బీసీల్లోకి కొత్త కులాలు | Some New Castes In BC Caste | Sakshi
Sakshi News home page

బీసీల్లోకి కొత్త కులాలు

Published Tue, Jul 2 2019 1:55 AM | Last Updated on Tue, Jul 2 2019 9:07 AM

Some New Castes In BC Caste - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల్లో (బీసీ)కి మరిన్ని కొత్త కులాలు చేరబోతున్నాయి. ఈ దిశగా బీసీ కమిషన్‌ చర్యలు చేపట్టింది. వాస్తవానికి రెండున్నరేళ్ల క్రితమే కొత్త కులాల చేరికపై పరిశీలన నివేదిక రూపొందించిన బీసీ కమిషన్‌ అప్పట్లో ఆయా కులాల నుంచి వినతులు, సూచనలు, సలహాలు స్వీకరించింది. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం క్షేత్ర పరిశీలన నిర్వహించాలనుకుంటున్న సందర్భంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్‌ పూర్తికావడంతో బీసీ కమిషన్‌ తిరిగి పరిశీలన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మరోమారు ఆయా కులాల నుంచి సూచనలు, వినతులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీ వరకు వినతులను స్వీకరించనుంది. అనంతరం ఈనెల 11వ తేదీ వరకు నిర్దేశిత కులాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు లిఖిత పూర్వక ఆధారాలు, డాక్యుమెంటరీలు తదితరాలను స్వీకరిస్తుంది. ఇప్పటివరకు 22 కులాలకు చెందిన ప్రతినిధులు వినతులు, సలహాలు, సూచనలు సమర్పించారు. 
 
ఆర్థిక స్థితిగతులే ప్రామాణింకంగా 
బీసీ కేటగిరీల్లో కొత్త కులాల చేర్పు అంశంలో ఆర్థిక, సామాజిక పరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందులో భాగంగా నిర్దేశిత కులాల్లోని ప్రజల జీవన విధానంతో పాటు వారి ఆర్థికస్థితులను పరిశీలిస్తారు. అదేవిధంగా కుల జనాభాలోని వ్యక్తుల వయసు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యను సైతం పరిగణలోకి తీసుకుంటారు. వీటన్నింటినీ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రత్యక్షంగా పరిశీలించి విచారణ చేపడతారు. ఈనెల రెండో వారంనుంచి క్షేత్రపరిశీలన చేపట్టేందుకు బీసీ కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది. పురపాలిక ఎన్నికల కోడ్‌ రాకముందే విచారణ పూర్తి చేయాలని కమిషన్‌ భావిస్తోంది. ఈమేరకు చర్యలను చకచకా పూర్తి చేస్తోంది. మొత్తంగా రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి పరిశీలన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని బీసీ కమిషన్‌ భావిస్తోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం లేకపోలేదు. 

ఆ కులాల జనాభా గరిష్టంగా 2లక్షలే 
‘బీసీ కులాల్లోకి కొత్తగా 30 కులాల చేర్పుపై పరిశీలన చేపట్టాం. ఈ కులాల మొత్తం జనాభా గరిష్టంగా 2లక్షలే. కొన్ని కులాల జనాభా 200–500 మాత్రమే ఉంది. అతి తక్కువ జనాభా ఉండడం, వీరికి గుర్తింపు లేకపోవడంతో ఈ కులాలన్నీ ఇప్పటికీ నిరాదరణకు గురయ్యాయి. ప్రస్తుతం మా కమిషన్‌ ద్వారా చేపడుతున్న పరిశీలనతో ఈ కులాలన్నింటికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కులాలన్నీ చాలా వెనుకబాటుకు గురయ్యాయి. వీటికి ఆదరణ అవసరం. ఇప్పటివరకు చేపట్టిన ప్రాథమిక పరిశీలనలో ఈ కులాల నుంచి పెద్దగా విద్యావంతులు లేరు. ఉద్యోగవంతులూ లేరు. కనీసం ఆర్థికంగా ఎదిగిన వారు సైతం లేరు. కొన్ని కులాల్లో కనీసం పదో తరగతి సైతం చదవలేదు. ప్రధాన కారణం రిజర్వేషన్లు లేకపోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కలగకపోవడం, జనరల్‌ కేటగిరీలో పోటీపడే సత్తా లేక పోవడంతో వెనుకబాటుకు గురయ్యారు. రెండు నెలల్లో కులాల చేర్పు పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఆమోదిస్తే ఆ కులాలకు ఆర్థిక, సామాజికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది’  – బీఎస్‌ రాములు, బీసీ కమిషన్‌ చైర్మన్‌  

బీసీల్లోకి చేర్చాలని భావిస్తున్న కులాలు 
.బీసీల్లో 112 కులాలే ఉండగా.. అనాథలను సైతం చేర్చడంతో ఈ సంఖ్య 113కి పెరిగింది. వీటికి అదనంగా కాకి పగ డాల, మందెచ్చుల,బత్తిన, కుల్ల కడగి, సన్నాయోల్లు/బౌల్‌ కమ్మర, బాగోతుల, బొప్పల, తోలుబొమ్మలాట, గంజి కూటి, శ్రీ క్షత్రియ రామజోగి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కడారి సైదరోళ్లు, సరగాని, ఓడ్, మాసయ్యలు/పటం, సాధనాశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవుల, గౌడ జెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, సారోళ్లు, అరవకోమటి, అహీర్‌ యాదవ్, గొవిలి కులాలను బీసీలో చేర్చేందుకు కమిషన్‌ పరిశీలన చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement