ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: డ్వాక్రా మహిళా సంఘాల వ్యవహారాలు పర్యవేక్షించే సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా అవతార మెత్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తుంగలో తొక్కుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబుకు బాకా ఊదుతూ ఏరియా కో–ఆర్డినేటర్లపై అధికారపార్టీకి అనుకూలంగా పనిచేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేగాక వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొన్ని మండలాలకు ఏరియా కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌కు ఫోన్‌చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీ తరఫున నందిగామ నుంచి పోటీచేస్తున్న తంగిరాల సౌమ్య లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిందని, ఆమెను కలవాలంటూ కిరణ్‌కు హుకుం జారీ చేశారు. అంతేకాక కిరణ్‌ను వ్యక్తిగతంగా ఫోన్‌లో సీఈవో కృష్ణమోహన్ తీవ్రంగా దుర్భాషలాడారు. కావాలని చెప్పి నాలుగు మండలాల్లో చెక్‌లు వెళ్లకుండా పెంటచేశావు.. మహిళలకు చెక్‌లు అందలేదు.. అంటూ తిట్లదండకం వినిపించారు. ఈ మేరకు కిరణ్‌కు సీఈవో కృష్ణమోహన్ ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన సంభాషణల వివరాలు ‘సాక్షి’కి చిక్కాయి. అందులో సీఈవో కృష్ణమోహన్ సంభాషణ ఇలా ఉంది..
ఎంత ధైర్యం నీకు..
‘‘నీ జన్మలో నిజం చెప్పడం తెలుసా నీకు? నీకంటూ ఎవరికైనా విశ్వాసంగా ఉండటంగానీ, నిజం చెప్పడంగానీ ఎప్పుడైనా ఉందా? నీవు ఆసుపత్రికి వెళితే పలకరించి మీ వెనుక మేము ఉన్నామయ్యా అంటే... ఇంత విష మనస్తత్వం గల నీవు ఎలాగ మనిషివయ్యావో.. నాకు అర్థం కాలేదు. నీ పరిస్థితి అలాగ కాదంటే ఇంకా దరిద్రంగా ఉందని చెబుతోంది ఆవిడ.. అర్థమైందా బెటర్ యూ.. నీవు నీ హద్దులో ఉండు.. లేకపోతే నీవు పెద్ద నాయకుడివైనా నీవే ఇబ్బంది పడతావు.. నీ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడను.. ఎంత ధైర్యం నీకు. కావాలని చెప్పి నాలుగు మండలాల్లో చెక్‌లు వెళ్లకుండా పెంటచేశావు.. మహిళలకు చెక్‌లు అందలేదు.. ఆమె నీ మీద ఎందుకు ఫిర్యాదు చేసిందంటావు.. ఎందుకు పెట్టింది ఆవిడ? ఏమైనా చెడ్డ ఆవిడా? అగ్రకుల అహంకారంతో పెట్టిందా? మనిషి అన్న తరువాత కొద్దిగా కాకపోతే కొద్దిగానైనా విశ్వాసం ఉండాలి కదా కిరణ్.
రిటన్‌గా ఫిర్యాదు ఇచ్చిందయ్యా ఆవిడ. ఎందుకిచ్చింది.. అంతమందిలో నీ మీదే ఎందుకు ఇచ్చింది ఆవిడ? నీ స్టాఫ్ అందరికీ చెప్పిన మేసేజ్‌లు చూపిస్తున్నారు వారు.. వెళ్లి మాట్లాడు మరి. ఊళ్లోనే ఉంటావు కదా.. వెళ్లి మాట్లాడవచ్చు కదా. ఎందుకు పెట్టారని, నీవు ఇంత దుర్మార్గుడవని అందరూ చెప్పారు. పాత రోజుల్లో ప్రశాంతి చెప్పింది. గతంలో నీ అంతటి దుర్మార్గుడు లేడని చెప్పారు.. కానీ నీ నక్క జిత్తుల వినయాలు చూసి నేను మోసపోయాను. అయ్యోపాపం ఆపదలో ఉన్నావని చెప్పి.. చేయ్ ఎంతవరకు చేస్తావో. నీవు ఎలాగ ఉంటావో చూస్తా.. చెయ్యి నీ ప్రతాపం ఏమిటో? నీవు చూపించింది ఇదయ్యా.. మేం కూడా చూపిస్తాం. నిన్ను ఉంచుకుని తప్పు చేశాం మేము.
కొద్దిగా కాకపోతే కొద్దిగా సెన్స్ ఉండాలి కనీసం.. వెళ్లు కలు.. కలవకపోయినా.. కలిసినా అక్కడ ఇంకో నక్కజిత్తులతో ఏదో చెబుతావు.. కేరెక్టర్ లేనప్పుడు ఎలాగైనా బతికేయవచ్చు.. నీ దగ్గరున్న స్టాఫ్‌ను పురిగొలిపి మహిళల్లో సీఎంకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నావంట. ఎంత ధైర్యం నీకు.. నీ ఎజెండా ఏమిటి.. నీతో మాట్లాడం కూడా సమయం వృథా. సీఎంకు వ్యతిరేకంగా ప్రచారం చేశావు ఎంత ధైర్యం నీకు. నీలాంటి వాడితో మాట్లాడటం వేస్ట్’’ అంటూ సీఈవో కృష్ణమోహన్ ఫోన్‌లో తిట్ల దండకం వినిపించారు. అయితే మీకు(సీఈవో) వచ్చిన సమాచారం తప్పని, ఆరు మండలాల్లో చెక్‌లు పంపిణీ చేశానంటూ ఏరియా కో–ఆర్డినేటర్ కిరణ్ పదేపదే వివరణ ఇచ్చినప్పటికీ సీఈవో పట్టించుకోలేదు.
టీడీపీ ఆఫీసుగా సెర్ప్ కార్యాలయం..
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సెలవురోజు కూడా సెర్ప్ కార్యాలయానికి వచ్చి డ్వాక్రా సంఘాల్లోని మహిళలతో టీడీపీకి ఓట్లు వేయించడమే లక్ష్యంగా సీఈవో కృష్ణమోహన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ కార్యాలయంగా సెర్ప్ కార్యాలయాన్ని కృష్ణమోహన్ మార్చేశారని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని పర్యవేక్షించకూడదని ఎన్నికల నియమావళి చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా సీఈవో వ్యవహరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment