Proddutur town
-
వరల్డ్ యంగెస్ట్ మల్టీ టాలెంటెడ్ కిడ్
ప్రొద్దుటూరు: బుడి బుడి అడుగులు వేస్తున్న రెండేళ్ల 10 నెలల చిన్నారి వినిశకు నోబెల్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శాస్త్రి నగర్‌కు చెందిన విశ్వనాథుల సౌమ్యప్రియ, పవన్‌కుమార్ కుమార్తె వినిశ ప్రతిభ చూపినందుకు నోబెల్ వరల్డ్ వారు ‘వరల్డ్ యంగెస్ట్ మల్టీ టాలెంటెడ్ కిడ్’ ప్రశంసా పత్రం, మెడల్, రూ.2వేలు అందించారు. ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షలో ఈ చిన్నారి 30 పద్యాలు, సోలార్ సిస్టం, వారాలు, నెలల పేర్లు, చెస్ పెట్టడంలో, 50 జీకే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో ఈ అవార్డు బహూకరించారు. ఈ చిన్నారి గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, కలాం వరల్డ్ రికార్డు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. -
సౌకర్యం ఉన్నా..ఫలితం సున్నా..!
సాక్షి, ప్రొద్దుటూరు : ప్రాణాపాయంలో రక్తం ద్వారా మనిషిని కాపాడవచ్చు. ఎలాంటి ఆస్పత్రుల్లోనైనా మొదటి ప్రాధాన్యత రక్తానిదే. రక్తపు నిల్వలు అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం రక్తపు నిల్వలు లభించడం కష్టతరంగా మారింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాకు రక్తసేకరణ, రవాణా వాహనాన్ని మంజూ రు చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోజూ ఆయా ప్రాంతాల్లో రక్తాన్ని సేకరించి ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రజాదరణ లేక రక్త సేకరణలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అన్ని సౌకర్యాలు కలిగిన వాహనం ఉన్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రూ.48లక్షలతో వాహనం ఏర్పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా దేశంలోని మిగతా జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లాకు రక్తసేకరణ, రవాణ వాహనాన్ని మంజూరు చేశారు. ఇందు కోసం రూ.48లక్షలు వెచ్చించారు. 2017 సెప్టెంబర్ 19న ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఏసీతో కూడిన ఈ వాహనంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా ఈ వాహనం పనిచేస్తోంది. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకు డాక్టర్ కవిత వాహన నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాహనానికి ఇరువురు ల్యాబ్ టెక్నీషియన్లతోపాటు డ్రైవర్ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు నెలకు రూ.19వేలు చొప్పున, డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున వేతనాలు ఇస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో తిరిగినందుకు నెలకు సుమారు రూ.15వేలు డీజల్ ఖర్చు వస్తోంది. నెరవేరని లక్ష్యం నిబంధనల ప్రకారం ఈ వాహనం ద్వారా నెలకు 1500 యూనిట్ల రక్తాన్ని సేకరించాల్సి ఉంది. అయితే ఇందులో సగం యూనిట్ల రక్తం కూడా సమకూరడం లేదని తెలుస్తోంది. 2017లో 1481 యూనిట్లు, 2018లో 3,704 యూనిట్లు మాత్రమే రక్తాన్ని సేకరించారు. కొన్ని నెలల్లో 120 యూనిట్ల రక్తం మాత్రమే సేకరించారు. ప్రధానంగా ప్రచారం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సేకరించిన రక్తాన్ని ప్రతి నెల పులివెందుల, ప్రొద్దుటూరు, కడపలోని మదర్ బ్లడ్‌బ్యాంకులకు అందించాల్సి ఉంది. వీటి ద్వారా జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో రక్తాన్ని నిల్వ చేస్తారు. ప్రతి నెల ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి 500 యూనిట్లు, రిమ్స్‌కు 2వేల యూనిట్లు రక్తపు నిల్వలు అవసరమని సమాచారం. అయితే తగినంత రక్తపు నిల్వలు రాకపోవడంతో ప్రాణాపాయంలో ఉన్న వారు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లో రక్తం తీసుకోవాలంటే తప్పనిసరిగా బదులు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
చంద్రబాబు గిమ్మిక్కులు చూసి మోసపోవద్దు
సాక్షి, ప్రొద్దుటూరుటౌన్ : చంద్రబాబు గిమ్మిక్కులు చూసి ప్రజలు మోసపోవద్దని ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లె పంచాయతీ అమృతానగర్‌లోని వైఎస్ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చకుండా మళ్లీ ఎన్నికలు రెండు నెలల్లో వస్తున్నాయని మభ్యపెట్టే పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రెండేళ్ల క్రితమే వైఎస్ జగన్మోహన్రెడ్డి పింఛన్‌ను రూ.2వేలు ఇస్తానని ప్రకటించారని, తాను కూడా రూ.2వేలు ఇస్తానని చంద్రబాబు ప్రకటిస్తారని చెప్పారన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా తాను అమృతానగర్‌కు వచ్చానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ఈ కాలనీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆనాడు చెప్పానని, అయితే దురదృష్టవశాత్తు అధికారంలోకి రాలేకపోయామన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి తనను, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని పిలిపించి టీడీపీ ప్రభుత్వం అమృతానగర్ను అభివృద్ధి చేయకుండా ఎంత నిర్లక్ష్యం చేసిందో వివరించారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 3,640 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కచ్చితంగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు. రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తా అమృతానగర్ను రూ.150 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాదెడ్డి పేర్కొన్నారు. ఇది కూడా విడతల వారీగా కాకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నిధుల విడుదల చేసే తొలి సంతకంతో ఈ మొత్తాన్ని తీసుకొస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు తప్పక నమ్మాలని తెలిపారు. టీడీపీకి ఎందుకు ఓట్లు వేయకూడదో తాను చెబుతానని, చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు అంతటి మోసగాడు ఎవరూ లేరన్నారు. ఓట్ల కోసం ప్రజలను ఎన్నో విధులుగా మభ్యపెడుతున్నారని, వీటన్నింటినీ ప్రజలు గమనించాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే జిల్లాతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అమృతానగర్ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు తప్ప వేరే పార్టీకి ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు.సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఇదేంది చైర్మన్ గారూ..!
సాక్షి, ప్రొద్దుటూరు టౌన్(వైఎస్సార్) : ఐదు రోజుల క్రితం టీడీపీ 30వ వార్డు కౌన్సిలర్ సీతారామిరెడ్డిని ఫిబ్రవరి, మార్చి నెలల కౌన్సిల్ సమావేశాలకు రాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి ప్లేటు ఫిరాయించడం చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 28వ తేదీన కౌన్సిల్ సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్‌కు దిక్కుతోచలేదు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఈ కౌన్సిల్ సమావేశమే చివరిదిగా చెప్పుకుంటున్నారు. దీంతో కోరం లేక వాయిదా పడిన సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అత్యవసర కౌన్సిల్ సమావేశంగా ఏర్పాటు చేసినట్లు అజెండా రూపొందించి సోమవారం పంపిణీ చేశారు. సస్పెండ్ రద్దు మొదటి అంశంగా... అయితే ఈ అజెండాలో మొదటి అంశంగా సస్పెం డ్ అయిన టీడీపీ కౌన్సిలర్ జి.సీతారామిరెడ్డిని సస్పెండ్ నుంచి తొలగించేందుకు కౌన్సిల్ ముం దుంచారు. జనవరి 31న జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్ ప్రవర్తనకు చైర్మన్ మున్సి పల్ యాక్ట్, 1965 సెక్షన్ 51–5 ప్రకారం రెండు నెలలు సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 27న నోటీసులు జారీ చేశారు. అయితే కౌన్సిలర్ 28న జరిగే కౌన్సిల్ స మావేశంలో సభ్యుల నిర్ణయానికి ఉంచాలని కోరా రు. కానీ ఎలాగైనా సీతారామిరెడ్డిని కౌన్సిల్ సమావేశానికి రాకుండా చేయాలని అజెండాలో ఈ అం శాన్ని చేర్చలేదు. కౌన్సిల్ సమావేశానికి ఎవ్వరూ రాక వాయిదా పడటంతో చైర్మన్ మార్చి నెల సమావేశం మొదటి అంశంగా చేర్చాలని చెప్పారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా సస్పెండ్ చేయడమేంటి సారూ.. కౌన్సిల్ సభ్యున్ని రెండు, మూడు నెలలు సస్పెండ్ చేయాలంటే సస్పెన్షన్‌కు ప్రతిపాదించిన మరుసటి సమావేశంలో కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని చట్టం చెబుతోంది. అయితే అదేదీ తమకు వర్తించదన్నట్లు, రెండు నెలలు సస్పెండ్ చేసిన చైర్మన్ వారం రోజులకే కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అజెండాలోకి తీసుకురావడంపై తోటి కౌన్సిలర్లు నవ్వుకుంటున్నారు. తప్పుడు విధానాల్లో సస్పెండ్ చేసిన చైర్మన్, కమిషనర్లపై కోర్టులో పరువునష్టం దావా వేస్తామని కౌన్సిలర్ సీతారామిరెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నారని కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరైన కౌన్సిలర్లు అంటున్నారు. ముక్తియార్ మాటపై నిలబడతారా... టీడీపీ కౌన్సిలర్ సీతారామిరెడ్డిని సస్పెండ్ చేసిన సందర్భంలో కౌన్సిలర్ ముక్తియార్ స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ఇక తాము ఏ కౌన్సిల్ సమావేశాలకు వెళ్లమని, అన్నీ రిక్విజేషన్ సమావేశాలే నిర్వహిస్తామని చెప్పారు. ఇదే విధంగా మంగళవారం జరిగే సమావేశానికి ఎంపీ రమేశ్ వర్గం టీడీపీ కౌన్సిలర్లు హాజరు కాకుండా మాట నిలబెట్టుకుంటారా, లేక అంతా ఉత్తుత్తి ప్రకటనలేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మెజారిటీ లేకుండానే ర్యాటిఫై... చైర్మన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని కొన్ని అంశాలను ర్యాటిఫై చేయాలని అనుకుంటే మెజారిటీ కౌన్సిల్ సభ్యులు తన వర్గంలో ఉండాలి. అప్పుడు ఆ అంశం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పోతుంది. అయితే ఈ చైర్మన్ వర్గంలో 9 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎంపీ రమేశ్ వర్గంలో 21 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్ రెండో అంశంలోని రూ.39.88 లక్షల పనికి, 3వ అంశంలోని రూ.39 లక్షల పనికి, 6వ అంశంలోని రూ.39 లక్షల పనికి దాదాపు రూ.కోటికిపైగా పనులకు ర్యాటిఫై చేశారు. మరి కౌన్సిల్ సభ్యులు ఈ అంశాలను రద్దు చేయాలనో, వాయిదా వేయాలనో కోరితే పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. చైర్మన్ చర్యలపై భగ్గుమంటున్న టీడీపీ కౌన్సిలర్లు ఈ అంశాలను ఆమోదిస్తారో లేదో వేచి చూడాలి. -
సొమ్ము పేదోడిది.. సోకు టీడీపీదా!
ప్రొద్దుటూరు టౌన్ : ‘సొమ్ము పేదోడిది.. సోకు టీడీపీది అన్నట్లుగా ఎన్టీఆర్ గృహ నిర్మాణాల కార్యక్రమం ఉంది’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. గురువారం మండల పరి ధిలోని గోపవరం గ్రామ పంచాయతీలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ గృహాలను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం కేవలం రూ.80 వేలు మంజూరు చేయడంతో.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదని వారు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చి, 2015–16లో ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండటంతో.. ఇళ్లు అసంపూర్తిగా ఉన్నా హడావిడిగా గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు. ఒక ఇంటి నిర్మాణానికి ఎంత కనీసమన్నా రూ.7 లక్షల నుంచి 8 లక్షల వ్యయం అవుతుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.లక్షేనని, మిగిలిన రూ.50 వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఎక్కువ మొత్తం లబ్ధిదారుడు పెట్టి నిర్మించుకునే ఇంటికి.. అంతా ప్రభుత్వమే ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. కొంత సహాయం చేశానని చెప్పుకోవాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది రూ.70 వేల నుంచి రూ.80 వేలేనన్నారు. వెంటనే కట్టుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ఉన్న ఇంటిని కూల్చేసి, అదే స్థలంలో నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ఆ మధ్య సమయం దాదాపు 20 నెలల పాటు బాడుగ ఇళ్లలో ఉన్నారని, నెలకు రూ.2 వేలు చొప్పున అద్దె మొత్తం రూ.40 వేలు అయిందని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.1.50 లక్షలో రూ.30 వేలు టీడీపీ నాయకులకు, అధికారులకు లంచం రూపంలో ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు. బాడుగ, లంచం కలిపితే.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుకు సరిపోతోందన్నారు. ఇంటి మొత్తానికి లబ్ధిదారుడే ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. పేదోడు తెచ్చుకున్న అప్పునకు వడ్డీ ఎవరు కడతారన్నారు. అధికార పార్టీ నేతలు పత్రికల్లో ఫోజులు ఇస్తూ అట్టహాసం, ఆర్భాటం చేశారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గృహ ప్రవేశాల పేరిట ఆనంద లోగిళ్లు చూద్దాం రారండి అని అన్నారని.. అయితే అవి అప్పుల గూళ్లు అని విమర్శించారు. అరకొరగా బిల్లుల చెల్లింపు జిల్లాలో 45,723 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. నిర్మాణానికి నోచుకున్నవి 15 వేలేనని తెలిపారు. ఈ 15 వేల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసింది 2,725లోనేనని, వీటికి చెల్లించిన బిల్లులు కేవలం రూ.1,97,45,000 అని చెప్పారు. ఈ 15 వేల ఇళ్లకు రూ.1.50 లక్షల ప్రకారం చూస్తే రూ.22 కోట్లు అవుతుందన్నారు. ఇది ఏ శాతమో ప్రభుత్వం చెప్పాలన్నారు. ప్రొద్దుటూరులో మంజూరైన ఇళ్లు 1050 అన్నారు. ఇందులో 201 ప్రారంభించారని, బిల్లులు పూర్తిగా చెల్లించింది 28కేనని చెప్పారు. 1022 ఇళ్లను పూర్తి చేసి బిల్లులు చెల్లించాలని వివరించారు. కార్యక్రమంలో గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాదరెడ్డి, నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, ఓబయ్య యాదవ్, లింగారెడ్డి, దాదాపీర్, రఫీ, వార్డు మెంబర్లు మేరి, ఆదినారాయణరెడ్డి, ఫకృద్దీన్ పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో రూ. 46 లక్షలు పట్టివేత
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ బంధువులకు చెందిన శ్రీకర్ జిన్నింగ్ మిల్లుపై మంగళవారం ఉన్నతాధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా మిల్లులో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన భారీ నగదును ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుని... అదాయపు పన్నుశాఖకు అప్పగించారు. ఉన్నతాధికారుల కథనం ప్రకారం... ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఓటర్లకు పంచేందుకు భారీ మొత్తంలో తీసుకువచ్చిన నగదును ఆయన బంధువుల మీల్లులో ఉంచినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు, ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం సంయుక్తంగా సుధాకర్ యాదవ్ బంధువుల మిల్లుపై దాడులు చేశారు. ఆ క్రమంలో రూ. 46.19 లక్షలు నగదును స్వాధీనం చేసుకుని...అదాయపు పన్ను శాఖకు అప్పగించారు. ఈ పట్టుబడిన నగదుపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.