు జపాన్ దాకా, యూరప్ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి. ► ఇటలీ, గ్రీస్ తో పాటు పలు మధ్య యూరప్ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి. ► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది. ఇవీ రికార్డులు... ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్ ఎక్కువగా నమోదయ్యాయి. ► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా తేలాయి! మేలుకోకుంటే అంతే... గ్రీన్ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్ జోష్ విల్లిస్ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు. ఎలా నమోదు చేస్తారు? నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్ టెంప్ అని పిలుస్తారు. ► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు. ► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు. ‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’ – బిల్ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం. – జోష్ విల్లిస్, క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
మళ్లీ కాలుష్య మేఘాలు
న్యూఢిల్లీ: ఢిల్లీని మరోమారు కాలుష్య మేఘాలు కమ్మేశాయి. ఆదివారం ఉదయం కాలుష్య తీవ్రత రికార్డు స్థాయిని దాటి నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వాయు నాణ్యత అత్యంత ప్రమాదకరంగా ఉందని, దీనిని పీల్చడం ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా మంచిది కాదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ను పర్యవేక్షించే సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లో ఆదివారం ఉదయం ఓ గంటలోనే వాయు నాణ్యత తీవ్రత ప్రమాదకర స్థాయిని మించిపోయినట్టు తేలింది. ఈ గ్రాఫ్‌లో ఒక క్యూబిక్ మీటర్‌కు పీఎం2.5.. 478 మైక్రోగ్రాములుగా, పీఎం10.. 713 మైక్రోగ్రాములుగా నమోదైంది. చాలా ప్రాంతాల్లో దగ్గరలోని వాహనాలు కూడా కనిపించనంతగా విజిబులిటీ స్థాయి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కోరు 460గా నమోదైంది. శనివారం ఇది 403గా ఉంది. సీపీసీబీ ఎయిర్ బులెటిన్ ప్రకారం పీఎం2.5 తీవ్రత ప్రమాదకరంగా ఉందని తేలింది. దీంతో కళ్లు విపరీతంగా మండటంతో పాటు ఊపిరి తీసుకోవడానికి కూడా ఢిల్లీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పీఎం2.5, పీఎం10 మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో నమోదైతే.. ఢిల్లీలో మరోసారి సరి–బేసి విధానం అమలు చేయాల్సి రావొచ్చని వాతావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ నేతృత్వంలోని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ) పేర్కొంది. 48 గంటల వ్యవధిలో పీఎం10 స్థాయి ఒక క్యూబిక్ మీటర్‌కు 500 మైక్రోగ్రాములకంటే దాటినా.. పీఎం2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 300 మైక్రోగ్రాములకంటే దాటినా సరి–బేసి విధానాన్ని అమలులోకి తీసుకురావొచ్చని శనివారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితికి దుమ్ము, ధూళి, పొగ మంచు మిళితం కావడమే కారణమని డీపీసీబీ చీఫ్ దీపాంకర్ సాహా పేర్కొన్నారు. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం.. పొగ మంచుతో కూడిన దట్టమైన మేఘాలు కమ్మేయడం కూడా దీనికి కారణమని వెల్లడించారు. -
గుడ్లు పెట్టబోతే గొడ్డలిపెట్టు
* సాగరతీరంలో పెరుగుతున్న ప్రతికూల పరిస్థితులు * తాబేళ్లకు ప్రాణాంతకమవుతున్న పునరుత్పత్తి తరుణం పిఠాపురం: మనిషి మినహా ప్రతి జీవీ ప్రకృతి నిర్దేశాన్ని తు.చ. తప్పక పాటిస్తుంది. సముద్రపు తాబేళ్లదీ అలాంటి క్రమశిక్షణే. అయితే.. పాపం, అదే వాటి పాలిట మరణదండనగా మారుతోంది. ఏటా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ సముద్రపు తాబేళ్లకు జాతి పునరుత్పత్తి రుతువు. ఇప్పుడు వాటికి గుడ్లు పెట్టే కాలమే గొడ్డలిపెట్టుగా మారింది. ఏటా గుడ్లు పెట్టే తరుణంలో కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద సాగరతీరానికి వేలాది తాబేళ్లు వస్తుంటాయి. రాత్రి సమయాల్లో తీరానికి చేరుకుని గోతులు తవ్వి, గుడ్లు పెట్టి, పొదిగి, మళ్లీ ఆగోతులను ఇసుకతో పూడ్చి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. అనంతరం ఆ గుడ్లు పిల్లలుగా తయారయ్యి వాటంతటవే సముద్రంలోకి వెళుతుంటాయి. అయితే ఈ క్రమంలో తీరంలో పెట్టిన గుడ్లలో కొన్ని నక్కలు, కుక్కలు తినేస్తున్నాయి. గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చిన తాబేళ్లలో కొన్ని మత్స్యకారులు తీరం వెంబడి సాగించే అలివి వలలకు చిక్కి చనిపోతుండగా, మరికొన్ని ఇతర జంతువుల దాడిలో మృత్యువాత పడుతున్నాయి. కాగా ఇప్పుడు వాటికి మరింత దురవస్థ దాపురించింది. అసలు గుడ్లు పెట్టడానికి తీరంలో ఇసుక తిన్నెలే కరువయ్యాయి. ఇక్కడ తీరంలో ఎక్కడ చూసినా సముద్ర కోతకు రక్షణగా వేసిన రాళ్లు మాత్రమే ఉన్నాయి. సంతానోత్పత్తి కోసం వచ్చిన తాబేళ్లు అలల తాకిడికి ఈ రాళ్లకు కొట్టుకుని మృత్యువాత పడుతున్నాయి. ఆ గండాన్ని గడిచి, ఉన్న కొద్దిపాటి ఇసుక తిన్నెల వద్దకు వస్తే ఇతర జంతువులు చంపేస్తున్నాయి. ఈ పరిణామంతో సముద్ర తాబేళ్ల సంతానోత్పత్తి పూర్తిగా దెబ్బతిని భవిష్యత్తులో వాటి సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని, అది పర్యావరణంపై దుష్ర్పభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ముప్పును గుర్తించి, మత్స్యకారుల్లో అవగాహన కల్పించడంతో పాటు తీరంలో తాబేళ్ల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.