
పీఎంఏవై
పశ్చిమగోదావరి, నిడమర్రు: పట్టణ ప్రాంత ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో సాధారణ వడ్డీరేటుతో పోల్చితే వడ్డీ రాయితీ ఇస్తున్నారు. క్రమం తప్పకుండా ఆదాయాన్ని ఆర్జించే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి జిల్లాలోని ఎనిమిది పట్టణాలను ఎంపిక చేసినట్టు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఈ.సుధాకర్ తెలిపారు. పథకం వివరాలు తెలుసుకుందాం..
మొదటిసారి మాత్రమే
మొదటిసారి సొంతంగా ఇల్లు కొనుక్కునేవారు మాత్రమే పీఎంఏవై పథకానికి అర్హులు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రుణం తీసుకోవచ్చు. కాకపోతే రాయితీ మాత్రం ఒకరికే వర్తిస్తుంది. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా, అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాలను నిర్మిస్తున్నా రుణం అందుతుంది. అయితే అప్పటికే ప్రభుత్వ పథకాల్లో ఇల్లు తీసుకోని వారు మాత్రమే అర్హులు.
ఎవరికిస్తారు
జిల్లాలో ఏలూరు, నరసాపురం, భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పారిశుద్ధ్య కార్మికులు, చిరుద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, హోంగార్డులు తదితర వర్గాల వారు అర్హులు. దాదాపు 30కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ పథకం కింద రుణాన్ని మంజూరు చేస్తున్నాయి.
వీరు అర్హులు..
♦ 20 ఏళ్లు కాలపరిమితికి రుణం తీసుకునేవారు.
♦ ఏడాదికి రూ.3 లక్షల్లోపు ఆదాయం ఆర్జించేవారికి రూ.3 లక్షల వరకూ రుణం ఇస్తారు. వీరు సుమారు 30 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఇల్లు కొనుక్కోవచ్చు లేదా కట్టుకోవచ్చు.
♦ ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలను ఆర్జించేవారికి గరిష్టంగా రూ.6 లక్షల వరకూ రుణం ఇస్తారు. 60 చ.మీ / 850 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాట్లు, ఇళ్లను సొంతం చేసుకోవచ్చు.
♦ ఏడాదికి రూ.12 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారు సుమారు రూ.9 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. ఈ విభాగంలో 90 చ.మీ / 1,275 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లు సొంతం చేసుకోవచ్చు.
♦ రూ.12–18 లక్షల మధ్య వార్షిక ఆదాయం లేదా నెలకు రూ.లక్ష నుంచి లక్షన్నర దాకా జీతమున్న వారికి సుమారు రూ.12 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తారు. వీరు 1,550 చదరపు అడుగుల విస్తీర్ణంగల ప్లాట్లను కొనుక్కోవచ్చు.
లెక్కల రూపంలో సుమారు ఇలా..
♦ రుణం మొత్తం : రూ.10 లక్షలు
♦ వడ్డీ రాయితీ : రూ.2,67,282
♦ మిగతా రుణం: రూ.7,32,720
♦ మొదటి ఈఎంఐ: రూ.9,650
♦ సబ్సిడీ తర్వాత ఈఎంఐ: రూ.7,071
♦ నెలసరి పొదుపు: రూ.2,579
♦ వార్షిక పొదుపు: రూ.30,948
ప్రయోజనాలు
రూ.3 లక్షల రుణానికి రూ.1,33,640 వరకూ వడ్డీ రాయితీ లభిస్తుంది. బ్యాంకు వడ్డీ రేటు ప్రకారం ముందు రూ.2,895 ఈఎంఐ చెల్లించాలి. వడ్డీ రాయితీ వచ్చిన తర్వాత నెలకు రూ.1,605 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా ఏడాదికి రూ.15,480 ఆదా అవుతుంది.
త్వరితగతిన రుణ మంజూరు
పథకంలో దరఖాస్తు చేసుకున్న వారం నుంచి రెండు వారాల్లోపు బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. బ్యాంకు అధికారులు అడిగిన పత్రాలన్నింటినీ సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా బ్యాంకుకు వెళ్లి లేదా
ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. http//pmaymis.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం
పీఎంఏవై పథకం కింద రుణాలివ్వడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఎస్‌బీఐ అవగాహనా సదస్సుల్లో ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన వారు ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయరు. అటువంటివారికి ఈ పథకం ద్వారా సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పత్రాలన్నీ సమర్పిస్తే వేగంగా రుణం మంజూరు చేసేలా కృషి చేస్తున్నాం.
– ఈ.సుధాకర్, ఏజీఎం, ఎస్‌బీఐ, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment