
ముంబై: దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాల(ఎంఐజీ)కు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద అందిస్తున్న రూ.2.60 లక్షల వడ్డీ సబ్సిడీ గడువును 2019 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
గతేడాది ప్రధాని మోదీ ప్రారంభించిన రుణ అనుసంధానిత సబ్సిడీ పథకానికి(సీఎల్‌ఎస్‌ఎస్) తుదిగడువు ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుండటంతో ప్రభుత్వం మరో 15 నెలలు పొడిగించిందని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా తెలిపారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ సొంతిళ్లు సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రూ.6–12 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలు 20 ఏళ్ల కాలపరిమితితో రూ.9 లక్షల వరకు తీసుకునే రుణాలపై కేంద్రం ప్రస్తుతం సీఎల్‌ఎస్‌ఎస్ కింద 4% సబ్సిడీని అందిస్తోంది. వార్షికాదాయం రూ.12–18 లక్షలు ఉండే మధ్య తరగతి కుటుంబాలకు 3% వడ్డీ సబ్సిడీని అందిస్తోంది.