గృహ నిర్మాణ సంస్థలో బదిలీలు
రిలీవ్ చేసేందుకు కలెక్టర్ ససేమిరా!
అనంతపురం టౌన్ : గృహ నిర్మాణ సంస్థలో బదిలీలు ముగిసినా రిలీవ్ చేయడానికి మాత్రం కలెక్టర్ వీరపాండియన్ ససేమిరా అంటున్నారు. పర్యవేక్షించే అధికారులెవరూ లేకపోతే జిల్లాలో గృహ నిర్మాణాలు మందగిస్తాయన్న కారణంతో ఇక్కడికి ఎవరైనా బదిలీపై వస్తేనే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తానని స్పష్టం చేశారు. హౌసింగ్‌లో అనంతపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా ఉన్న అమర్‌నాథ్‌రెడ్డిని ప్రభుత్వం కర్నూలు జిల్లా గూడూరుకు మూడ్రోజుల కిందట బదిలీ చేసింది. పెనుకొండ డీఈఈ కుప్పుస్వామిని వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు, గుంతకల్లు డీఈఈ వెంకటేశ్వర్లును చిత్తూరు జిల్లా నగరికి, కదిరి డీఈఈ చంద్రశేఖర్‌ను చిత్తూరు జిల్లా మదనపల్లికి చేశారు.
వీరిలో కదిరి డీఈఈ స్థానంలో వైఎస్సార్ జిల్లా నుంచి సుందర్‌రాజును నియమించడంతో ఈయన బదిలీకి కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన ఇద్దరి స్థానాల్లో ఎవరి నియామకం జరగకపోవడంతో వారిని రిలీవ్ చేయడానికి విముఖత చూపుతున్నారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన వారి స్థానాన్ని భర్తీ చేస్తేనే రిలీవ్ చేయాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ రాజశేఖర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం డివిజన్ డీఈఈ అమర్‌నాథ్‌రెడ్డి స్థానంలో ఇక్కడే కన్‌స్ట్రక‌్షన్స్ ఈఈగా ఉన్న ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించినా ఆయనను రిలీవ్ చేయొద్దని సూచించారు. దీంతో బదిలీ ఉత్తర్వులు వచ్చినా ఉద్యోగులు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. కాగా పెనుకొండ డివిజన్ డీఈఈగా వచ్చేందుకు ప్రొద్దుటూరులో పని చేస్తున్న నాగరాజు రిక్వెస్ట్ బదిలీ పెట్టారు. అయితే ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇప్పటికే బదిలీ ఉత్తర్వులు అందుకున్న అధికారులు తమను రిలీవ్ చేయాలంటూ హౌసింగ్ అధికారులను కోరుతున్నా కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ విషయమై హౌసింగ్ పీడీ రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగులను రిలీవ్ చేసే విషయంలో కలెక్టర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు.