ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా బెడ్ దశలో కడ్డీలు కడుతున్న సిబ్బంది
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు టౌన్ : ఐదేళ్ల పథకం పేరుతో హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద చేపట్టిన గృహనిర్మాణాలు మా కొద్దు అని ప్రజలు తెగేసి చెబుతున్నారు. రూ.8 లక్షలకు పైగా డబ్బు మేము కట్టే స్థితిలో లేమని మాకు ఉచితంగా 2 సెంట్లు స్థలం ఇస్తే మా స్థోమతను బట్టి ఇళ్లు నిర్మించుకుంటామని చెబుతున్నా ప్రభుత్వం ఎన్‌సీసీ సంస్థతో జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభించింది.
జిల్లాలోని కడప కార్పొరేషన్‌తో పాటు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, ఎర్రగుంట్ల, పులివెందుల, మైదుకూరు మున్సిపాలిటీల్లో హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద 19,232 గృహాలు మంజూరయ్యాయి. 2015–16 కు గాను ఫేజ్–1, 2017–18కి గాను ఫేజ్–2 కింద లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో కడప కార్పొరేషన్‌కు ఫేజ్–1లో 2092, ఫేజ్–2లో 2281, ప్రొద్దుటూరులో ఫేజ్–1లో 2000, ఫేజ్–2లో 2150, రాజంపేటలో ఫేజ్–2లో 1279, జమ్మలమడుగుకు ఫేజ్–2లో 1415, ఎర్రగుంట్లకు ఫేజ్–2లో 2046, పులివెందులకు ఫేజ్–2లో 2143, బద్వేల్‌కు ఫేజ్–2లో 888, రాయచోటికి ఫేజ్–2లో 1011, మైదుకూరులో 927 మంజూరు కాగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఫేజ్–1 కింద ఒక్కో బ్లాక్‌లో 32 గృహాలు, ఫేజ్–2లో ఒక్కో బ్లాక్‌లో 48 గృహాలు నిర్మిస్తున్నారు.
డీడీలు చెల్లించే వారు కొందరే...
జీ ప్లస్–3 పద్ధతి కింద ప్రభుత్వం మూడు రకాల గృహాలను నిర్మిస్తోంది. ఇందులో 300, 365, 430 చదరపు అడుగుల్లో నిర్మించే గృహాలకు మొత్తం 245.17 ఎకరాల స్థలాన్ని వినియోగించనున్నారు. ప్రస్తుతం 386 బ్లాకుల్లో 16,773 ఇళ్లను నిర్మిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 71.77 ఎకరాల్లో 11.53 ఎకరాల స్థలానికి హైకోర్టు స్టే ఇవ్వడంతో 22 బ్లాకుల్లో పనులు నిలిచి పోయాయి. ఈ పద్ధతిలో నిర్మించే గృహాలను తీసుకునేందుకు ప్రజలు సుముఖంగా లేరు. బ్యాంకు నుంచి తీసుకునే రుణానికి సంబంధించి 240 నెలల పాటు రూ.3,500 ప్రకారం కంతులు కట్టాల్సి రావడంతో భయపడుతున్నారు. అప్పటి వరకు లబ్ధిదారుల పేరుతో మంజూరయ్యే గృహాలను బ్యాంకుకు తనఖా పెట్టినట్లు లబ్ధిదారుడు ఒప్పుదల పత్రాన్ని బ్యాంకు అధికారులకు అందజేయాలి. దీంతో 30 శాతం మంది కూడా ముందుకు రావడంలేదు.
అంతా ఎన్‌సీసీ ఖాతాకే జమ..
కేంద్రం ఇచ్చే రూ.1.50 లక్షలు, రాష్ట్రం ఇచ్చే రూ.1.50 లక్షలు, బ్యాంకు నుంచి తీసుకునే రూ.3.50 లక్షలు, లబ్ధిదారుని వాటా అంతా నేరుగా ఎన్‌సీసీ సంస్థ ఖాతాకు జమ చేస్తారు. ఈ విధంగా ఒక్కో గృహం నిర్మాణానికి మొత్తం రూ.7.50 లక్షలు ఎన్‌సీసీ సంస్థ వసూలు చేస్తోంది. 2017 నవంబర్ 13వ తేదీన ఎన్‌సీసీ సంస్థ 15 నెలల కాల వ్యవధిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ టిడ్‌కో సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొత్తం రూ.555.19 కోట్లు విలువతో ఈ పనులు చేపట్టింది.
ఇటుకతో కాదు..అంతా మూసే...
ఇళ్లు కడుతున్నారంటే అదేదో పునాదులు వేసి, దానిపై సిమెంట్ బెడ్డు వేసి, ఇటుకలతో గోడలు కట్టి దానిపై సిమెంట్ స్లాబ్ వేస్తారనుకుంటే అంతా పొరపాటే. భూమిలోపల బెడ్ వేస్తారు. వాటిపై నేరుగా సిమెంట్ కాంక్రీటుతో మూస అలికి నట్లు ఇనుప కడ్డీలు వేసి కాంక్రీటు బెడ్డు వేసి గోడ నిర్మాణం చేస్తారు. ఇది అత్యాధునికమైన పద్ధతి అట. ముక్కాలు సెంటులో నిర్మించే ఈ ఇంటికి రూ.8లక్షలు చెల్లించాలా అని లబ్ధిదారుడు ప్రశ్నిస్తున్నాడు.
ఈ పథకం ఐదేళ్లు కొనసాగుతుందా..
హౌసింగ్ ఫర్ ఆల్ స్కీం కింద 2015లో మొదలు పెట్టాల్సిన ఈ పథకం 2018లో మొదలు పెట్టారు. కేవలం ఫేజ్–1, ఫేజ్–2లో కేటాయించిన ఇళ్ల నిర్మా ణం పూర్తి చేసేందుకే 2020 సంవత్సరం పడుతోంది. వీటిని పూర్తి చేస్తేనే మిగిలిన మూడు విడతల్లో గృహాలను కేటాయించనున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి అక్క, చెల్లెమ్మలకు తాళాలు ఇస్తామని వైఎస్సార్‌సీపీ చెబుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే ఇళ్లు తీసుకోవాలని ప్రజలు ఈ గృహాలపై ఆసక్తి చూపడం లేదు.
టిడ్‌కో ఈఈ ఏమంటున్నారంటే...
ఈ విషయంపై టిడ్‌కో ఈఈ లీలాప్రసాద్‌ను వివరణ కోరగా జిల్లాలో 8 మున్సిపాలిటీల్లో ప్రభుత్వం కేటాయించిన విధంగా అన్ని గృహాలకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. డీడీలు కట్టే విధంగా ప్రజలతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఇది ఐదేళ్ల పథకం అన్నారు. మొదటి రెండు విడతల్లో ప్రభుత్వం కేటాయించిన ఇళ్లు పూర్తయ్యాక మిగిలిన మూడు విడతల్లో గృహాల కేటాయింపు పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment