‘అందరికీ’ అయోమయం
‘అందరికీ’ అయోమయం
Published Fri, Jun 30 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
- అందరికి ఇళ్ల పథకంలో కొరవడిన స్పష్టత
- చదరపు అడుగు ధరల్లో వ్యత్యాసాలు
- తాత్కాలికమంటూ చదరపు అడుగు రూ. 2,150 నుంచి రూ.1,925లకు తగ్గింపు
- మున్ముందు పెంచేందుకే ‘తాత్కాలికమని’ అనుమానాలు
- షీర్‌వాల్ టెక్నాలజీ పేరుతో సదుపాయాల కల్పన పేదలపైనే
- ఒక్కొక్కరిపై రూ.1.4 లక్షలు అదనపు భారం
- జిల్లాలోని తొలివిడత లబ్ధిదారులపై రూ.269.39 కోట్ల భారం
- విశాఖలో ప్రైవేటు సంస్థ ప్లాటు చదరపు అడుగు ధర రూ.1,050లే.
మండపేట : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు ఎండీగా ఉన్న కనస్ట్రక్షన్ సంస్థ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్లాటులో చదరపు అడుగు ధర (స్థలం కాకుండా) రూ.1,050. ఈ మేరకు పేదవర్గాల వారికి ప్రభుత్వం నిర్మించే ప్లాట్లలో చదరపు అడుగు ధర ఇంతకన్నా తక్కువ ఉండాలి. అయితే అందరికీ ఇళ్ల పథకంలో ప్రభుత్వం చదరపు అడుగుకు నిర్ణయించిన ధర రూ. 1,925లు. షీర్‌వాల్ టెక్నాలజీ అంటూ స్థానిక స్థితిగతులకు తగని విధానంలో ప్లాట్ల నిర్మాణం చేయడంతోపాటు సదుపాయాల కల్పన భారాన్ని పేదలపై మోపుతోంది. పట్టణ ప్రాంతాల్లోని పేదవర్గాల వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన ‘అందరికి ఇళ్ల పథకం’లో ధరల వ్యత్యాసం లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తోంది. గతంలో నిర్ణయించిన చదరపు అడుగు ధరను ‘తాత్కాలికం’ పేరిట స్వల్పంగా తగ్గించి లబ్ధిదారులతో అంగీకార పత్రాలను తీసుకుంటోంది. సదుపాయాల కల్పన భారాన్ని ప్రజలపైనే మోపుతోంది. ఈ మేరకు ఒక్కో లబ్ధిదారునిపై రూ.1.4 లక్షలు చొప్పున జిల్లాలోని తొలివిడతలో నిర్మించనున్న 19,242 మందిపై దాదాపు రూ. 269.39 కోట్లు భారాన్ని మోపుతోంది. పట్టణ ప్రాంతాల్లో పేదవర్గాల వారి ఇళ్ల నిర్మాణం కోసం 2015–16లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాకు 24,332 మంజూరు చేసింది. కాకినాడ నగర పాలక సంస్థకు 4,608 ప్లాట్లు, రాజమహేంద్రవరానికి 4,200 ప్లాట్లు మంజూరు చేయగా, పెద్దాపురం మున్సిపాల్టీకి 1,724, సామర్లకోటకు 1,048, రామచంద్రపురానికి 1,088, మండపేటకు 4,064, పిఠాపురానికి 874, అమలాపురానికి 1,636 ప్లాట్లు మంజూరయ్యాయి. తొలి విడతగా తుని మినహా మిగిలిన నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 19,242 ప్లాట్లు నిర్మాణానికి రూ.1,457.62 కోట్లు విడుదల చేసింది.
ప్రస్తుత ధరలు తాత్కాలికమేనా ?
అందరికి ఇళ్ల పథకంలో ప్లాటు ధరలపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో ‘తాత్కాలికం’ పేరిట మూడు కేటగిరీల్లో చదరపు అడుగుకు రూ. 80లు నుంచి 100లు వరకు తగ్గించింది. ఈ మేరకు గతంలో రూ. 2,150 ఉన్న చదరపు అడుగు ప్రస్తుతం 1,925లకు తగ్గింది. గతంలో రూ. 6.46 లక్షల వ్యయంతో 300 చదరపు అడుగుల వైశాల్యంలో సింగిల్ బెడ్‌రూం ప్లాటు, రూ. 7.8 లక్షలతో 365 చదరపు అడుగుల వైశాల్యంలో సింగిల్ బెడ్ రూం ప్లాట్, రూ.9.14 లక్షలతో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్‌రూం ప్లాటు చొప్పున మూడు విభాగాలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఆయా విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల రూపంలో లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం 300 అడుగుల ప్లాటును రూ. 5.77 లక్షలకు, 365 చదరపు అడుగుల ప్లాటు రూ. 6.94 లక్షలు, 430 అడుగుల ప్లాటుకు రూ. 8.14లుగా ధర నిర్ణయించింది. సబ్సిడీలు షరామామూలే. ఇది తాత్కాలికమేనని లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్న అంగీకార పత్రంలో పేర్కొనడం గమనార్హం. మండపేట పట్టణంలో 4,064 ప్లాట్లు నిర్మాణానికిగాను ఇటీవల గొల్లపుంతకాలనీలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమిపూజ చేశారు. ప్రస్తుత ధర తాత్కాలిక ధరగా అంగీకార పత్రంలో ఉండటంతో భవిష్యత్తులో ఈ ధర పెరిగే అవకాశముందని లబ్ధిదారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల్లో స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రూ. 269.39 కోట్లు భారం...
ప్రస్తుతం ప్లాట్ల నిర్మాణ పనులకుగాను జిల్లాలోని ఆయా ఏరియాలను బట్టి చదరపు అడుగుకు రూ.1600లు వరకు ధర నిర్ణయించి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ మేరకు చదరపు అడుగులోని మిగిలిన మొత్తం మౌలిక వసతుల కల్పన కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. డబుల్ బెడ్‌రూం తీసుకున్న లబ్ధిదారునిపై వసతుల కల్పన రూపంలో రూ.1.4 లక్షలు భారాన్ని మోపుతోంది. జిల్లాలో 90 శాతం మందికి పైగా డబుల్ బెడ్ రూం ప్లాటు కోరుకోగా తొలివిడతలో నిర్మిస్తున్న 19,242 మంది లబ్ధిదారులపై దాదాపు రూ. 269.39 కోట్లు భారం పడుతుందని అంచనా. తాత్కాలిక ధర పెరిగితే ఈ భారం మరింత పెరగనుంది.
Advertisement