‘గూటి’ చుట్టూ గజిబిజే..
‘గూటి’ చుట్టూ గజిబిజే..
Published Wed, Aug 9 2017 11:59 PM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM
-‘అందరికీ ఇళ్లు’ పథకంలో తొలగని అయోమయం
-స్పష్టత లేమితో వాయిదాల చెల్లింపులో లబ్ధిదారుల నిర్లిప్తత
-గడువు రెండుసార్లు పెంచినా అంతంత మాత్రపు స్పందన
-ఫ్లాటు రేటుపై విమర్శలతో మెట్టు దిగిన సర్కారు
-టెండర్లు పూర్తయిన తర్వాత ధరల్లో మార్పులు
మండపేట : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అన్న నానుడే.. ఆ రెండు కార్యాలూ ఎంత బరువుబాధ్యతలతో కూడినవో చెపుతుంది. అలాంటప్పుడు.. సర్కారు ‘ఇల్లు కట్టి ఇస్తాం’ అంటే సామాన్యులు, మధ్యతరగతి వారు ఎగిరి గంతేయాలి. అయితే ‘అందరికీ ఇళ్లు’ పథకం’ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ పథకం ఆదిలోనే అనేక సందేహాలకు నిలయంగా మారింది. ‘సరికొత్త టెక్నాలజీ’ అంటూ.. రియల్టర్ల బాటలో.. ఇంకా చెప్పాలంటే వారి కన్నా ఎక్కువగా ఫ్లాట్ రేటు ధర నిర్ణయించిన సర్కారు తొలి నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో సర్కారే భారీ దోపీడీకి రంగం సిద్ధం చేస్తుండటంపై ‘సాక్షి’ దినపత్రికలో ఇప్పటికే కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. నెలవారీ బ్యాంకు వాయిదాలపై స్పష్టత లేకపోవడం, షీర్‌వాల్ టెక్నాలజీపై ఆందోళన, మౌలిక వసతుల భారాన్ని పేదలపైనే మోపడం మొదలైన కారణాలతో తొలి విడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో అభాసు పాలవుతున్న సర్కారు బ్యాంకు రుణం విషయంలో దిగి వస్తోంది.
గత ప్రభుత్వాలు సెంటున్నర స్థలంలో ఇంటి కోసం రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు గృహనిర్మాణ రుణాలు మంజూరు చేస్తే, సొంతంగా కొంత మొత్తాన్ని వేసుకుని పేద వర్గాల వారు రెండు బెడ్‌రూంలు, హాలు, కిచెన్‌లతో ఇళ్లు నిర్మించుకునేవారు. ఆ ప్రకారం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో కేంద్రం రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు కలిపి ఇచ్చే రూ.3 లక్షల సబ్సిడీతో ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. అయితే సరికొత్త టెక్నాలజీ అంటూ సామాన్యుల దోపిడీకి రంగం సిద్ధం చేసింది చంద్రబాబు సర్కారు. చదరపు అడుగుల పేరిట ఫ్లాట్లను మూడు కేటగిరీలుగా విభజించి, వసతుల భారాన్ని పేదలపైనే మోపజూసింది. అందుకోసం లబ్ధిదారుని వాటాతో పాటు బ్యాంకు రుణాల్లోనూ వారిని భాగస్వాములను చేస్తోంది. కేటగిరీ-1లో 300 చదరపు అడుగుల సింగిల్ బెడ్‌రూం ఫ్లాటు, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్‌రూం ఫ్లాటు, 430 చదరపు అడుగుల డబుల్ బెడ్‌రూం ఫ్లాటుగా విభజించింది. జి ప్లస్-3 కింద జిల్లాలో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. తొలి విడతగా రూ.1,457.62 కోట్లతో 19,242 ఫ్లాట్లు మంజూరు చేసింది. కాకినాడ నగర పరిధిలో 4,608 ఫ్లాట్లు, రాజమహేంద్రవరంలో 4,200, పెద్దాపురంలో 1,724, సామర్లకోటలో 1,048, రామచంద్రపురంలో 1,088, మండపేటలో 4,064, పిఠాపురంలో 874, అమలాపురంలో 1,636 ఫ్లాట్లు మంజూరయ్యాయి.
ఇంతవరకూ వాయిదాలు కట్టింది 11,346 మందే..
అయితే ఆ కేటగిరీల్లోని ఫ్లాట్లకు ఎంత వరకూ బ్యాంకు రుణం చెల్లించాలనే విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకూ లబ్ధిదారులకు స్పష్టతను ఇవ్వడం లేదు. వసతుల భారాన్ని తమపైనే మోపడంపై లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తొలివిడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. కేటగిరీ-1లో లబ్ధిదారుని వాటా రూ.500 ఒకే వాయిదాగా, రెండవ కేటగిరీలో లబ్ధిదారుని వాటా రూ.50 వేలకు రూ.12,500లు చొప్పున నాలుగు విడతలుగా, కేటగిరీ-3లో లబ్ధిదారుని వాటా రూ.లక్షకు రూ.25 వేల చొప్పున నాలుగు విడతలుగా చెల్లించాలి. జూలై 20లోగా తొలి విడత వాయిదాలు చెల్లించాలని ప్రకటించిన ప్రభుత్వం లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో గడువు జూలై 31 వరకు పొడిగించింది. అప్పటికి ఫలితం లేకపోవడంతో తాజాగా ఈ నెల 14 వరకు మరోమారు గడువిచ్చింది. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా 11,346 మంది లబ్ధిదారులు మాత్రమే తొలి విడత వాయిదాలు చెల్లించారు. వీరిలో కేటగిరీ-1కు 3,413 మంది డీడీలు చెల్లించగా, కేటగిరీ-2కి 1,346 మంది, కేటగిరీ-3కి 6,587 మంది దరఖాస్తు చేసుకున్నారు.
బ్యాంకు రుణభారం తగ్గింపు..
సాధారణంగా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక ధర తగ్గించడం జరగదు. అయితే అధిక ధరలు నిర్ణయించిందన్న విమర్శలను ఎదుర్కొంటున్న సర్కారు దిగిరాక తప్పలేదు. ఆయా కేటగిరీల్లో లబ్ధిదారుని వాటా మాత్రం యథావిధిగా ఉంచింది. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన 40 రోజుల వ్యవధిలో రెండుసార్లు బ్యాంకు నుంచి తీసుకునే రుణ భారాన్ని తగ్గించింది. వసతుల కల్పనకు ఫ్లాటుకు రూ.1.5 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాగా స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఇటుకలతో ఇల్లు నిర్మిస్తే చదరపు అడుగు రూ.వెయ్యి వరకు మాత్రమే అవుతుందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు వాయిదాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement