ప్రొద్దుటూరు టౌన్ : ‘సొమ్ము పేదోడిది.. సోకు టీడీపీది అన్నట్లుగా ఎన్టీఆర్ గృహ నిర్మాణాల కార్యక్రమం ఉంది’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. గురువారం మండల పరి ధిలోని గోపవరం గ్రామ పంచాయతీలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ గృహాలను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం కేవలం రూ.80 వేలు మంజూరు చేయడంతో.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదని వారు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చి, 2015–16లో ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండటంతో.. ఇళ్లు అసంపూర్తిగా ఉన్నా హడావిడిగా గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు.
ఒక ఇంటి నిర్మాణానికి ఎంత కనీసమన్నా రూ.7 లక్షల నుంచి 8 లక్షల వ్యయం అవుతుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.లక్షేనని, మిగిలిన రూ.50 వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఎక్కువ మొత్తం లబ్ధిదారుడు పెట్టి నిర్మించుకునే ఇంటికి.. అంతా ప్రభుత్వమే ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. కొంత సహాయం చేశానని చెప్పుకోవాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది రూ.70 వేల నుంచి రూ.80 వేలేనన్నారు. వెంటనే కట్టుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ఉన్న ఇంటిని కూల్చేసి, అదే స్థలంలో నిర్మించుకున్నారని పేర్కొన్నారు.
ఆ మధ్య సమయం దాదాపు 20 నెలల పాటు బాడుగ ఇళ్లలో ఉన్నారని, నెలకు రూ.2 వేలు చొప్పున అద్దె మొత్తం రూ.40 వేలు అయిందని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.1.50 లక్షలో రూ.30 వేలు టీడీపీ నాయకులకు, అధికారులకు లంచం రూపంలో ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు. బాడుగ, లంచం కలిపితే.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుకు సరిపోతోందన్నారు. ఇంటి మొత్తానికి లబ్ధిదారుడే ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. పేదోడు తెచ్చుకున్న అప్పునకు వడ్డీ ఎవరు కడతారన్నారు. అధికార పార్టీ నేతలు పత్రికల్లో ఫోజులు ఇస్తూ అట్టహాసం, ఆర్భాటం చేశారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గృహ ప్రవేశాల పేరిట ఆనంద లోగిళ్లు చూద్దాం రారండి అని అన్నారని.. అయితే అవి అప్పుల గూళ్లు అని విమర్శించారు.
అరకొరగా బిల్లుల చెల్లింపు
జిల్లాలో 45,723 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. నిర్మాణానికి నోచుకున్నవి 15 వేలేనని తెలిపారు. ఈ 15 వేల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసింది 2,725లోనేనని, వీటికి చెల్లించిన బిల్లులు కేవలం రూ.1,97,45,000 అని చెప్పారు. ఈ 15 వేల ఇళ్లకు రూ.1.50 లక్షల ప్రకారం చూస్తే రూ.22 కోట్లు అవుతుందన్నారు. ఇది ఏ శాతమో ప్రభుత్వం చెప్పాలన్నారు. ప్రొద్దుటూరులో మంజూరైన ఇళ్లు 1050 అన్నారు. ఇందులో 201 ప్రారంభించారని, బిల్లులు పూర్తిగా చెల్లించింది 28కేనని చెప్పారు. 1022 ఇళ్లను పూర్తి చేసి బిల్లులు చెల్లించాలని వివరించారు. కార్యక్రమంలో గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాదరెడ్డి, నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, ఓబయ్య యాదవ్, లింగారెడ్డి, దాదాపీర్, రఫీ, వార్డు మెంబర్లు మేరి, ఆదినారాయణరెడ్డి, ఫకృద్దీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment