ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్ట కాల పరిమితిని నిర్ణయించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై తదుపరి విచారణ అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ల నిర్మాణంపై టీడీపీ నేత దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) పరిష్కరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తాను నిర్దేశించిన కాలపరిమితి మేరకు నడుచుకుంటుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో 84వేల ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త జాలా బాలాజీ గత ఏడాది హైకోర్టులో పిల్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల సీజే ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను ధర్మాసనం ప్రస్తావించింది. 45వేల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అందులో పేర్కొంది. 2022 మార్చి నాటికి 75వేలు ఇళ్లు, జూలై 22 నాటికి 70వేలు, డిసెంబర్ 22 నాటికి 72 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ అవసరంలేదంటూ ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment