అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు | Corruption In NTR Housing Scheme | Sakshi
Sakshi News home page

అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు

Published Fri, Aug 17 2018 1:24 PM | Last Updated on Sat, Sep 22 2018 8:30 PM

Corruption In NTR  Housing Scheme - Sakshi

కడప శివార్లలో సరోజినీనగర్‌ వద్ద నిర్మిస్తున్న ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీం ఇళ్లు

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పేదల కోసం నిర్మించే పక్కా గృహాలు అగ్గిపెట్టెలను తలపిస్తున్నాయి. ఎన్నికల ముందు సొంత ఇళ్లు లేని కుటుంబానికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి షీర్‌వాల్‌ టెక్నాలజీ అంటూ గొప్పలు చెబుతూ జీప్లస్‌ త్రీ అంతస్తులతో నిర్మిస్తున్న ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీంలో కేవలం సెంటు స్థలానికి తక్కువగా ఉన్న విస్తీర్ణంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మిస్తున్నారు.

కడప కార్పొరేషన్‌ : పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం(పీఎంఏవై) కింద అపార్ట్‌మెంట్‌ పద్దతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కాంట్రాక్టుతీసుకుంది. మలేషియాలో ఉపయోగించే షియర్‌వాల్‌ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే నిర్మించే ఇళ్లకు ఎంత వరకు మన్నిక ఉంటుందనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. సాధారణంగా ఇక్కడ చిన్న ఇళ్లకు సైతం 12ఎంఎం ఇనుప కడ్డీలు, ఆపార్ట్‌మెంట్లకైతే 16ఎంఎం కడ్డీలు వాడుతుంటారు. ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌కు మాత్రం కేవలం 8ఎంఎం సైజు కడ్డీలు ఉపయోగించి బెత్తెడు వెడల్పు మందంతో గోడలు నిర్మిస్తున్నారు.

8ఎంఎం కడ్డీలతోనే జీ ప్లస్‌ 3 ఆపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. స్లాబ్‌ మందం మాత్రం 6 ఇంచ్‌లు వేస్తున్నారు. ఇంత బరువును ఈ నాలుగు ఇంచ్‌ మందం ఉన్న గోడలు ఎంతమేరకు భరిస్తాయో భగవంతుడికే ఎరుక. షియర్‌ వాల్‌ టెక్నాలజీతో కట్టే ఇళ్లు సముద్రంలోనూ, భూకంపాలు వచ్చినా చెక్కుచెదరవని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఏ ఇంటికైనా స్లాబ్‌ వేసినప్పుడు కనీసం 18 రోజులైనా క్యూరింగ్‌ చేయాల్సిఉంది. ఇక్కడ మొత్తంసిమెంటు కాంక్రీటుతోనే నిర్మిస్తున్నందున ఈ తరహాలోనే క్యూరింగ్‌ చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థ మాత్రం వాల్‌షీట్లు వేసి అందులో సిమెంటు కాంక్రీటు వేసి ఆరిపోగానే తీసివేస్తున్నారు. ఏడు రోజులు మాత్రమే నీళ్లు పోసి క్యూరింగ్‌ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో నిర్మాణాలు పగుళ్లు బారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా నిర్మించాలనే తలంపుతో కార్మికులకు షిఫ్టు పద్దతి లేకుండా రేయింబవళ్లు పనిచేయిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీరికి కల్పించాల్సిన కనీస సౌకర్యాల విషయంలోనూ కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

మరుగుదొడ్డి పక్కనే వంటగది
ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు సబ్సిడీ ఇస్తాయి.300 చదరపు అడుగులు (రూ.6.03లక్షలు), 365 చదరపు అడుగులు(రూ.7.08లక్షలు), 430 చదరపు అడుగులు(రూ.8.20లక్షలు) వంటి మూడు కేటగిరిలలో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. ఈమొత్తంలో ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు బ్యాంకుకు కంతుల రూపంలో చెల్లిం చాలి. రెండు, మూడు కేటగిరి ఇళ్లను ఎంచుకునే వారు లబ్ధిదారుని వాటా కింద వరుసగా రూ.50వేలు, లక్ష రూపాయలు నాలుగు విడతల్లో చెల్లించాలి. ఇందులో మొదటి రెండు కేటగిరీలు సింగిల్‌ బెడ్‌రూమ్‌ కాగా, మూడో కేటగిరి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లలో ఎడమ వైపు ఉన్న ఇళ్లకు బెడ్‌రూమ్‌కు వంటగదికి మధ్య బాత్‌రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేయడం మైనస్‌గా చెప్పవచ్చు. ఎవరూ కూడా వంటగది పక్కన బాత్‌రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోరు. అలాంటిది ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌ డిజైన్లలో ఇది ఏవిధంగా చేర్చారో అర్థం కాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. దీనిపై ఏపీ టిడ్కో ఆధికారులను అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిజైన్‌ వాడుతున్నారని చెప్పడం గమనార్హం. మూడు కేటగిరీల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేవలం సెంటు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

సకాలంలో పూర్తయ్యేనా...!
రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీం కింద మూడు దశల్లో నిర్మించనున్న 19,232 ఇళ్లు సకాలంలో పూర్తయ్యే సూచనలు కన్పించడం లేదు. మొదటి దశలో మొత్తం 4092 నిర్మించనుండగా కడపలో 2,092 ఇళ్లు, ప్రొద్దుటూరులో 2,000 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. కడపలో ఒక బ్లాక్‌లో 32 ఇళ్ల చొప్పున మొత్తం 63 బ్లాకుల్లో 2,016 ఇళ్లు నిర్మించాలి. అయితే ఇందులో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్‌ ఉన్నాయి. మరో ఆరు బ్లాకుల్లో ఆక్రమణలు ఉన్నాయి. మిగిలిన 24 బ్లాకుల్లో సాగుతుండగా 630 ఇళ్లు పూర్తయ్యాయి. 300 ఇళ్లను నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, బద్వేల్‌లో ఈ స్కీం ఇంకా మొదలు కాలేదు. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. రెండవ దశలో 13,213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2,281, ప్రొద్దుటూరులో 2,150, బద్వేల్‌లో 808, రాయచోటిలో 1,011, రాజంపేటలో 1,279, ఎర్రగుంట్లలో 2,046, జమ్మలమడుగులో 1,415, పులివెందులలో 2143 చొప్పున నిర్మించాల్సి ఉంది. మూడో దశలో 1,927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా ఇందులో మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. అయితే రెండు, మూడు దశల్లో నిర్మించే 15,140 ఇళ్లు డిసెంబర్, మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కోర్టు కేసులు, భూసేకరణ సమస్యల వల్ల ఎన్నికలు రాబోతున్న ఈ నాలుగైదు మాసాల్లో అవి పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక ఇళ్లు నిర్మించినచోట రోడ్లు, కాలువలు, విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక వసతులు ఎçప్పటిలోగా కల్పిస్తారో వేచిచూడాల్సిందే.

నాణ్యతలో సందేహాలు అక్కర్లేదు: ఈఈ
ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతలో ఎలాంటి అక్కర్లేదని ఏపీటిడ్కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ లీలా క్రిష్ణ ప్రసాద్‌ అన్నారు. క్యూరింగ్‌ బాగానే చేస్తున్నామని, క్వాలిటీ తనిఖీ చేయడానికి ప్రత్యేక విభాగం ఉందని చెప్పారు. వారు ఎప్పటికప్పుడు నాణ్యతను తనిఖీ చేస్తుంటారని, కడ్డీలు సన్నగా ఉన్నా ఎక్కువ కడ్డీలు వేస్తున్నందున ఇళ్లకు బలం వస్తుందని, ఎన్ని ఏళ్లయినా చెక్కుచెదరవని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement