ఎన్టీఆర్ నగర్‌లో నిర్మిస్తున్న ప్లాట్లు
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పేదల కోసం నిర్మించే పక్కా గృహాలు తీసుకునేందుకు లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు. 3వేల మందికి పైగా దరఖాస్తు చేసినా అందులో నాలుగో వంతు కూడా లబ్ధిదారుని వాటా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కడప కార్పొరేషన్: పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై), హౌసింగ్ ఫర్ ఆల్ (ఎన్టీఆర్ నగర్)లో అపార్ట్‌మెంట్ పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ దీనిని కాంట్రాక్టు తీసుకుంది. మలేషియాలో ఉపయోగించే షియర్ వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే ఇళ్లు నిర్మిస్తున్నారు. వైఎస్‌ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో సరోజినీనగర్ వద్ద దీనిని మొదలు పెట్టారు.
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్, రాయచోటి, ఎర్రగుంట్లలో ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. మూడు దశల్లో మొత్తం 19,232 ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మొదటి దశలో మొత్తం 4092 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కడపలో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. మరో ఆరు బ్లాకుల్లో ఆక్రమణలు ఉండగా వారికి ఇంటి స్థలాలు వేరొక చోట ఇచ్చేందుకు కలెక్టర్ సమ్మతి తెలిపినట్లు తెలిసింది. రెండో దశలో 13,213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2,281, ప్రొద్దుటూరులో 2,150, బద్వేల్‌లో 808, రాయచోటిలో 1,011, రాజంపేటలో 1,279, ఎర్రగుంట్లలో 2,046, జమ్మలమడుగులో 1,415, పులివెందులలో 2,143 చొప్పున నిర్మించాల్సి ఉంది.
మూడో దశలో 1,927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. కాగా మైదుకూరు మినహా అన్ని మున్సిపాలిటీల్లో హౌసింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే కడప, జమ్మలమడుగులో నిర్మిస్తున్న ప్లాట్లు మాత్రమే మార్చి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి, మార్చి నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఇళ్లు ఎప్పుడు పూర్తి అవుతాయనేది అనుమానంగానే ఉంది. ఇదిలా ఉండగా కడపలో కట్టిన ఇళ్లకు లబ్ధిదారులు సుముఖత చూపకపోవడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది.
ఎన్ని ఆశలు కల్పించినా స్పందన అంతంత మాత్రమే...
షీర్‌వాల్ టెక్నాలజీ వంటి అధునాతన పద్ధతిలో నిర్మిస్తున్నామని ప్రభుత్వం ఊదరగొట్టింది. ప్రజలను ఎన్టీఆర్ నగర్‌కు తీసుకెళ్లి ఇళ్లు చూపించి ఆహా, ఓహో అంటూ గొప్పలు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని చెప్పినా లబ్ధిదారులు మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పుడు కేవలం రూ.500 చెల్లించి ప్లాట్ తీసుకుంటే ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను ఇస్తుంది కాబట్టి ఇల్లు మిగిలిపోతుందని కొందరు ఆశలు కల్పించారు. అయినా లబ్ధిదారుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు.
కారణాలివే...
ఎన్టీఆర్ నగర్‌లో ప్లాట్లు తీసుకోక పోవడానికి అనేక కారణాలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇళ్లన్నీ తక్కువ విస్తీర్ణంలో అగ్గిపెట్టెల తరహాలో ఉండటం, బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బు లక్షల్లో ఉండటం,సన్నటి కడ్డీలతో నిర్మించడం వల్ల నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరాపై ఉన్న అనుమానాలతోనే చాలా మంది ముందుకు రానట్లు తెలుస్తోంది. ఇళ్లకు నీటిని సరఫరా చేసే నీటి ట్యాంకులు చిన్నవిగా ఉన్నాయి. చాలామంది వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు కావాలని బలంగా కోరుకుంటున్నారే తప్ప ఆపార్ట్‌మెంట్ తరహాలో కట్టే ఇళ్లను ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
3న లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయింపు
డిసెంబర్ 3న కడపలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ నగర్‌లోని ప్లాట్లు కేటాయించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా డిప్ సిస్టమ్‌లో ఈ కేటాయింపులు జరపనున్నారు. అంధులు, వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. కడపలో 2,600 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 670 మంది మాత్రమే లబ్ధిదారుని వాటా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం 940 ఇళ్లు నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నందున మిగిలిన వారిని ఎక్కడి నుంచి తేవాలని అధికారులు సతమతమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment