మళ్లీ కాలుష్య మేఘాలు | Delhi's pollution levels rise again | Sakshi
Sakshi News home page

మళ్లీ కాలుష్య మేఘాలు

Published Mon, Nov 13 2017 4:04 AM | Last Updated on Mon, Nov 13 2017 4:04 AM

Delhi's pollution levels rise again  - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీని మరోమారు కాలుష్య మేఘాలు కమ్మేశాయి. ఆదివారం ఉదయం కాలుష్య తీవ్రత రికార్డు స్థాయిని దాటి నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వాయు నాణ్యత అత్యంత ప్రమాదకరంగా ఉందని, దీనిని పీల్చడం ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా మంచిది కాదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ను పర్యవేక్షించే సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఆదివారం ఉదయం ఓ గంటలోనే వాయు నాణ్యత తీవ్రత ప్రమాదకర స్థాయిని మించిపోయినట్టు తేలింది. ఈ గ్రాఫ్‌లో ఒక క్యూబిక్‌ మీటర్‌కు పీఎం2.5.. 478 మైక్రోగ్రాములుగా, పీఎం10.. 713 మైక్రోగ్రాములుగా నమోదైంది. చాలా ప్రాంతాల్లో దగ్గరలోని వాహనాలు కూడా కనిపించనంతగా విజిబులిటీ స్థాయి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ స్కోరు 460గా నమోదైంది.

శనివారం ఇది 403గా ఉంది. సీపీసీబీ ఎయిర్‌ బులెటిన్‌ ప్రకారం పీఎం2.5 తీవ్రత ప్రమాదకరంగా ఉందని తేలింది. దీంతో కళ్లు విపరీతంగా మండటంతో పాటు ఊపిరి తీసుకోవడానికి కూడా ఢిల్లీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పీఎం2.5, పీఎం10 మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో నమోదైతే.. ఢిల్లీలో మరోసారి సరి–బేసి విధానం అమలు చేయాల్సి రావొచ్చని వాతావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ నేతృత్వంలోని గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌(జీఆర్‌ఏపీ) పేర్కొంది. 48 గంటల వ్యవధిలో పీఎం10 స్థాయి ఒక క్యూబిక్‌ మీటర్‌కు 500 మైక్రోగ్రాములకంటే దాటినా.. పీఎం2.5 స్థాయి క్యూబిక్‌ మీటర్‌కు 300 మైక్రోగ్రాములకంటే దాటినా సరి–బేసి విధానాన్ని అమలులోకి తీసుకురావొచ్చని శనివారం జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితికి దుమ్ము, ధూళి, పొగ మంచు మిళితం కావడమే కారణమని డీపీసీబీ చీఫ్‌ దీపాంకర్‌ సాహా పేర్కొన్నారు. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం.. పొగ మంచుతో కూడిన దట్టమైన మేఘాలు కమ్మేయడం కూడా దీనికి కారణమని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement