సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, రాజానగరం మండలాల్లోని ఆవ భూముల్లో ఇళ్ల పట్టాల మంజూరుకు లైన్ క్లియర్ అయింది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఆవ భూముల్లో ఇళ్ల పట్టాల మంజూరుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, ఆ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు భారీ స్థాయిలో నివాస వసతి కల్పిస్తోందని, అందులో భాగంగానే పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని, స్టే వల్ల 40 వేల మందికి పట్టాల మంజూరు ఆగిపోయిందన్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల పట్టాల మంజూరుపై విధించిన స్టేను ఎత్తివేసింది. ఆవ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న పిటిషనర్ల వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎ.శ్రీనివాసరావు 2020లో దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన అప్పటి సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. ఆవ భూములను పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలకు కేటాయించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అదే ఏడాది ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై మరిన్ని వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది.
రాక్షసుల్లా ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు
ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజా సంక్షేమాన్ని ఆశించి పూర్వ కాలంలో మహర్షులు చేసిన యాగాలను రాక్షసులు హోమగుండంలో రక్త మాంసాలు వేసి అడ్డుకున్నట్లుగానే ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కొందరు అడ్డుకుంటున్నారని తెలిపారు.
భూ సేకరణ చట్ట నిబంధనలకు లోబడే సంప్రదింపుల ద్వారా భూములు తీసుకున్నామన్నారు. చట్టం నిర్దేశించిన దానికంటే ఎక్కువే పరిహారం చెల్లించామని వివరించారు. భూములు ఇచ్చిన వారికి, తీసుకుంటున్న వారికి లేని అభ్యంతరం పిటిషనర్లకు ఎందుకని అన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాది డీవీఎస్‌ఎన్ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ముంపునకు గురయ్యే ఆవ భూముల్లో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోందని, నిర్దేశించిన దానికంటే ఎక్కువ చెల్లించారని, ఇదో పెద్ద కుంభకోణమని, అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ ఏడాది సెప్టెంబర్ 1న తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. భూములు ఇచ్చిన వారికి, తీసుకుంటున్న వారికి లేని అభ్యంతరాలను పిటిషనర్లు లేవనెత్తడాన్ని తప్పుపట్టింది. ఆవ భూముల కొనుగోళ్లలో రూ.700 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న పిటిషనర్ల వాదనను సైతం ధర్మాసనం తోసిపుచ్చింది.
ఆవ భూముల్లో ఇళ్ల పట్టాలకు లైన్ క్లియర్
Published Wed, Oct 19 2022 5:10 AM | Last Updated on Wed, Oct 19 2022 6:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment