బాహుబలి బెనిఫిట్ షోలకు అనుమతి లేదు
హైదరాబాద్ : ‘సాక్షి’ ‘బ్లాక్‌బలి’ కథనంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. బాహుబలి-2 బెనిఫిట్ షోలకు అనుమతి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తాము అయిదు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇచ్చామని ఆయన బుధవారమిక్కడ స్పష్టం చేశారు. ఎక్కువ ధరకు టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే కాంబో ఆఫర్ల పేరుతో మోసం చేస్తే ఉపేక్షించేది లేదని తలసాని హెచ్చరించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఉపేక్షించేది లేదన్నారు.
మరోవైపు థియేటర్ల యాజమాన్యాలకు వాణిజ్య పన్నుల శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. ఎక్కువ రేట్లకు ఎవరు టికెట్లు అమ్మినా 18004253787 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ‍్చని ఆయన తెలిపారు. అయితే పెయిడ్ ప్రీమియం పేరుతో హైదరాబాద్ లో ఈ సినిమాను గురువారం రాత్రి నుంచే ప్రదర్శిస్తున్నారు.
కాగా బాహుబలి-2 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. తమిళనాడు, కేరళలలో 70-75 శాతం బాహుబలి పార్ట్-2 కోసమే బుక్ అవ్వగా.. తెలంగాణ ఆంధ్ర్రప్రదేశ్ లలో 80 శాతం థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. మరోవైపు అభిమానులు కూడా తొలిరోజే ఈ సినిమాను చూసేందుకు పోటీలు పడుతున్నారు. పెద్ద మొత్తం వెచ్చించి అయినా టికెట్ కొనేందుకు సిద్ధపడుతున్నారు.