housing office
-
కాసులు ఇస్తేనే బిల్లులు
రాయచోటి(వైఎస్సార్ కడప): రాయచోటి హౌసింగ్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కార్యాలయంలో సిబ్బంది చేతివాటం తారాస్థాయికి చేరుకోవడంతో లబ్ధిదారులు గగ్గోలుపెడుతున్నారు. పక్కాగృహం మంజూరు దరఖాస్తు నుంచి చివరి బిల్లు పడేవరకు కదిలే ప్రతి ఫైలుకు ఒక ధరను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి, అక్రమాలు పెచ్చుమీరడంతో ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు రోడ్డెక్కాయి. కార్యాలయ పరిధిలో జరుగుతున్న అవినీ తిపై సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోం ది. అధికారపార్టీకి చెందిన కొంతమంది నాయకులను అండగా పెట్టుకుని వేలకు వేలు లబ్ధిదారుల నుం చి లాగేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నా యి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని యోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకుందామనుకున్న పేదలకు మామూళ్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇవ్వకుంటే బిల్లు చేయరన్న భయంతో చాలామంది అప్పులు చేసి సమర్పిస్తున్నట్లు ప్రజాసంఘాలు వెల్లడిస్తున్నాయి. నీరుగారుతున్న లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించడంలో హౌసింగ్ శాఖాధికారులు విఫలమవుతున్నారు. లబ్ధిదారుల నుంచి మామూళ్లు వసూళ్లపై పెట్టే శ్రద్ధ లక్ష్యాన్ని ఛేదించడంలో కనిపించడం లేదు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో 4,643 పక్కాగృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటివరకు 41.69శాతం అంటే 19,36 గృహాలు పూర్తవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 2,707 గృహాలు వివిధ స్థాయిలలో ఉన్నాయి. వీటిని డిసెంబరు చివరికి పూర్తిచేయించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో మంజూరైన గృహాలలో కూడా కొన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. నాలుగేళ్లుగా మంజూరైన గృహా లను పూర్తి చేయించ లేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వందశాతం గృహాలను పూర్తి చేయిస్తారన్న నమ్మకం లబ్ధిదారులు కోల్పోయారు. దళారుల మాటే వేదం కార్యాలయ పరిధిలో ఫైలు కదలాలంటే దళారుల మాటే వేదం. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిలోని కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ గృహం మం జూరు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా, గృహాల కేటాయింపులో లబ్ధిదారులకు అవకాశం లభించా లన్నా, చివరికి బిల్లుల జమ వరకు దళారుల చేతికి డబ్బులు అందిన తర్వాతనే కార్యాలయంలో రికార్డులు ముందుకు సాగుతుంటాయి. మున్సిపాలిటీ, రూరల్ పరిధిలుగా విభజించి ఒకొక్క పక్కాగృహానికి రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు మామూళ్ల రూపంలో చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అవినీతి అక్రమాలపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్న వాదనలు ఉన్నాయి. సొమ్ములు లేకపోతే కనీసం అధికారపార్టీ అండదండలైనా ఉండి తీరాల్సిందేనని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హౌసింగ్ శాఖ నుంచి తొలగించిన సిబ్బందే దళారుల అవతారమెత్తినట్లు ప్రచారం నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ కార్డులను అడ్డుపెట్టి డివిజన్ పరిధిలోని లబ్ధిదారులను పీల్చిపిప్పిచేస్తున్నారు. ఇప్పటికే దళారుల పాత్రతో సుమారు 200 గృహాలను మంజూరుచేసినట్లు ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. వాటిపై చర్యలు తీసుకోవడంలో స్థానిక డీఈ, ఆ పైస్థాయి అధికారులు ఆలస్యం చేస్తున్నారు. పునాదుల బిల్లు సిద్ధం చేస్తున్నాం. డబ్బులు సిద్ధం చేసుకుని ఆఫీసుకొచ్చి కనపడు. డీఈ సర్ చెప్పారు. డబ్బు చెల్లిస్తే మీ బిల్లు బ్యాంకులో జమవుతుంది. అంటూ మధ్యవర్తులు, కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న సిబ్బంది నుంచి ఫోన్ ద్వారా లబ్ధిదారులకు చెబుతున్న మాటలు ఇవి. రాయచోటి పట్టణ పరిధిలోని సంజీవనగర్ పరిధికి చెందిన చాకలి రాజాకు ఎన్టీఆర్ గృహాన్ని మంజూరు చేశారు. గృహానికి సంబంధించిన బిల్లు సిద్ధమైంది.. రూ.5వేలు తీసుకుని కార్యాలయానికి రావాలని సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది. విషయాన్ని స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ కౌన్సిలర్ బిల్లుల మంజూరుకు మామూళ్లు వసూలు చేయడంపై ప్రశ్నించడంతో కార్యాలయం సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇలా కార్యాలయంలోని సిబ్బంది, మధ్యదళారుల అవినీతి, అక్రమాలు అధికమయ్యాయి. ప్రత్యక్షంగా హౌసింగ్ డివిజన్ అధికారి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవు పక్కాగృహాల మంజూరుకు, బిల్లులు చెల్లింపు కోసం లబ్ధిదారుల మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. వసూళ్లకు పాల్పడిన వారి వివరాలు నా దృష్టికి తెస్తే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటాను. లబ్ధిదారులు ఎవ్వరూ కార్యాలయ సిబ్బందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పైసా ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుని పేరున బ్యాంకులో జమ అవుతుంది. గురుప్రసాద్, గృహనిర్మాణశాఖ డీఈ, రాయచోటి -
గృహ నిర్మాణ సంస్థలో బదిలీలు
రిలీవ్ చేసేందుకు కలెక్టర్ ససేమిరా! అనంతపురం టౌన్ : గృహ నిర్మాణ సంస్థలో బదిలీలు ముగిసినా రిలీవ్ చేయడానికి మాత్రం కలెక్టర్ వీరపాండియన్ ససేమిరా అంటున్నారు. పర్యవేక్షించే అధికారులెవరూ లేకపోతే జిల్లాలో గృహ నిర్మాణాలు మందగిస్తాయన్న కారణంతో ఇక్కడికి ఎవరైనా బదిలీపై వస్తేనే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తానని స్పష్టం చేశారు. హౌసింగ్‌లో అనంతపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా ఉన్న అమర్నాథ్రెడ్డిని ప్రభుత్వం కర్నూలు జిల్లా గూడూరుకు మూడ్రోజుల కిందట బదిలీ చేసింది. పెనుకొండ డీఈఈ కుప్పుస్వామిని వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు, గుంతకల్లు డీఈఈ వెంకటేశ్వర్లును చిత్తూరు జిల్లా నగరికి, కదిరి డీఈఈ చంద్రశేఖర్‌ను చిత్తూరు జిల్లా మదనపల్లికి చేశారు. వీరిలో కదిరి డీఈఈ స్థానంలో వైఎస్సార్ జిల్లా నుంచి సుందర్రాజును నియమించడంతో ఈయన బదిలీకి కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన ఇద్దరి స్థానాల్లో ఎవరి నియామకం జరగకపోవడంతో వారిని రిలీవ్ చేయడానికి విముఖత చూపుతున్నారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన వారి స్థానాన్ని భర్తీ చేస్తేనే రిలీవ్ చేయాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ రాజశేఖర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం డివిజన్ డీఈఈ అమర్నాథ్రెడ్డి స్థానంలో ఇక్కడే కన్స్ట్రక్షన్స్ ఈఈగా ఉన్న ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించినా ఆయనను రిలీవ్ చేయొద్దని సూచించారు. దీంతో బదిలీ ఉత్తర్వులు వచ్చినా ఉద్యోగులు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. కాగా పెనుకొండ డివిజన్ డీఈఈగా వచ్చేందుకు ప్రొద్దుటూరులో పని చేస్తున్న నాగరాజు రిక్వెస్ట్ బదిలీ పెట్టారు. అయితే ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇప్పటికే బదిలీ ఉత్తర్వులు అందుకున్న అధికారులు తమను రిలీవ్ చేయాలంటూ హౌసింగ్ అధికారులను కోరుతున్నా కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ విషయమై హౌసింగ్ పీడీ రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగులను రిలీవ్ చేసే విషయంలో కలెక్టర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. -
‘గృహ నిర్మాణం పేదలకు భారం కాకూడదు’
పుట్టపర్తి అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలకు భారం కాకూడదని హౌసింగ్ పీడీ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక హౌసింగ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంగళవారం ఆయన విచ్చేశారు. అనంతరం హౌసింగ్ ఈఈ చంద్రమౌళిరెడ్డితో కలసి స్థానిక ఎమ్మార్సీ భవనం సమీపంలో ఏర్పాటు చేసిన తాపీ మేస్త్రీలు శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులకు అనుకూలంగా తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేపట్టేది తాపీ మేస్త్రీలే కావడంతో వారికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అవగాహన సదస్సులు మండల కేందాల్లోనే గాక గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు 1.05 లక్షలు, బీసీలకు రూ.70 వేలు మంజూరు చేస్తుందన్నారు. సమావేశం అనంతరం తక్కువ ఖర్చుతో ఇళ్లు, మరుగుదొడ్డి ఎలా నిర్మించుకోవాలా అనే వాటి సమస్యలను పరిష్కరించేందుకు మేస్త్రీలకు పుస్తకాలు పంపిణీ చేశారు. 1.16 లక్షలు హౌసింగ్ దరఖాస్తులు పెండింగ్‌లో.. : జిల్లాలో ప్రస్తుతం 1.16 లక్షల హౌసింగ్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు హౌసింగ్ పీడీ ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తికి మంగళవారం విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి, రెండో రచ్చబండల్లో వచ్చిన దరఖాస్తుల్లో పరిశీలించిన అనంతరం మూడో విడత రచ్చబండలో 42,820 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇంకా సుమారు 1.16 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిశీలన అనంతరం ఇళ్ల మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో 914 ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయన్నారు. వీటికి మౌలిక వసతులు కల్పన కోసం రూ.54 కోట్లు మంజూరు కాగా రూ.42 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. విడపనకల్, రామగిరి మండలాల్లో జరిగిన అవినీతిపై విచారణ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 53 ఎస్సీ, ఎస్టీ కాలనీలకు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పాటు చేయడానికి రూ.23 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. 50 శాతం జనాభా ఉన్న కాలనీలు మాత్రం ఇందులో ఉంటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వర్క్ ఇన్స్పెక్టర్కు 75 ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేయించడం, మరో 75 ఇళ్లు పలు దశల్లో బిల్లులు పంపిణీ చేయించడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో 62 ఏఈ కార్యాలయాలు నిర్మస్తుండగా 50 పూర్తైట్లు చెప్పారు.