కాసులు ఇస్తేనే బిల్లులు | Corruption In Rayachoti Housing Office YSR Kadapa | Sakshi
Sakshi News home page

కాసులు ఇస్తేనే బిల్లులు

Published Thu, Aug 2 2018 8:04 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Corruption In Rayachoti Housing Office YSR Kadapa - Sakshi

రాయచోటి డివిజనల్‌ హౌసింగ్‌ కార్యాలయం

రాయచోటి(వైఎస్సార్‌ కడప): రాయచోటి హౌసింగ్‌ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కార్యాలయంలో సిబ్బంది చేతివాటం తారాస్థాయికి చేరుకోవడంతో లబ్ధిదారులు గగ్గోలుపెడుతున్నారు. పక్కాగృహం మంజూరు దరఖాస్తు నుంచి చివరి బిల్లు పడేవరకు కదిలే ప్రతి ఫైలుకు ఒక ధరను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి, అక్రమాలు పెచ్చుమీరడంతో ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు రోడ్డెక్కాయి. కార్యాలయ పరిధిలో జరుగుతున్న అవినీ తిపై సోషల్‌ మీడియాలో కూడా హల్‌చల్‌ చేస్తోం ది. అధికారపార్టీకి చెందిన కొంతమంది నాయకులను అండగా పెట్టుకుని వేలకు వేలు లబ్ధిదారుల నుం చి లాగేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నా యి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని యోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకుందామనుకున్న పేదలకు మామూళ్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇవ్వకుంటే బిల్లు చేయరన్న భయంతో చాలామంది అప్పులు చేసి సమర్పిస్తున్నట్లు ప్రజాసంఘాలు వెల్లడిస్తున్నాయి.

నీరుగారుతున్న లక్ష్యం
ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించడంలో హౌసింగ్‌ శాఖాధికారులు విఫలమవుతున్నారు. లబ్ధిదారుల నుంచి మామూళ్లు వసూళ్లపై పెట్టే శ్రద్ధ లక్ష్యాన్ని ఛేదించడంలో కనిపించడం లేదు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో 4,643 పక్కాగృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటివరకు 41.69శాతం అంటే 19,36 గృహాలు పూర్తవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 2,707 గృహాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి. వీటిని డిసెంబరు చివరికి పూర్తిచేయించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో మంజూరైన గృహాలలో కూడా కొన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. నాలుగేళ్లుగా మంజూరైన గృహా లను పూర్తి చేయించ లేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వందశాతం గృహాలను పూర్తి చేయిస్తారన్న నమ్మకం లబ్ధిదారులు కోల్పోయారు.
దళారుల మాటే వేదం
కార్యాలయ పరిధిలో ఫైలు కదలాలంటే దళారుల మాటే వేదం. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిలోని కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ గృహం మం జూరు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, గృహాల కేటాయింపులో లబ్ధిదారులకు అవకాశం లభించా లన్నా, చివరికి బిల్లుల జమ వరకు దళారుల చేతికి డబ్బులు అందిన తర్వాతనే కార్యాలయంలో రికార్డులు ముందుకు సాగుతుంటాయి. మున్సిపాలిటీ, రూరల్‌ పరిధిలుగా విభజించి ఒకొక్క పక్కాగృహానికి రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు మామూళ్ల రూపంలో చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అవినీతి అక్రమాలపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్న వాదనలు ఉన్నాయి. సొమ్ములు లేకపోతే కనీసం అధికారపార్టీ అండదండలైనా ఉండి తీరాల్సిందేనని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హౌసింగ్‌ శాఖ నుంచి తొలగించిన సిబ్బందే దళారుల అవతారమెత్తినట్లు ప్రచారం నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌ కార్డులను అడ్డుపెట్టి డివిజన్‌ పరిధిలోని లబ్ధిదారులను పీల్చిపిప్పిచేస్తున్నారు. ఇప్పటికే దళారుల పాత్రతో సుమారు 200 గృహాలను మంజూరుచేసినట్లు ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. వాటిపై చర్యలు తీసుకోవడంలో స్థానిక డీఈ, ఆ పైస్థాయి అధికారులు ఆలస్యం చేస్తున్నారు.

  • పునాదుల బిల్లు సిద్ధం చేస్తున్నాం. డబ్బులు సిద్ధం చేసుకుని ఆఫీసుకొచ్చి కనపడు. డీఈ సర్‌ చెప్పారు. డబ్బు చెల్లిస్తే మీ బిల్లు బ్యాంకులో జమవుతుంది. అంటూ మధ్యవర్తులు, కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్న సిబ్బంది నుంచి ఫోన్‌ ద్వారా లబ్ధిదారులకు చెబుతున్న మాటలు ఇవి.
  • రాయచోటి పట్టణ పరిధిలోని సంజీవనగర్‌ పరిధికి చెందిన చాకలి రాజాకు ఎన్టీఆర్‌ గృహాన్ని మంజూరు చేశారు. గృహానికి సంబంధించిన బిల్లు సిద్ధమైంది.. రూ.5వేలు తీసుకుని కార్యాలయానికి రావాలని సిబ్బంది నుంచి ఫోన్‌ వచ్చింది. విషయాన్ని స్థానిక కౌన్సిలర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆ కౌన్సిలర్‌ బిల్లుల మంజూరుకు మామూళ్లు వసూలు చేయడంపై ప్రశ్నించడంతో కార్యాలయం సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
  • ఇలా కార్యాలయంలోని సిబ్బంది, మధ్యదళారుల అవినీతి, అక్రమాలు అధికమయ్యాయి. ప్రత్యక్షంగా హౌసింగ్‌ డివిజన్‌ అధికారి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవు
పక్కాగృహాల మంజూరుకు, బిల్లులు చెల్లింపు కోసం లబ్ధిదారుల మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. వసూళ్లకు పాల్పడిన వారి వివరాలు నా దృష్టికి తెస్తే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటాను. లబ్ధిదారులు ఎవ్వరూ కార్యాలయ సిబ్బందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పైసా ఆన్‌లైన్‌ ద్వారా లబ్ధిదారుని పేరున బ్యాంకులో జమ అవుతుంది.

గురుప్రసాద్, గృహనిర్మాణశాఖ డీఈ, రాయచోటి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement