కూల్చివేతలపై ముగిసిన వాదనలు Concluding arguments on demolitions | Sakshi
Sakshi News home page

కూల్చివేతలపై ముగిసిన వాదనలు

Published Fri, Jun 28 2024 5:55 AM | Last Updated on Fri, Jun 28 2024 5:55 AM

Concluding arguments on demolitions

నిర్ణయం వాయిదా.. అప్పటివరకూ స్టేటస్‌ కో: హైకోర్టు

ఉత్తర్వులు జారీచేసిన జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌

ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో అప్పటికప్పుడు నోటీసులిచ్చారు

అనుమతులు కోసం మేం దరఖాస్తు చేసుకున్నా నోటీసులిచ్చారు

ఉల్లంఘనలు ఏమిటో చెప్పరు

అలాంటప్పుడు వాటికి మేమెలా జవాబివ్వాలి?

కూల్చివేతలపై ముందుకెళ్లకుండా అధికారులను నియంత్రించండి

హైకోర్టుకు నివేదించిన వైఎస్సార్‌సీపీ న్యాయవాదులు

సాక్షి, అమరావతి : తమ పార్టీ కార్యాలయాల కూల్చివేతల నిమిత్తం ఇచ్చిన నోటీసులకు అనుగు­ణంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న అభ్యర్థనలతో వైఎస్సార్‌ సీపీ, ఆ పార్టీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. 

వాదనలు విన్న న్యాయస్థానం అనుబంధ వ్యాజ్యాలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్‌ కో) కొనసాగించాలంటూ బుధవారం ఇచ్చిన ఉత్తర్వులను నిర్ణయం వెలువరించేంత వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

కూల్చివేతలపై అధికారులను నియంత్రించాలంటూ పిటిషన్లు..
అన్ని జిల్లాల్లోని తమ పార్టీ కార్యా­లయాల కూల్చివేతలకు పురపాలక శాఖాధి­కారులు జారీచేసిన షోకాజ్‌ నోటీసులను, ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ, ఆ పార్టీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కూల్చివేతకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని కోరారు. అలాగే, కూల్చివే­ తలకు పాల్పడకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అలాగే, గురువారం మరిన్ని వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ గురువారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, పి. వీరారెడ్డి, న్యాయవాదులు వీఆర్‌ఎన్‌ ప్రశాంత్, యర్రంరెడ్డి నాగిరెడ్డి, వీఆర్‌ రెడ్డి, వి. సురేందర్‌రెడ్డి, ఉగ్రనరసింహ, రాసినేని హరీష్, వివేకానంద విరూపాక్ష తదితరులు సుదీర్ఘ వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

డీమ్డ్‌ నిబంధన కింద నిర్మాణాలు చేపట్టాం..
ఇక అనుమతుల కోసం తాము పెట్టుకున్న దరఖాస్తులపై అధికారులు నిర్ణీత కాల వ్యవధిలోపు నిర్ణయం వెలువరించలేదని, దీంతో చట్టంలో ఉన్న విధంగా తమకు అనుమతి వచ్చినట్లుగానే భావించి (డీమ్డ్‌ నిబంధన) నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. చట్ట ప్రకారం నడుచుకుంటామని ఒకవైపు కోర్టుకు చెబుతూ, మరోవైపు కూల్చివేతలకు పాల్పడుతు­న్నారని వివరించారు. 

ఇందుకే జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల విషయంలో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. అడ్వొకేట్‌ కమిషన్‌ను నియమించి రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యాలయాలకు అనుమతులు తీసుకున్నాయో లేదో తేల్చాలన్నారు. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటుచేయలేదని, అందువల్ల కూల్చేస్తామంటూ కూడా నోటీసులు ఇచ్చారని, వాస్తవానికి బహుళ అంతస్తుల భవనాలకే అగ్నిమాపక పరికరాల ఏర్పాటు నిబంధన వర్తిస్తుందని తెలిపారు. 

రాజకీయ పార్టీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదు..
అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. రాజకీయ పార్టీ అయినంత మాత్రాన ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదన్నారు. అనుమతులు లేకుండానే పార్టీ కార్యాలయాలను నిర్మించారని, అనుమతులు ఉంటే చూపాలన్నారు. తుది ఉత్తర్వులు జారీ చేయకముందే దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవన్నారు. 

డీమ్డ్‌ నిబంధన సంగతి ఏంటి?
ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. డీమ్డ్‌ నిబంధన సంగతి ఏమిటని ప్రశ్నించారు. డీమ్డ్‌ నిబంధన కింద అనుమతి వచ్చినట్లు భావించి నిర్మాణాలు చేసే ముందు ఆ విషయాన్ని నోటీసు ద్వారా సంబంధిత అధికారికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అయితే,  ప్రస్తుత కేసులో వైఎస్సార్‌సీపీ అలాంటి నోటీసు ఇవ్వలేదని దమ్మాలపాటి తెలిపారు. ఈ దశలో సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ.. తాము నోటీసు ద్వారా తెలియజేశామన్నారు.

తిరిగి దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ, షోకాజ్‌ నోటీసులకు ఇచ్చే వివరణను పరిగణనలోకి తీసుకుని తుది ఉత్తర్వులు జారీచేస్తామని, అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరంలేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాలపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నిర్ణయం వెలువరించేంత వరకు గతంలో ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు చెప్పారు. 

ఉల్లంఘనలంటారు.. అవేంటో చెప్పరు..
ఇన్నేళ్లుగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేస్తుంటే మౌనంగా ఉన్న పురపాలక శాఖాధికారులు ఒక్కసారిగా మేల్కొన్నారని వైఎస్సార్‌సీపీ  న్యాయ­­­వాదులు తెలిపారు. ఈనె­ల 22న అన్నీ జిల్లా­ల్లోని పార్టీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసు­లిచ్చారన్నారు. నిజానికి.. అనుమతుల కోసం సమర్పించిన దరఖాస్తులు వారి వద్ద ఉన్నప్పటికీ, వాటి గురించి ప్రస్తావించకుండా నోటీసులిచ్చారని తెలిపారు. ఉల్లంఘనలు ఉన్నాయ­న్న అధికారులు అవి ఏ రకమైన ఉల్లంఘనలో చెప్పడంలేదన్నారు. 

అలాంటప్పుడు వారిచ్చిన నోటీసులకు తాము వివరణ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటున్నార అన్నారు. వాస్తవాలేంటో తేల్చకుండా భవనాలను కూల్చేస్తే తమకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. రేపు అధికారుల చర్యలు సరికాదని తేలితే, కూల్చివేసిన భవనాలు తిరిగి రావని తెలిపారు. కూల్చివేతల విషయంలో యథాతథస్థితి కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీలేదని వారు వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement