దక్షిణ ధ్రువంలో కల్లోలం | Trillion-tonne iceberg breaks off Antarctica, poses huge risk to ships | Sakshi
Sakshi News home page

దక్షిణ ధ్రువంలో కల్లోలం

Published Fri, Jul 14 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

దక్షిణ ధ్రువంలో కల్లోలం

దక్షిణ ధ్రువంలో కల్లోలం

ఈ భూగోళంపై ప్రకృతి రచించిన దృశ్య కావ్యం అంటార్కిటికా. అది ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశం మాత్రమే కాదు... నిత్యం వీచే పెనుగాలులతో, విరిగిపడే మంచు చరియలతో సందర్శకులను భీతావహుల్ని చేసే ప్రాంతం కూడా. రకరకాల పరిశోధనల్లో నిత్యం నిమగ్నమై ఉండే అయిదారువేల మంది శాస్త్రవేత్తలు తప్ప అక్కడ వేరే జనాభా ఉండదు. భూతల్లి చల్లగా నాలుగు కాలాలపాటు వర్ధిల్లాలంటే అంటార్కిటికాలో పెనుమార్పులు చోటుచేసుకోకుండా ఉండాలని పర్యావరణవాదులు చెబుతుంటారు. దాని పరిరక్షణకు ఏమేం చర్యలు అవసరమో వివరిస్తుంటారు.

కానీ ప్రకృతితో మనిషి ఆడుతున్న వికృత క్రీడల కారణంగా అంతా తారుమారవుతోంది. క్షణానికి వెయ్యి టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడు దలవుతూ భూమిని వేడెక్కిస్తున్న పర్యవసానంగా ఆ మంచు ఖండం ఛిద్రమ వుతోంది. నూరేళ్లక్రితం ఊహించ శక్యం కూడా కాని ఉత్పాతం మానవాళికి చేరు వవుతోంది. అంటార్కిటికాలో ఉన్న అతి పెద్ద మంచు ఫలకం ‘లార్సెన్‌–సి’ హిమ పర్వతం నుంచి వేరుపడిందని తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన పర్యావరణ వాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ వైపరీత్యం గత మూడురోజుల్లో ఏదో ఒక సమయంలో చోటు చేసుకుని ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు లక్ష టన్నుల కోట్ల బరువుండే ఈ ఫలకం న్యూఢిల్లీ నగర వైశాల్యంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెద్దదని లెక్కలు కడుతున్నారు. లార్సెన్‌–సి కి పగుళ్లు ఏర్పడుతున్న వైనాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా చాన్నాళ్లక్రితమే శాస్త్రవేత్తలు గమనిం చారు. నెలక్రితం ఈ మంచు ఫలకం ప్రధాన పర్వతంతో దాదాపుగా విడిపోయిం దని, కేవలం బలహీనమైన బంధం మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పారు. అది కూడా ఇప్పుడు తెగిపోయింది. ఇందువల్ల అంటార్కిటికా ద్వీపకల్పం రూపురేఖలే మారిపోవచ్చునంటున్నారు.

ఈ ఫలకం అక్కడి నుంచి పెను వేగంతో ముందుకు కదులుతుందా, ఎక్కడో నిలిచిపోయి దానికదే ఒక మంచు పర్వతంలా మారుతుందా, క్రమేపీ శకలాలుగా విడివడి కరుగుతూ అంతరిస్తుందా అన్నది శాస్త్రవేత్తలు ఊహించలేకపోతున్నారు. అసలు వారి ఆందోళనంతా ఈ ఫలకం తెగిపడిందని కాదు. ఈ పరిణామం పర్యవసానంగా లార్సెన్‌–సి అస్తిత్వమే ప్రమాదంలో పడవచ్చునని వారు కలవర పడుతున్నారు. ఎందుకంటే పైనుంచి విరుచుకుపడే హిమానీ నదులు ముందుకు పోకుండా ఈ హిమపర్వతాలు సీసా బిగించే బిరడాలా అడ్డుకుంటాయి. ఫలితంగా ఆ నదులు ముందుకెళ్లలేక ఉన్నచోటే నిలిచిపోయి అక్కడే క్రమేపీ గడ్డకట్టుకుపోయి మంచు పర్వతంలో భాగమైపోతాయి. ఇప్పుడు తాజాగా విరిగిపడిన ఫలకం కారణంగా లార్సెన్‌–సి ఎంతో కొంత బలహీనమవుతుంది. ఆ మంచు పర్వతం దగ్గర ఏ అవరోధమూ లేకపోయినా, ముందుకెళ్లడానికి ఎంతో కొంత దారి కన బడినా హిమానీ నదులు ఒక్కసారిగా విజృంభించి అంటార్కిటికా మహా సము ద్రంలో కలిస్తే సముద్ర నీటి మట్టాలపై అది చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ మట్టాలు ఒక్కసారిగా 10 సెంటీమీటర్లు పెరుగుతాయి. అలాంటి పెను ముప్పు ఏర్పడవచ్చునన్నదే శాస్త్రవేత్తల ఆందోళన. అయితే ఇదంతా భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా... అసంఖ్యాకమైన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా చేస్తున్నదే. 2002లో లార్సెన్‌–సి కి పక్కనుండే లార్సెన్‌–బి శకలాలుగా విడిపోయి చిన్నదై పోయింది. అనంతరకాలంలో హిమానీ నదుల ప్రవాహ వేగం రెండు నుంచి ఆరు రెట్లు పెరిగింది.  

లార్సెన్‌–ఏ, లార్సెన్‌–బి, లార్సెన్‌–సి వగైరా హిమ పర్వతాల్లో మంచు మేటలు వేయడానికి దోహదపడుతున్న హిమానీ నదాలు అసంఖ్యాకంగా ఉన్నా వాటిల్లో ఫ్లెమింగ్‌ పేరుతో ఉన్న హిమానీ నది అతి పెద్దది. అనేక చిన్న నదుల సంగమంగా ఉండే ఫ్లెమింగ్‌ దాదాపు 80 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ నది వద్ద 60వ దశకంతో పోలిస్తే ఇప్పుడు మంచు వేగంగా సముద్రంలో కలుస్తున్నదని శాస్త్రవేత్తలు లెక్కేస్తున్నారు. కరిగే మంచుకూ, హిమానీ నదుల్లోని ప్రవాహానికీ మధ్య ఉండే నిష్పత్తి స్థిరంగా కొనసాగు తున్నంతకాలం అక్కడ యధా స్థితికి ముప్పుండదు. అందులో ఏమాత్రం తేడా వచ్చినా పర్యావరణం ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు లార్సెన్‌–సి మంచు పర్వతం నుంచి ఒక ఫలకం విడిపోయిన కారణంగా ఆ పర్వతానికేమవుతుందో, విడివడ్డ ఫలకం చివరకు ఏ రూపు తీసుకుంటుందో అంచనా వేయడానికైనా మరి కొన్నాళ్లు పడుతుంది. ఆ తర్వాతే దానివల్ల కలిగే పర్యవసానాలేమిట న్నది శాస్త్రవేత్తలు పరిశీలించగలుగుతారు. మంచు ఫలకాలు వేరు పడినప్పుడు జరిగే ఉత్పాతం అంతా ఇంతా కాదు. అక్కడ నివసించే పెంగ్విన్‌ పక్షులు మొదలుకొని వివిధ రకాల జీవాల వరకూ అన్నిటిపైనా అది పెను ప్రభావం చూపుతుంది. నిరుడు ఒక మంచు ఫలకం విరిగిపడి లక్షన్నర పెంగ్విన్‌ పక్షులు నేలరాలాయి.

ఇప్పుడు అంటార్కిటికాలో అతి పెద్ద మంచు ఫలకం విడివడ్డ సంగతిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఆక్వామోడిస్‌ ఉపగ్రహ పరికరం ద్వారానే శాస్త్రవేత్తలు గుర్తించారు. పర్యావణానికి ముప్పు ఏర్పడటమన్నది పనిలేని శాస్త్రవేత్తలు కల్పిస్తున్న కట్టుకథగా కొట్టిపారేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు తాజా పరిణామం కళ్లు తెరిపించాలి. రెండేళ్లక్రితం పారిస్‌లో కుదిరిన పర్యావరణ ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్టు ఈమధ్యే ట్రంప్‌ ప్రకటించారు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఉద్గారాలు భూగోళాన్ని నిప్పుల కొలి మిలా మారుస్తున్నాయని, దాన్నుంచి మానవాళి బయటపడటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎన్నేళ్లుగానో పర్యావరణవేత్తలు ఆందోళనపడ్డారు. ఆ విషయంలో ఏదోమేరకు అంగీకారం కుదిరిందన్న సంతోషం ట్రంప్‌ రాకతో ఆవిరైంది. అంటార్కిటికాలో జరిగిన ఉత్పాతం పర్యావరణ పరిరక్షణ చైతన్యానికి దోహదపడితే మానవాళికి అంతమించిన చల్లని కబురుండదు. అది జరగాలని అందరం ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement